తెలంగాణ

ఓటుకు నోటు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: ఓటును నోటుతో గెలిచేందుకు అన్ని పార్టీల్లోని మెజారిటీ అభ్యర్థులు ప్రయత్నాలు చేశారు. మద్యాన్ని ఏరులై పొంగించారు. పోలింగ్ ముందురోజు ప్రలోభాలకు తెరలేపడంతో అనేక ప్రాంతాల్లో పార్టీల మధ్య ఘర్షణల వాతావరణం చోటుచేసుకుంది. అనేకచోట్ల అభ్యర్థులకు అనుకూలంగా పనిచేస్తున్న శ్రేణుల మధ్య ఘర్షణల వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో పలువురిపై కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ ఎన్నికలో ఓట్ల కోసం అభ్యర్థులు చివరి రోజు శక్తిమేరకు ఓటర్లకు వల విసిరారు. కొందరు అభ్యర్థులు ఓటుకు నోటు ఎర చూపారు. మరికొందరు మద్యం, డబ్బులు, చీరలు, ఫ్యాన్లు పంచుతూ పట్టుబడ్డారు. నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో అభ్యర్థులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ప్రధాన పార్టీల కార్యకర్తల పరస్పర దాడులతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీడిమెట్లలో సోమవారం ఓట్లను కొనేందుకు నానా తంటాలు పడ్డారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ జగద్గిరిగుట్టలోని రాజీవ్ గృహకల్పలో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మగ్దూమ్‌నగర్‌లో తెరాస అభ్యర్థికి చెందిన వ్యక్తి మద్యం బాటిళ్లు పంచుతూ ఇతర పార్టీ నేతలకు దొరికిపోయాడు. దీంతో మిగిలిన పార్టీల శ్రేణులు ధర్నాకు దిగాయి. పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డినగర్ డివిజన్‌లో ఓ మహిళా నాయకురాలి ఇంట్లో డబ్బులు పంచుతున్నారని తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. సూరారం డివిజన్‌లో స్వతంత్ర అభ్యర్థి సీలింగ్ ఫ్యాన్‌లు పంచుతుండగా పోలీసులు పట్టుకున్నారు. మరో స్వతంత్ర అభ్యర్థి, మహిళలకు చీరలు పంచేందుకు ఏకంగా చీరలు తీసుకొచ్చినట్టు సమాచారం. అదేవిధంగా సూరారం డివిజన్‌లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒక్కో ఓటును రూ.500 నుండి వెయ్యి రూపాయలకు కొన్నట్టు తెలిసింది. సుభాష్‌నగర్ డివిజన్‌లో సైతం అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, గాజులరామారం, చింతల్ డివిజన్‌లలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హయత్‌నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి జరిగింది. హైదర్‌గూడ డివిజన్‌లో తెరాస నేతలు డబ్బులు పంచుతున్నా పట్టించుకోవడంలేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, డివిజన్ తెదేపా అభ్యర్థి ప్రసాద్ తదితరులు ధర్నాకు దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తెదేపా కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అటు పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కుత్బుల్లాపూర్ 131వ డివిజన్‌లో తెరాస అభ్యర్థి కెఎం గౌడ్ అనుచరులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా విపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి తెరాస కార్యకర్తలు ఉడాయించారు. అదేవిధంగా 126వ డివిజన్‌లో తెరాస అభ్యర్థి జగన్ అనుచరులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తుండగా సిపిఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. జిల్లెలగూడలో తెరాస కార్యకర్తలు, నేతలు మద్యం పంచుతున్నారంటూ బిజెపి కార్యకర్తలు వారితో ఘర్షణకు దిగారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని బిజెపి కార్యకర్తలు అడ్డుకొని ఆయన కారును ధ్వంసం చేశారు.
కిడ్నాప్ అభియోగంపై ఎమ్మెల్యేపై కేసు
కిడ్నాప్ చేసి నిర్బంధించి బెదిరించి డబ్బులు లాక్కున్నారన్న అభియోగంపై ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, అతని అనుచరులు జగదీష్, బుచ్చిరెడ్డిలపై స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన బ్రహ్మదేవర ఆనంద్ సోమవారం రామంతాపూర్ భవానీనగర్‌లో ఉండగా కొందరువచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావంటూ నిలదీసి ఎమ్మెల్యే రమ్మంటున్నారని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. నిర్బంధించి బెదిరించి తన జేబులో ఉన్న డబ్బులు లాక్కున్నారని ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్, అతని అనుచరులపై సెక్షన్ 363, 506, 384 కింద కేసు నమోదు చేశారు.
బిజెపి నేతలపై కేసు
వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం పెద్దాపురానికి చెందిన కుమారస్వామి హైదరాబాద్ రామంతాపూర్‌కు వచ్చాడు. సోమవారం ఉదయం స్నేహితుడి వద్ద టిఫిన్ చేసి మాట్లాడుతుండగా, బిజెపికి చెందిన జగన్‌యాదవ్ అతని సోదరుడు శ్రీకాంత్, బాలకృష్ణ, జగదీష్, రవి, నర్సింహ, సతీష్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావంటూ దాడికి దిగారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిజెపి నేతలపై సెక్షన్ 341, 324, 506 కింద కేసులు నమోదయ్యాయి.
తప్పుడు కేసులు పెట్టారు
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రామంతాపూర్‌లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే, అధికార పార్టీ నేతల ఒత్తిడిపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్యే ప్రభాకర్ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి జిల్లాల నుంచి రప్పించి వారితో డబ్బులు పంపిణీ చేసినట్టు తమవద్ద ఆధారాలు ఉన్నాయని వివరించారు.

చిత్రం... 1. మగ్దూమ్‌నగర్‌లో తెరాస శ్రేణుల నుంచి స్వాధీనం చేసుకున్న
మద్యం బాటిళ్లను చూపుతున్న తెదేపా ఎమ్మెల్యే

చిత్రం... 2. ఓటర్లను ప్రలోభపెడుతున్న తెరాస నేత నుంచి
ప్రచార పత్రాలు లాక్కుంటున్న ఇతర పార్టీల కార్యకర్తలు