తెలంగాణ

జన దిగ్బంధంలో భద్రాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 5: జిల్లాల పునర్విభజన రచ్చకెక్కింది. తెలంగాణ ప్రభుత్వం తీరును అధికార పార్టీ నేతలు సైతం తప్పుపడుతూ నిరసన గళం విప్పారు. ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాలను వరంగల్ జిల్లాలో నూతనంగా ఏర్పడనున్న భూపాల్‌పల్లిలో విలీనం చేయాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని తూర్పారబడుతున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా నిర్వహించిన బంద్ ఉద్రిక్తతలకు వేదికయింది. వెంకటాపురంలో అధికారపార్టీ నేతలతో సహా అఖిలపక్షం నాయకులు అర్ధనగ్నంగా ప్రదర్శనలు చేసి, గుండుగీయించుకున్నారు. వంటావార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. జనజీవనాన్ని స్తంభింప చేశారు. వాజేడు మండలంలో పూసూరు వంతెనపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలం నియోజకవర్గంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహిళలు, యువకులు, వృద్ధులు వయోభేదం లేకుండా అంతా రోడ్డెక్కారు. ఊళ్లకు ఊళ్లన్నీ రోడ్డు మీదకు వచ్చి కదం తొక్కాయి. భద్రాచలం పట్టణంలో అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి బంద్ పాటించాయి. ఇదే సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీతో సహా మిగిలిన పార్టీల నేతలు ఎమ్మెల్యేను రాజీనామా చేసి ఒత్తిడి తేవాలని నినాదాలు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన సిపిఎం శ్రేణులు ముందుగా అధికార పార్టీకి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేయాలని ప్రతి నినాదాలు చేశారు. ఒకానొక దశలో బాహాబాహీకి దిగగా సిపిఐ నేత రావులపల్లి రాంప్రసాద్ వారిని వారించారు. చివరకు సిఐ బాణాల శ్రీనివాసులు, పట్టణ ఎస్సై కరుణాకర్‌లు రంగప్రవేశం చేసి వారిని సముదాయించారు. ఉద్రిక్తతలను నివారించారు. జలగం వెంకట్రావు భద్రాచలంలో పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా ముందు చూపుతో సిఐ శ్రీనివాసులు అఖిలపక్ష నేతలతో చర్చలు జరిపి ఆందోళనను విరమింప చేశారు. అనంతరం ఆందోళనకారులలు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సిపిఎం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో తాను గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. భద్రాచలంను జిల్లాగా ప్రకటించాలని, వాజేడు, వెంకటాపురం మండలాలను భద్రాచలం నియోజకవర్గంలోనే కొనసాగించాలని, ఆంధ్రాలో విలీనమైన కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకులపాడు, పురుషోత్తపట్నం, గుండాల పంచాయితీలను తిరిగి భద్రాచలంలో కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వెంకటాపురంలో శిరోముండనం చేయించుకుంటున్న అఖిలపక్షం నేతలు * ఎమ్మెల్యే సున్నం రాజయ్య నేతృత్వంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

నేటి నుంచి
రాజయ్య దీక్ష

ఖమ్మం, అక్టోబర్ 5: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సమయంలో అనూహ్యంగా భద్రాచలం జిల్లా కోసం పోరాటం ప్రారంభమైంది. ఇప్పటికే 31 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం కేంద్రంగా ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలని అక్కడి శాసన సభ్యుడితో పాటు అన్ని పార్టీల నాయకులు బుధవారం నుంచి ఆందోళనలు ప్రారంభించారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కాగానే భద్రాచలం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన చేసిన నేతలు తాజాగా భూపాలపల్లిలో కలపనున్న వెంకటాపురం, వాజేడు మండలాలను భద్రాచలంలోనే ఉంచాలనే డిమాండ్‌తో ప్రారంభమైన ఉద్యమం భద్రాచలాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనే దశకు చేరుకున్నారు. గిరిజనుల్లో ప్రధానమైన లంబాడాలు అధికంగా ఉండే మహబూబాబాద్ ప్రాంతాన్ని జిల్లాగా చేశారని, గోండులు అధికంగా నివసించే ఆసిఫాబాద్ ప్రాంతాన్ని జిల్లాగా చేస్తున్నారని, కోయలు అధికంగా నివసించే భద్రాచలాన్ని ఎందుకు జిల్లాగా చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా గిరిజన, అటవీ ప్రాంతంగా ఉన్న భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలుపుతూ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గురువారం నుంచి సిపిఎంకు చెందిన భద్రాచలం శాసన సభ్యుడు సున్నం రాజయ్య ఆమరణ నిరాహార దీక్షను చేయనున్నారు.