తెలంగాణ

ఆరని మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: జిల్లాలు, మండలాల పునర్విభజనపై చెలరేగిన ఆందోళనల మంటలు ఆరడం లేదు. ‘ప్రజాభీష్టం మేరకే జిల్లాలు, మండలాల పునర్విభజన చేస్తాం’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెబుతున్నా, కొత్తగా గద్వాల, అసిఫాబాద్ వంటి జిల్లాలను పెంచేందుకు అంగీకరించినా ఇంకా ఆందోళనలు, ఒత్తిళ్ళు పెరుగుతూనే ఉన్నాయి. చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్‌పిటిసీలు, ఇతర నాయకులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ములుగులో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్థం చేయగా, స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గడ్‌లో ఆందోళనలు మిన్నంటాయి. సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని ముగ్గురు యువకులు బెదిరించడం, ఉట్నూరు జిల్లా కోసం గిరిజనులు ఆందోళనలకు దిగడం జరిగింది.
గిరిజనుల ఆగ్రహం..
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో విభజన చిచ్చు రగులుతున్నది. ముఖ్యమంత్రి అసిఫాబాద్ జిల్లా ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడంతోనే ఏజెన్సీ ఆదివాసీల్లో అసంతృప్తి జ్వాల ఎగిసిపడింది. గిరిజనులు ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఉట్నూరు ఏజెన్సీ పరిథిలోని ఉట్నూలు, జైనూర్, నార్నూర్, సిర్పూర్‌యు, ఇంద్రవెల్లి మండలాల్లో ఈ బంద్ జరిగింది. ఆదివాసి గిరిజన గ్రామాలను పునర్విభజన పేరిట విడదీస్తూ ఆదివాసి గిరిజనుల సంస్కృతి, ఐక్యతను దెబ్బ తీస్తున్నారని వారు ఆరోపించారు. జన్నారం మండలాన్ని మంచిర్యాలలోనే విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రహదారిపై అఖిలపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు.
రోడ్డెక్కిన జనం..
మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలత తెలపడంతోనే నారాయణపేట జిల్లా కోసం జనం రోడ్డెక్కారు. తమ ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా జిల్లా ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానికులు రోడ్లపై టైర్లను వేసి పెద్ద మంటలు పెట్టి, రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, పెనుగులాట జరిగింది. మక్తల్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లోనే ఉంచాలని, గద్వాలలో కలిపితే తానూ రాజీనామా చేస్తానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి హెచ్చరించారు.
సిద్దిపేటలో కలవం..
వరంగల్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ములుగుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ములుగు జిల్లా చేయాలని సిఎంపై వత్తిడి తేవడంలో విఫలమైన జిల్లా మంత్రి చందులాల్ రాజీనామా చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా చేయాలని అఖిలపక్షణ ఇచ్చిన బంద్ విజయవంతమైంది. ముగ్గురు యువకులు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామనడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసు అధికారులు వారిని నచ్చజెప్పి కిందకు దించారు. కొత్తగా ఏర్పాటు కానున్న జనగామలో కలవమని, వరంగల్ అర్బన్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గడ్ మండలాల ప్రజలు ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో రెండు గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా చేయాలని వారు నినాదాలు చేశారు.
మన్యం ప్రజల ఆగ్రహం..
జిల్లాల పునర్విభజనను నిరసిస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా నుంచి వాజేడు, వెంకటాపురం మండలాలను వేరు చేసి భూపాల్‌పల్లి జిల్లాలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి చేసిన సూచనపై అన్ని రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు తప్పుబట్టాయి. వెంకటాపురం మండలంలో అఖిలపక్షం 72 గంటల బంద్‌ను నిర్వహించింది. ఈ బంద్‌లో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పాల్గొన్నారు. ఎంపిపి, జెడ్‌పిటిసీలు, ఎంపిటిసీలు, సర్పంచ్‌లు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఆదివాసీ జిల్లా కావాలని తాము పోరాటం చేస్తుంటే ప్రభుత్వం ఆదివాసీ జాతిని విచ్ఛిన్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే జిల్లాల పునర్విభజన వ్యవహారం ఎప్పటికప్పుడు కొత్త సమస్యలకే ఆజ్యం పోస్తున్నట్టు కనిపిస్తోంది.

చిత్రం... మక్తల్‌లో రాయచూరు - హైదరాబాద్ అంతర్రాష్ట్ర రహదారిపై ఆందోళన చేస్తున్న ప్రజలు