తెలంగాణ

కొంగొత్త తెలంగాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ధూమ్‌ధామ్ ఏర్పాట్లు చేశారు. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సిద్దిపేటలో సిఎం కెసిఆర్ నేటి ఉదయం 11.13 నిమిషాలకు కొత్త జిల్లాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సిద్దిపేట జిల్లాగా ఆవిష్కరిస్తారు. సరిగ్గా అదే సమయానికి మంత్రులు మొత్తం 20 జిల్లాలను ప్రారంభిస్తారు. నిన్నటి వరకూ 10 జిల్లాలుగావున్న తెలంగాణ, నేటినుంచి 31 జిల్లాల తెలంగాణగా సాక్షాత్కరించనుంది. హైదరాబాద్ జిల్లా వినా మిగిలిన తొమ్మిది జిల్లాలను 30 జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు పలు ప్రాంతాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి డిమాండ్ ఉంది. ఎంతోకాలంగా ఎదురు చూసిన కొత్త జిల్లాలు సాకారం కావడంతో ఆయా ప్రాంతాల ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తొలుత 27 జిల్లాల ఏర్పాటుకు ముసాదాయి విడుదల చేశారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల కోసం ఆయా ప్రాంత ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నేతల నుంచి డిమాండ్లు పెరగడంతో, చివరలో ఆ నాలుగు జిల్లాలను సైతం చేర్చారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్గం సుగమమైంది. దసరా రోజున రాష్ట్రంలో ప్రజలం తా సంతోషంగా ఉంటే, ఆ నాలుగు ప్రాంతాల వారు మాత్రం ఎందుకు అసంతృప్తితో ఉండాలంటూ సిఎం కెసిఆర్, ఆ నాలుగు జిల్లాలకు సైతం సుముఖత వ్యక్తం చేయడంతో కొత్త జిల్లాల ప్రారంభం రోజున రాజకీయంగా అసంతృప్తి సమసిపోయింది. సిద్దిపేటను జిల్లా చేయాలని గతంలో సిద్దిపేటలో పెద్దఎత్తున ఉద్యమాలు సాగాయి. సిద్దిపేటలో స్వయంగా సిఎం కెసిఆర్ జిల్లాను ప్రారంభిస్తున్నందున మిగిలిన జిల్లాల కన్నా ఇక్కడ హడావుడి ఎక్కువగా ఉంది. సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభింస్తారు. పాత బస్టాండ్ వరకు రథయాత్ర ఉంటుంది. అనంతరం బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడతారు. ఆరువేల మంది మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. వెయ్యిమంది కళాకారుల ప్రదర్శన ఉంటుంది. బహిరంగ సభ తరువాత జిల్లా ఏర్పడినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ 30వేల లడ్డూలను పంపిణీ చేయనున్నారు. జిల్లాగా అవతరించిన సిద్దిపేట ఇప్పటికే ముస్తాబైంది. గంట పాటు బాణసంచా పేల్చి, 50వేల బెలూన్లను ఎగురవేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. జిల్లా ఏర్పడుతున్న సందర్భంగా సిద్దిపేటలోని ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల వారు కుటుంబీకులతో సిఎంకు స్వాగతం పలుకుతారు. ఇదేవిధంగా అన్ని జిల్లాల్లోనూ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఉదయం 11.15కు పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 12 గంటలకు పెద్దపల్లిలో బహిరంగ సభ జరుగుతుంది. 12.45కు ఎస్పీ ఆఫీసును ప్రారంభిస్తారు. సూర్యాపేట జిల్లాను అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేటలో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి జగదీశ్‌రెడ్డి కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కామాక్షి ఇంజనీరింగ్ కాలేజీలో కలెక్టరేట్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కులు పంపిణీ చేస్తారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్‌లతో పాటు ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాగా అవతరిస్తున్న జగిత్యాల కలెక్టరేట్ అందంగా ముస్తాబైంది. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి బూర్గపల్లిలో ఉదయం 10.31కి ప్రారంభిస్తారు. 12గంటలకు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వికారాబాద్ జిల్లా కోసం అనేక సంవత్సరాలుగా స్థానికులు ఆందోళనలు చేశారు. కల సాకారం కావడంతో ఘనంగా జిల్లా ప్రారంభోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్‌లను ప్రారంభించిన తరువాత మొదటి రోజు నుంచే జిల్లా కార్యాలయాల్లో పనులు ప్రారంభించాలని సిఎం ఇప్పటికే ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందజేస్తారు. మంత్రులందరికీ జిల్లాల ప్రారంభోత్సవాల బాధ్యతలు అప్పగించారు. అన్ని జిల్లాల్లోనూ పండుగ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్‌లు జిల్లాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుందని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు.