తెలంగాణ

మంజీరకు మళ్లీ వరద పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, అక్టోబర్ 4: మహారాష్ట్ర, కర్నాటకలో మంజీర నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మంజీర నదికి మళ్లీ వరద పోటెత్తింది. సింగూర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 78 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్‌లోకి వదిలిపెడుతున్నారు. 2 మీటర్ల ఎత్తులో ఏడు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. మంజీర నదికి దక్షిణ దిశలో ఉన్న ఆయా ప్రాంతాలకు చెందిన వాగులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నీటిరాక కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది. నారింజ, డబ్బావాగు, జీర్లపల్లి వాగు, గంగకత్వ వాగు, నందివాగుల నుంచి మంజీర నదిలోకి పుష్కలంగా వరద వచ్చి చేరుతోంది. గత శుక్రవారం రాత్రి జహీరాబాద్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురియడంతో ఆయా మండలాలకు చెందిన జనజీవనం చిన్నాభిన్నం కాగా పంటలన్నీ నీటమునిగి అన్నదాతలు నట్టేట మునిగిన విషయం తెలిసిందే. కురిసిన కుండపోత వానలతో ఒక్కసారిగా వరద వచ్చి చేరడంతో సింగూర్ ప్రాజెక్టు ప్రమాదకరస్థితికి చేరుకుంది. అధికారులు సకాలంలో స్పందించి ఏకకాలంలో 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసి కష్టం మీద వరద నీటిని అదుపులోకి తీసుకువచ్చారు. పెద్ద మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేయడంతో మెదక్-బొడ్మట్‌పల్లి వెళ్లే మార్గంలో వంతెనను తాకుతూ నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేసారు. తాజాగా మహారాష్ట్ర, కర్నాటకల్లో కురుస్తున్న వర్షాలతో మంజీర నది ప్రమాదకరస్థాయిలో పరవళ్లు తొక్కు తోంది. సింగూర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల నీటి సామర్థ్యానికి సరిపోయేంత మిగులు నీటిని గోదావరి నదిలోకి వదిలిపెట్టారంటే మంజీర వరద పోటేమిటో స్పష్టమవుతోంది. ఇప్పటివరకు సుమారు 46 టిఎంసిల నీటిని సింగూర్ నుంచి దిగువకు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రెండేళ్లుగా వర్షాలు లేక వెలవెలబోయిన సింగూర్, మంజీర, ఘన్‌పూర్, నిజాంసాగర్ ఆనకట్టలన్ని పొంగి పొర్లుతున్నాయి. అట్టహాసంగా జరగాల్సిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను సైతం ఏడుపాయల దేవస్థానం వద్ద గోకుల్ షెడ్‌లో నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆలయానికి వెళ్లరాని పరిస్థితిలో మంజీర నది ప్రవహిస్తుండడంతో నిత్య పూజలు నిలిచిపోయాయి. నిజాంసాగర్ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌తో పాటుగా మంజీర నది పరుచుకుని ప్రవహిస్తుండడంతో మెదక్, పాపన్నపేట మండలాల్లో వేలాది ఎకరాల విస్తీర్ణంలో వరి పంట నీట మునిగింది. మరో నెల వ్యవధిలో కోత కోయాల్సిన పరిస్థితిలో వరి నీట మునగడంతో అన్నదాతలు కనీసం పెట్టుబడులను కూడా దిగుబడి చేసుకోలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు జరిగిన పంటల నష్టాన్ని అంచన వేయడంలో అధికారులు నిమగ్నమైనా మంజీర నదికి వరద పోటు తగ్గకపోవడంతో దిగువ ప్రాంతాల్లోని పంటలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తోంది.

చిత్రం.. సింగూర్ ప్రాజెక్టు 7 గేట్లు తెరుచుకోవడంతో దిగువకు పరుగులు పెడుతున్న వరద నీరు