తెలంగాణ

తెలుగుదేశం కనుమరుగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో టిడిపి క్రమంగా కనుమరుగవుతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టిడిపికి ఘోర పరాజయం ఎదురు కావడమే ఇందుకు నిదర్శనం. గ్రామీణ ప్రాంతా ల్లో ఫలితాలు ఎలా ఉన్నా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తమకు తిరుగులేదని టిడిపి ఇప్పటివరకూ విశ్వసిస్తూ వచ్చింది. నగరానికి చెందిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించినా, తిరిగి అసెంబ్లీకి ఎన్నిక కావాలంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లే కీలకం కాబట్టి టిఆర్‌ఎస్ తరఫున గెలువలేమనే అభిప్రాయంతో పార్టీ వీడేందుకు కొందరు ఎమ్మెల్యేలు ఇష్టపడలేదు. ఒక ఎమ్మెల్యే ఏకంగా క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, మీడియాతో మాట్లాడిన తరువాత తన మనసు మార్చుకున్నారు. గ్రేటర్‌లో ఊహించని విధంగా టిడిపి పరాజయం పాలు కావడంతో పలువురు టిడిపి సీనియర్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.
టిడిపి ఆవిర్భవించిన తరువాత 1983లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతంలో టిడిపికి మెజారిటీ వచ్చినా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లొచ్చాయి. అయితే ఆ తరువాత తెలంగాణ ప్రాంతం టిడిపికి కంచుకోటగా మారింది. తెలంగాణ ఉద్యమం ఆవిర్భావం నుంచి తెలంగాణలో టిడిపికి కష్టాలు మొదలయ్యాయి. 2004లో నగరంలో టిడిపికి ఒక్క సీటే వచ్చింది. మొత్తం తెలంగాణలో పది సీట్లు వచ్చాయి. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తుతో తిరిగి తెలంగాణలో టిడిపి పుంజుకుంది. చివరకు తెలంగాణ ఏర్పడిన తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నగరంలో టిడిపి సత్తా చాటింది. ఆ తరువాత తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా టిడిపికి పరాజయం తప్పడం లేదు. శాసన మండలిలో ప్రస్తుతం టిడిపికి ప్రాతినిధ్యమే లేదు. తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి గెలుచుకున్నది ఒకే ఒక కార్పొరేటర్ సీటు. ఇక శాసనసభ విషయానికి వస్తే తెలంగాణలో టిడిపి తరఫున 15 మంది విజయం సాధిస్తే, ప్రస్తుతం తొమ్మిదిమంది మిగిలారు. వీరిలో ఆర్ కృష్ణయ్య పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ ఫలితాల తరువాత వీరిలో ఎంతమంది మిగులుతారనే కలవరం పార్టీ నాయకుల్లో మొదలైంది. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి- టిడిపి ఉమ్మడిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాయి. అయితే వరంగల్‌లో సైతం అదే విధంగా పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కలేదు. ‘నేను ఇక్కడే పుట్టాను, చెడ్డీలు వేసుకుని ఇక్కడే తిరిగాను’ అంటూ తాను స్థానికుణ్నేనని చెప్పుకునేందుకు లోకేశ్ గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నో పాట్లు పడ్డారు. అలాగే చంద్రబాబు చివరి రెండు రోజుల్లో సుడిగాలి పర్యటన చేసి, రోడ్‌షోలు నిర్వహించారు. అయినా తండ్రీకుమారుల శ్రమ వృథా అయింది. ఆంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా నివసించే శివారు ప్రాంతాల్లోనే ప్రచారం విస్తృతంగా చేసినా ఫలితం లేకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి. త్వరలో జరగనున్న నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ టిడిపి పరిస్థితి చెప్పుకోదగిన విధంగా లేదు. గ్రేటర్ ఫలితాల తరువాత అక్కడ టిడిపి శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. ఖేడ్‌లో ప్రధానంగా పోటీ టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే సాగుతోంది.