తెలంగాణ

వర్షాల హోరు... కష్టాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/ వరంగల్/ మహబూబ్‌నగర్/ నిజామాబాద్/ సంగారెడ్డి/ నల్గొండ, సెప్టెంబర్ 22: తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడం, నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిసేపు ముసురు, ఉన్నట్లుండి వర్షం కురుస్తూండటంతో ప్రజాజీవనం అస్తవ్యస్తం అవుతోంది. పంట పొలాలు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జిల్లాల వారీగా వర్షాకాలం కష్టాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాలో...
జిల్లాలోని మెజారిటీ మండలాలు వర్షాలతో అతలాకుతలమైనాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, జగిత్యాల మండలాల్లో పిడుగులు పడి విద్యుత్ పరికరాలు, టీవీలు దగ్ధమయ్యాయి. మల్లాపూర్‌లో పిడుగుపాటుకు రెండిళ్లు దగ్ధమయ్యాయి. మహదేవ్‌పూర్ మండలంలో వాగులు పొంగిపొర్లడంతో పంకెన, పలిమెల, సర్వాయిపేట, పెద్దంపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్లలో 5.5 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.
నిజామాబాద్ జిల్లాలో..
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మద్నూర్, మాక్లూర్ మండలాల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలతో శ్రీరాంసాగర్, కౌలాస్‌నాలా, సింగూరు ప్రాజెక్టులకు భారీగా వరదనీరు చేరుతోంది. ఎగువనుంచి 4వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతూండటంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బాన్సువాడ-బిచ్కుంద మార్గంలో పెద్దదేవాడవద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో నీటినిల్వ 52 టిఎంసిలకు చేరుకుంది. మోర్తాడ్ మండలంలో పిడుగుపాటుకు టెలివిజన్ సెట్లు, విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి.
మెదక్ జిల్లాలో..
సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడ్, రేగోడ్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, పుల్కల్, సదాశివపేట సహా పలు ప్రాంతాల్లో ఆగిఆగి భారీవర్షాలు కురిశాయి. ప్రధాన రహదార్లతో సహా అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. అయితే నిన్నటితో పోలిస్తే కాస్తంత తెరపి ఇవ్వటంతో సింగూరు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నెమ్మదించింది. రామాయంపేటలో అత్యధికంగా 4 సెం.మీ వర్షపాతం నమోదైంది.
వరంగల్ జిల్లాలో...
వరంగల్‌లో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజీపేట బాపూజీనగర్, సోమిడి, తిలక్‌నగర్, డిసిల్‌కాలనీల్లో ఇళ్లు జలమయమయ్యాయి. పరకాలలో చలివాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా వాగు దాటుతున్న మొగుళ్లపల్లికి చెందిన యువకుడు సతీష్ గల్లంతయ్యాడు. వరంగల్‌లో చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
గూడూరు-మహబూబాబాద్ మార్గంలో సబ్‌స్టేషన్‌వద్ద కల్వర్టుపై మూడు అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. ఊట్ల, నేలవంచ, దొరవారితిమ్మాపురం జలమయమయ్యాయి. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. 18004252747 టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో..
జిల్లా అంతటా భారీవర్షాలు కురిశాయి. తాడూరులో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో దుందుభి నది ఉరకలెత్తింది. డిండి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అచ్చంపేట మండలంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. కాగ్నా నది ఉద్ధృతి బాగా పెరిగింది. తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా ఇదే. జిల్లాలో సగటున 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో కుంటలు, వాగులు, నదులు పోటెత్తాయి. వర్షానికి తోడు ఈదురుగాలులు ఇబ్బందులు సృష్టించాయి.
నల్గొండ జిల్లాలో..
జిల్లాలోని 59 మండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. మూసీ కుడికాలువకు గండి పడింది. బీమారం రోడ్ కాజ్‌వే మీదుగా మూసీ పరవళ్లు తొక్కడంతో మిర్యాలగూడ-సూర్యాపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చివ్వెంలలో పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. పెద్దరావులపల్లి, పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కనుముక్కలలో వంద ఎకరాల వరిపంట నీటమునిగింది. రామలింగపల్లిలో పిడుగుపాటుకు పశువులు మరణించాయి. మిర్యాలగూడలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఉప్పనేనివాగు పొంగిపొర్లగా ఆ మార్గంలో వెళుతున్న లారీ కొట్టుకుపోయింది. లారీ డ్రైవర్, క్లీనర్‌లను స్థానికులు రక్షించారు. బొత్తలపాలెం, నార్కట్‌పల్లి-అద్దంకి రహదార్లపై వరదనీరు ప్రవహిస్తోంది. వీరభద్రపురంలో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. నాగార్జునసాగర్ ఎర్త్‌డ్యాం సమీపంలోని పాత మంచినీటి ట్యాంకు కుప్పకూలిపోవడంతో సాగర్-మాచర్ల మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో నడికుడి-సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను మిర్యాలగూడ నుంచి వెనక్కు పంపారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.