తెలంగాణ

వణికిస్తున్న విషజ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా డెంగీ, వైరల్ ఫీవర్ సోకుతుండడంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. పట్టణాలు, పల్లెల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పారిశుధ్యం లోపం కారణంగానే వ్యాధులు విజృంభిస్తున్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యమని ప్రతిపక్షాల నాయకులు విరుచుకుపడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం వాతావరణ పరిస్థితుల్లో మార్పులను సాకుగా చూపిస్తూ తేలిగ్గా దాట వేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు 697 మందికి వైరల్ ఫీవర్ లక్షణాలు కనిపించడంతో, వారి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా 120 మందికి విష జ్వరాలు సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ నగరంలోనే వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లా ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు సరిపోయేంతగా లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లోని ప్రజలు సతమతమవుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు 4800 మంది వివిధ వ్యాధుల బారిన పడ్డారు. ఏజెన్సీ పల్లెల్లో మహిళలు, కిషోర బాలికలు రక్తహీనతకు గురవుతూ మృత్యువాత పడుతున్నారు. జిల్లాలోని 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 32 మంది వైద్యుల కొరత, 280 మంది ఎఎన్‌ఎం, ల్యాబ్ అసిస్టెంట్, ఫారా మెడికల్ సిబ్బంది నియామకాలు జరపకపోవడంతో వైద్యసేవలు లేక రోగాలు ప్రబలడానికి కారణమవుతోంది.
నల్లగొండ జిల్లాలో అధికారిక లెక్కల మేరకు ఇప్పటి వరకు 17 మందికి డెంగ్యూ వ్యాధి సోకినట్లుగా నిర్థారణ కాగా, మరో ఐదుగురి రక్తనమూనాలను పరీక్షలకు పంపించారు. జిల్లాలో 16 మందికి మలేరియా సోకినట్లు సమాచారం.
కరీంనగర్‌పై వైరల్ ఫీవర్ పంజా విసిరింది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 874 మంది వ్యాధుల బారిన పడ్డారు. ప్రతి రోజూ ఒపి నమోదు 30 శాతం పెరుగుతోంది. జిల్లాలో 80 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జ్వరాలతో 23 మంది మృతి చెందినట్లు సమాచారం.
వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో 80 కేసులు నమోదయ్యాయి. టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు సోకిన వారితో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

నయాం నన్ను సిఎంగా చూడాలనుకున్నాడు

నయాంతో ఆర్థిక సంబంధాలు లేవు
బిసి ఉద్యమాన్ని అణచివేసేందుకే నాపై కుట్ర
నరుూం లొంగిపోవాలనుకున్నాడు
బిసి సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 16: గ్యాంగ్‌స్టర్ నరుూంతో తనకు సంబంధాలు ఉండేవని, అయితే అవి ఆర్థికపరమైనవి కావని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. తాను టిఆర్‌ఎస్‌లో చేరనందుకే, బిసి ఉద్యమాన్ని అణిచి వేసేందుకే నరుూం వ్యవహారాలతో సంబంధాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా కుట్ర అని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గ్యాంగ్ స్టర్ నరుూంతో ఓ ఉద్యమ నాయకునికి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుండడంతో కృష్ణయ్యనే స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. తాను రాడికల్ యూనియన్‌లో పనిచేసిన రోజుల్లోనే నరుూంతో పరిచయం ఉండేదని, తాను ముఖ్యమంత్రి కావాలని నరుూం ఆకాంక్షించేవాడని ఆయన తెలిపారు. నరుూంతో నెలన్నర క్రితం మాట్లాడానని, పోలీసుల ముందు మరో ముగ్గురితో కలిసి లొంగిపోవాలని అనుకున్నాడని ఆయన చెప్పారు. నరుూం అరాచకాలను తాను సమర్థించడం లేదని, ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే దీనిపై సిట్‌తో విచారణ జరిపిస్తే సరిపోదని, సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నరుూం కేసులో ప్రభుత్వం తనపై బురద చల్లాలని ప్రయత్నించడం బాధాకరమని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం నరుూంతో కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. నరుూంతో తనకు ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నట్లు సిట్ నిరూపిస్తే చట్టపరమైన శిక్షకు సిద్ధమేనని ఆయన తెలిపారు. నరుూంతో సెటిల్‌మెంట్లు చేయలేదని, నరుూం చేసే పనుల గురించి తనకు అంతగా తెలియదని అన్నారు. నరుూం వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులకు, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తనలాంటి నిజాయితీపరున్ని టార్గెట్ చేయడం భావ్యం కాదని అన్నారు. నరుూం బాధితులు కూడా కొంతమంది తన వద్ద గోడు చెబితే, తాను నరుూంకు ఫోన్ చేసి అమాయకులను వేధించవద్దని తిట్టేవాడినని కృష్ణయ్య తెలిపారు. తాను అధికార పార్టీలో చేరలేదు కాబట్టి నరుూం వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నరుూంను కలవక చాలా రోజులైందని ఆయన తెలిపారు. బిసి ఉద్యమాన్ని అణిచి వేసేందుకు తనకు నరుూంతో సంబంధాలు ఉన్నట్లు దుష్ప్రచారం, కుట్ర చేస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతున్నదని ఆర్. కృష్ణయ్య మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

