తెలంగాణ

సెక్షన్ 8 శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం పాతబస్తీలో కాంగ్రెస్ సీనియర్ నేతలపై దాడికి పాల్పడిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులను వెంటనే అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని అఖిలపక్షం గవర్నర్, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8కింద గవర్నర్‌కు శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించి పాతబస్తీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో తలెత్తిన పరిణామాలపై మొదటిసారిగా కాంగ్రెస్, తెలంగాణ తెదేపా, బిజెపి, వైకాపాలు ఒక వేదికపైకి వచ్చాయి. సిఎల్పీ నేత జానారెడ్డి, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, బిజెపి నుంచి శాసనసభాపక్ష నేత లక్ష్మణ్, వైకాపా ప్రధాన కార్యదర్శి శివకుమార్ హాజరయ్యారు. ఈ నేతలు తొలుత అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమై ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండ, కాంగ్రెస్ నేతలపై దౌర్జన్యం, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వీరంగం, దౌర్జన్యంపై చర్చించారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డిని కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. తమ పార్టీ నేతలపై జరిగిన దాడిని వివరించారు. మూడు డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరారు.
ఈ సందర్భంగా సిఎల్పీ నేత జానారెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, తెదేపా అధ్యక్షుడు రమణ, బిజెపి పక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అధికార తెరాస మజ్లిస్‌తో కుమ్మక్కై కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ తదితరులపై మజ్లిస్ కార్యకర్తలతో దాడి చేయించారన్నారు. తక్షణమే గవర్నర్ సెక్షన్ 8కింద విచక్షణాధికారాలు ఉపయోగించుకుని ఈ ఘటనలకు బాధ్యులను అరెస్టుచేసేలా పోలీసులను ఆదేశించాలన్నారు. తాము రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకుని రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులను వివరించనున్నట్లు చెప్పారు. పాతబస్తీకి వెళ్లిన ఉత్తమ్‌కుమార్, షబ్బీర్‌అలీని ఉద్దేశించి ‘మా పరిధిలోకి ఎలా వచ్చారు’ అంటూ ఒవైసీ సోదరులు ఇష్టం వచ్చినట్టు అప్రజాస్వామికంగా మాట్లాడారన్నారు. ఈ దాడిలో షబ్బీర్ అలీ కుడికంటికి గాయమైందన్నారు. జంగమ్మెట్‌లో బిజెపి ఎస్సీ అభ్యర్ధి మహేందర్‌పైన దాడికి దిగిన అక్బరుద్దీన్ ఒవైసీ, అతని అనుచరులపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంకింద కేసు నమోదు చేయాలన్నారు. గతంలో ఆదిలాబాద్‌లో విద్వేషాలు ప్రేరేపించేలా అక్బరుద్దీన్ ఒవైసీ ఉపన్యాసాలు ఇచ్చారన్నారు. ఈ కేసులో పోలీసులు ఇంతవరకు చార్జిషీటు దాఖలు చేయలేదన్నారు. మంగళవారం పాతబస్తీలో జరిగిన ఘటనలపై విచారణకు ఆదేశించాలని, ఒవైసీ సోదరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి రక్షణ కల్పించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తుంటే తెరాస ప్రభుత్వం చోద్యం చూస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, బిజెపి ఎమ్మెల్సీ ఎస్ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. కాగా పాతబస్తీ ఘటనలో బాధ్యులైన మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని తెలంగాణ సిపిఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సెక్షన్ 8 ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద సెక్షన్ 8 శాంతి భద్రతల అధికారాలను గవర్నర్‌కు దఖలుపరిచారు. కాగా ఈ సెక్షన్‌ను అమలు చేయాల్సిన పనిలేదని ఇంతకాలం తెలంగాణ కాంగ్రెస్, బిజెపి, తెదేపా వాదిస్తూ వచ్చాయి. కాగా మంగళవారం పాతబస్తీలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో గవర్నర్ సెక్షన్ 8ని ఉపయోగించి శాంతి భద్రతలను పరరిక్షించే విషయంలో జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ పార్టీలు కోరడం విశేషం.

చిత్రం... మజ్లిస్ అరాచక దాడులపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞాపనపత్రం అందిస్తున్న అఖిలపక్ష నేతలు