తెలంగాణ

మాతృభాషా బోధనతోనే విద్యార్థికి మనోవికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 7: ప్రస్తుత సమాజంలో ఆంగ్ల మాధ్యమంపై ఎనలేని మోజు నెలకొనడంతో విద్యావిధానం ఎంతో లోపభూయిష్టంగా మారిందని, దీనిని సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రముఖ విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్యా బోధన జరిగినప్పుడే అది విద్యార్థి మనోవికాసానికి దోహదపడుతుందని, కనీసం పాఠశాల స్థాయి వరకైనా మాతృభాషలోనే పాఠ్యాంశాలు బోధించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో ‘తెలుగు భాషా విధానం’పై చర్చాగోష్ఠి ఏర్పాటు చేశారు. ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిధిగా హాజరుకాగా, తెలుగు భాషా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ వెల్చాల కొండల్‌రావు, తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ పి.సాంబయ్య, పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య లింబాద్రితో పాటు ప్రముఖ విద్యావేత్తలు, భాషా, సాంస్కృతిక, సామాజిక ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధానంగా విద్యా వ్యవస్థలో వస్తున్న నూతన పోకడలు మాతృభాష అయిన తెలుగుకు చేటు చేకూర్చేలా ఉన్నాయని ఒకింత ఆందోళన వెలిబుచ్చారు. తెలుగును పరిరక్షించుకునేందుకు కేవలం మమకారం చూపించడంతోనే సరిపెట్టుకోకుండా మాతృభాషలో విద్యా బోధన జరిగేలా చూడాల్సిన ఆవశ్యకత ఉందని ఈ వేదిక ద్వారా ప్రభుత్వాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎంతో ఆందోళన కలిగించేదిగా ఉందని, అనేక క్లిష్ట పరిస్థితుల్లో తన పయనం సాగిస్తోందని అన్నారు. పరిపాలనా యంత్రాంగం విద్యా వ్యవస్థను నిర్ణయించాల్సి ఉండగా, 21వ శతాబ్దంలో మార్కెట్ రంగం ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తున్నట్టుగానే విద్యా వ్యవస్థను కూడా తన అధీనంలోకి తీసుకుని నియంత్రిస్తోందని అభిప్రాయపడ్డారు. విద్యా విధానంపై అధ్యయనం కోసం కేంద్రం నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ తన రిపోర్టును అందించనున్న నేపథ్యంలో పార్లమెంటులో జరిగే చర్చ సందర్భంగా మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యకత గురించి గట్టిగా వివరించాలని ఎంపి కవితను కోరారు. డాక్టర్ వెల్చాల కొండర్‌రావు మాట్లాడుతూ సిబిఎస్‌ఇ విధానం పుణ్యమా అని పాఠశాల విద్యా వ్యవస్థ మూడింతలకు పైగా కేంద్రం ఆధీనంలోకి చేరిపోయిందన్నారు. ఎంపి కవిత మాట్లాడుతూ, మాతృభాష పట్ల అందరికీ మమకారం ఉన్నప్పటికీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఏ ప్రాంతంలోనైనా ఉద్యోగాలు పొందవచ్చనే భావనతో ఆంగ్ల విద్యా బోధన వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. దశాబ్దాల కాలం క్రితం నుండే మన మధ్యలోకి చొచ్చుకువచ్చిన ఆంగ్ల భాషను ఉన్నపళంగా తొలగించలేమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కెజి టు పిజి విద్యా విధానంలో తెలుగు మాధ్యమంలోనూ బోధన కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రి దృష్టికి తెస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమన, మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు.
, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు ప్రొఫెసర్ కె.యాదగిరి, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్, డాక్టర్ త్రివేణితో పాటు తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.