మహబూబ్‌నగర్‌ను ముంచెత్తిన వాన
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 16: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ధ్రోణితో మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పాలమూరు పట్టణంటలో మరోసారి భారీ వర్షం కురిసింది. దాదాపు 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లు చెరువుల్లా తలపించాయి. జిల్లాలోని చెరువులు నీటితో కలకలలాడుతున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. భారీ వర్షానికి పెద్దచెరువు కాలువ పొంగిపొర్లుతోంది. పెద్దచెరువు అలుగుపారుతోంది. కాగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వర్షాదార పంటలు జొన్నపంట దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. జిల్లా ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయ.
నల్లగొండ జిల్లాలో 18.5 మి.మీ. వర్షపాతం
నల్లగొండ: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కూడా ముసురు వర్షలుగా కొనసాగాయి. జిల్లాలో 54 మండలాల్లో వర్షాలు పడగా సగటు 18.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదగిరిగుట్ట మండలంలో 70.2, దామరచర్ల మండలంలో 70.2, నకిరేకల్‌లో 68, కేతెపల్లిలో56, చండూర్‌లో 49.2, తుర్కపల్లిలో 48.6, బీబీనగర్‌లో 45.8, బొమ్మలరామారంలో 45.2, మేళ్లచదర్వులో 37.2, గుండాలలో 35.4, సూర్యాపేటలో 35.4, భువనగిరిలో 30.2మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పులిచింతల ప్రాజెక్టుకు 23.23 టిఎంసిలకు చేరగా ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి ఆగింది. పోచంపల్లి, బీబీనగర్, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దామరచర్ల, తిప్పర్తి, కేతెపల్లి, శాలిగౌరారం మండలాల చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లాయి. కాశీవారిగూడెం చెరువు కాలువ తెగి తిప్పర్తి రోడ్డు మీదుగా ప్రవహించడంతో రోడ్డు తెగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కరీంనగర్‌లో...
కరీంనగర్: జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో రాత్రి సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మొత్తం జిల్లాలో 1,163.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, సగటున 20.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.

నిండుకుండ మూసీ
644.2 అడుగులకు చేరిన నీటిమట్టం
ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం
కేతేపల్లి, సెప్టెంబర్ 16: నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండవ అతిపెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన మూసీ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం రాత్రికి 644.2 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాలైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న విస్తారంగా వర్షాలు కురవడంతో మూసీ ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చిచేరుతుండడంతో గురువారం 642 అడుగులగా ఉన్న నీటిమట్టం రెండు అడుగు పెరిగి 644.2 అడుగులకు చేరింది. ప్రస్తుతం 4600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 644.5 అడుగులకు చేరగానే గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించడంతో ఏక్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు 1500క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రాజెక్టు ఏఈ రమేష్ తెలిపారు.

జూరాల ఆరు గేట్లు ఎత్తివేత
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 16: కృష్ణా పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు వరద ఉద్ధృతి పెరగడంతో ఆరుగేట్లను శుక్రవారం రాత్రి ఎత్తివేశారు. ప్రాజెక్టుకు వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయంలోకి 62850 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టులో నుండి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ 40వేల క్యూసెక్కుల నీటిని జూరాల నుండి లిప్ట్‌ల ద్వారా ఈ మూడు ప్రాజెక్టులకు ఎత్తిపోస్తున్నారు.