ఆంధ్రప్రదేశ్‌

రెక్కలు విప్పుతున్న మధురపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయం విస్తరణకు ఎయిర్‌పోర్టు అధారిటీ శ్రీకారం చుట్టింది. రూ.181 కోట్ల నిధులతో చేపట్టే విస్తరణ పనులకు 19వ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గురుప్రసాద్ మహంతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
బ్రిటీష్ హయాంలో నిర్మించిన మధురపూడి విమానాశ్రయం చాలా పురాతనమైనది. గత పుష్కరాలకు విమానాశ్రయం నుండి నైట్ ల్యాండింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటుచేశారు. ప్రయాణికుల రద్దీకూడా పెరగడంతో విమానాల రాకపోకలు కూడా పెరిగాయి. ఒఎన్‌జిసి, గెయిల్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్, షిప్ యార్డులు, పెట్రో కారిడార్, కెఎస్‌ఇజడ్ తదితర కార్యకలాపాల వల్ల దీని ప్రాధాన్యతతో పాటు ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. దీంతో జెట్ ఎయిర్ వేస్, ట్రూజెట్, స్పైస్ జెట్ సేవలు ప్రారంభమయ్యాయి. విస్తరణ పనుల శంకుస్థాపన పూర్తయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో ఎంఒయుపై సంతకాలు జరుగుతాయి. దీని వల్ల రాష్ట్రంలో అంతర్‌జిల్లా సర్వీసులు నడుపుకోవచ్చు. ఈ మేరకు మధురపూడి ఎయిర్ పోర్టు నుంచి విశాఖ, గన్నవరం, తిరుపతి, కడప విమానాశ్రయాలకు విమానాలను నడుపుతారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు 366 ఎకరాల విస్తీర్ణంలో వుంది. మరో 857 ఎకరాలు భూమిని సేకరించి అప్పగించారు. విస్తరణ పనులన్నీ 21 నెలల్లోగా పూర్తి చేయాలని నిర్దేశించినప్పటికీ, ఏడాదిలోనే పూర్తిచేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రెండు విమానాలకు సరిపడా రన్ వే వుంది. దీన్ని ఐదు విమానాల స్థాయికి విస్తరిస్తున్నారు. 5000 అడుగుల రన్ వేను ప్రస్తుతం 10,500 అడుగులకు పొడిగిస్తున్నారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయంలో 72 నుంచి 82 సీటింగ్ కలిగిన ఎటిఆర్ విమానాలు మాత్రమే ఆగుతున్నాయి. విస్తరణతో ఎ 321, ఎ 320, బోయింగ్ 737 వంటి పెద్ద పెద్ద విమానాలు కూడా నిలిపే అవకాశముంటుంది.
23 నుంచి మరిన్ని సర్వీసులు
ఈ నెల 23 నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు ట్రూజెట్ సంస్థ కొత్త విమానాన్ని ప్రవేశపెడుతోంది. ఇది కేవలం గంటన్నరలో బెంగళూరు వెళ్తుంది. ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం నుంచి విమానం బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి ఉదయం 11.10 గంటలకు మరో విమానం ఇక్కడకు వస్తుంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు ఉదయం 9 గంటలకు మాత్రమే విమానం వుంది. ఉదయం 7.30 గంటలకే రాజమహేంద్రవరం నుంచి మరో విమానాన్ని నడుపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రస్తుతం ఇక్కడ నుంచి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరే విమాన సమయాన్ని 5.20 గంటలకు ట్రూ జెట్ సర్వీసు మార్పుచేసింది.