తెలంగాణ

సిఎస్ రాజీవ్ శర్మ వారసుడెవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు వారసుడెవరు? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సిఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజీవ్ శర్మ వచ్చే నవంబర్ చివరి వరకు పదవిలో ఉంటారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలు కొత్త సారథికి అప్పగించక తప్పదు.
ప్రస్తుతం ఐఏఎస్‌ల సీనియారిటీ జాబితాలో కె ప్రదీప్ చంద్ర, శేఖర్ ప్రసాద్ సింగ్ (ఎస్‌పి సింగ్), ఎంజి గోపాల్, వినోద్‌కుమార్ అగర్వాల్ (వికె అగర్వాల్) టాప్ లిస్టులో ఉంటారు. వీరితోపాటు వినయ్‌కుమార్, రంజీవ్ రక్కర్ ఆచార్య కూడా ఉన్నారు. వినయ్‌కుమార్ ప్రస్తుతం కేంద్ర సర్వీసులో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ప్రదీప్ చంద్ర సర్వీసు 2016 డిసెంబర్ చివరితో పూర్తవుతుంది. అంటే రాజీవ్ శర్మ తర్వాత ఒకవేళ ప్రదీప్ చంద్రకు అవకాశమిస్తే సర్వీస్ ప్రకారం నెల మాత్రమే బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. గతంలో రఘోత్తమరావు ఇదేవిధంగా నెలరోజులు మాత్రమే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సిఎస్‌గా పని చేశారు. తెలంగాణ ఆవిర్భావం నుంచీ రాజీవ్ శర్మ సిఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ శర్మ వాస్తవంగా 2016 మే నెలతో సర్వీసు పూర్తి చేయాల్సి ఉంది. అయితే తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాజీవ్‌శర్మ నేతృత్వంలోనే కొనసాగుతుండటంతో మధ్యలో ఆయన సేవలు ఆగిపోకూడదని సిఎం కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయం 2013-14 మధ్య కాలంలో కేంద్ర సర్వీసులో ఉన్న సమయంలో రాజీవ్ శర్మ కీలక భూమిక పోషించారు. ఆ అనుభవంతో తెలంగాణ రాష్ట్రానికి ఆయన సేవలు ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శర్మకు అవకాశమిచ్చారు. తాజాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణలో శర్మ సేవలు వినియోగించుకునేందుకు వీలుగా తొలుత మూడు నెలలపాటు అంటే ఆగస్టు చివరివరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. తర్వాత రెండో పర్యాయం నవంబర్ చివరివరకు పదవీ కాలాన్ని పొడిగించారు. కెసిఆర్ కోరిక మేరకు ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని ఆదేశాల మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2016 డిసెంబర్ ఒకటి నుంచి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ స్థానంలో మరొకరు బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. శర్మ పదవీ విరమణ తర్వాత ప్రదీప్‌చంద్రకు నెలరోజులే వ్యవధి ఉండటం, ఎస్‌పి సింగ్ పదవీ విరమణ సమయం 2018 జనవరి చివరివరకు ఉండటం ఇక్కడ గమనార్హం. ఇక మిగిలిన వారిలో ఎంజి గోపాల్, వినోద్‌కుమార్ అగర్వాల్ ముఖ్యులు. వీరిద్దరూ 2017 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగుతారు. వీరిద్దరి పేర్లు సైతం సిఎం కెసిఆర్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సిఎస్‌గా ఎవరికి కెసిఆర్ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయాన్ని అంచనా వేయలేమని సాధారణ పరిపాలనా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నమ్మకం కలిగిన వారికే
సిఎం కెసిఆర్‌కు నమ్మకం కలిగిన వారికే పదవి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వికె అగర్వాల్ పేరును కెసిఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కెసిఆర్ మదిలో ఎవరున్నారన్న అంశాన్ని ఎవరూ అంచనా వేయలేరని సచివాలయ ఉద్యోగ సంఘ నేత ఒకరు ఆంధ్రభూమి వద్ద వ్యాఖ్యానించారు.