రాష్ట్రీయం

సర్వసన్నద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: భారీ వర్షాలు, వరదల వల్ల ఎలాంటి విపత్కర పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొవడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖలు సిద్థంగా ఉండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఆస్తి నష్టం జరిగితే పూడ్చుకోవచ్చు, కానీ ప్రాణ నష్టం సంభవిస్తే పూడ్చలేమని, వరదల నేపథ్యంలో అలాంటి పరిస్థితి రాకుండా యంత్రాంగం అప్రమత్తం కావాలని బలంగా ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వర్షాలు, వరదల తాజా పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో ఆదివారం సిఎస్ రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ శర్మ, సిఎంఓ అధికారులతో సిఎం సమావేశమై అక్కడి నుంచే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల వల్ల పట్టణాలు, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మనుషులు, పశువులకు ప్రాణ నష్టం కలుగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పని చేయాలన్నారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండి కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని, కంట్రోల్ రూమ్‌లకు వచ్చే సమాచారంపై అప్పటికప్పుడు స్పందించాలన్నారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోదావరి నది ఉప్పొంగుతుందని, ప్రమాదస్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. గోదావరికి ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుందని, తెలంగాణ పరిధిలోని శ్రీరామ్‌సాగర్, నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, సింగూరు తదితర ప్రాజెక్టులన్నీ నిండాయన్నారు. వీటినుంచి నీరు విడుదల చేస్తుండటంతో గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతూనే ఉందన్నారు. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేస్తుండటంతో సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని, ప్రాజెక్టుల దిగువ ప్రాంతంలో వచ్చే వరదల వల్ల ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశించారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి అలాగే వాగులు, వంకలు నుంచి భారీగా గోదావరి నదిలోకి నీరు చేరుతుందన్నారు. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గోదావరి ప్రవాహ ఉద్ధృతి ఈ రాత్రికి ఎనిమిది లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారుల అంచనా వేస్తున్నారన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏటూరు నాగారంలో వరంగల్ కలెక్టర్ వాకాటి కరుణ, భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బస చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని సిఎం సూచించారు. గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయని, ఇన్‌ఫ్లోలను, అవుట్ ఫ్లోలను నిర్దారించుకుని అధికారులను అప్రమత్తం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు. గండిపేట, హిమాయత్‌సాగర్‌తో పాటు రాష్ట్రంలో దాదాపు అన్ని చెరువులు నిండుతున్నాయన్నారు. చెరువులు అలుగులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కరువు తీరిపోయేలా, మరో రెండేళ్ల వరకు కరువు దరి చేరని విధంగా వర్షాలు కురుస్తున్నాయని, దీని వల్ల భూగర్భ జల మట్టాలు పెరిగి గొట్టపు బావుల్లో పుష్కలంగా నీరు లభించనుందన్నారు. గోదావరి, కృష్ణ నీళ్లను హైదరాబాద్ మంచినీటి అవసరాల కోసం వాడాలని, గండిపేట, హిమాయత్‌సాగర్ నీళ్లను యధావిధిగా ఉంచడం వల్ల నగరంలో భూగర్భ జలాల మట్టం పెరగడానికి దోహదం చేస్తుందని సిఎం సూచించారు.