తెలంగాణ

కొత్త పాలనకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్/నల్లగొండ/కరీంనగర్/వరంగల్, అక్టోబర్ 12: కొత్త జిల్లాల్లో దసరా రోజు నుండి పరిపాలన ఆరంభమవ్వగా తొలి రోజు నూతన కలెక్టరేట్‌ల ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభల్లో లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరుతో పాలనకు శ్రీకారం చుట్టారు. దసరా పండుగ రోజున కొత్త జిల్లాలలో పదవీ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లు తమ పని విధానం ఎలా ఉంటుందో అధికారులకు, సిబ్బందికి స్పష్టం చేసారు. పనితీరు, ప్రజలకు సేవలు అందించే విషయంలో జాగరూకతతో వ్యవహరించాలని హెచ్చరికలు చేసారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి కొత్తగా విడిపోయిన నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో కొత్త కలెక్టర్లు, ఎస్పీలు లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే వర్క్‌టుసర్వ్ కింద సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ కావడంతో మంగళవారం సిబ్బంది విధుల్లో చేరారు. బుధవారం మొహర్రం పండగ సెలవుదినం కావడం, జిల్లా అధికారులు కొలువుదీరిన కొత్త కార్యాలయాల్లో ఫర్నిచర్, ఇతర వౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేదు. తలమడుగు మండలం ఝరిపూన గూడ గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నిర్మించే సామాజిక ఫంక్షన్ హాల్‌కు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు భూమిపూజ చేశారు.
సూర్యాపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జి.జగదీష్‌రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్‌లు సమభావన మహిళా సంఘాలకు 5 కోట్ల రుణాలు మంజూరు చేస్తు చెక్కుల పంపిణీ చేశారు. పలువురు వృద్ధులకు ఆసరా పింఛన్లు మంజూరు చేశారు. అలాగే యాదాద్రి కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్‌లు 125సమభావన మహిళా సంఘాలకు 5కోట్ల రుణ పంపిణీ చెక్కును పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలో పలువురికి ఆసరా పింఛన్లు, కొందరు వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. గ్రామైక్య మహిళా సంఘాలకు రూ. 10 కోట్లు రుణాలను పంపిణీ చేశారు. సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ప్రారంభాలు, బాస్‌ల బాధ్యతల స్వీకరణ, పరిచయ కార్యక్రమాలు మాత్రమే కొనసాగగా, పాత కరీంనగర్ జిల్లాలో కూడా బాధ్యతల స్వీకరణ తప్ప ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగలేదు. వరంగల్ రూరల్ జిల్లా ప్రారంభమైన కొన్ని గంటలకే కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులతో సమీక్ష, కలెక్టరేట్‌లో అవసరమైన సౌకర్యాల గురించి పరిశీలన జరిపారు. ఉదయం 11.20 గంటలకు కొత్త జిల్లా ప్రారంభం, కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్ పాటిల్ పదవీబాధ్యతల స్వీకరణ, ప్రారంభోత్సవ సభతో సుమారు రెండుగంటలు గడిచాయి. ముఖ్యఅతిథులు, ఇతర ప్రముఖులు వెళ్లిపోయిన వెంటనే కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. అనంతరం సాయంత్రం మరోసారి కలెక్టరేట్‌కు వచ్చి కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించి అక్కడ ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల గురించి, ఫర్నీచర్ గురించి విభాగాధిపతులతో చర్చించారు. ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, నగరపాలక సంస్థ అధికారులను పిలిపించి ఆయా శాఖల ద్వారా చేపట్టవలసిన వసతుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసారు. కాగా, మహబూబాబాద్ కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రీతిమీనా అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని పరోక్షంగా హెచ్చరికలు చేసారు. వచ్చేనెల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని, అన్ని కార్యాలయాలను కలెక్టరేట్‌కు అనుసంధానం చేస్తామన్నారు. భూపాలపల్లి కలెక్టర్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన మురళి ప్రస్తుత జిల్లా కేంద్రం భూపాలపల్లిలో అధికారులు, సిబ్బంది వెంటనే నివాసం ఉండేందుకు కొంత ఇబ్బందికరమైనా, సమయపాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
సెలవు రోజున మండలాల పర్యటనలు.. అధికారులతో సమావేశాలు
కాగా, భూపాలపల్లి కలెక్టర్ మురళి బుధవారం మొహర్రం పండుగ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు అయినా కూడా ఏటూరునాగారం, మంగపేట మండలాలను సందర్శించి అక్కడి అధికారులతో సమీక్షలు జరిపారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వివిధ సమస్యలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జగిత్యాల జిల్లా గ్రామైక్య మహిళా సంఘాలకు రూ. 10 కోట్ల రుణాల చెక్‌ను అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపి కవిత

ఇక వేగంగా భూసేకరణ

ౄ 2013 చట్టం ప్రకారం
చేసేందుకు తెలంగాణ సిద్ధం
ౄ వౌలిక సదుపాయాలు,
ప్రాజెక్టుల నిర్మాణం స్పీడ్ పెంచాలని నిర్ణయం
ౄ న్యాయపరమైన చిక్కులు
అధిగమించేందుకు అత్యవసర క్లాజ్ ప్రయోగం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 12: రాష్ట్రంలో వౌలిక సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం జాతీయ భూ సేకరణ చట్టం 2013ను ప్రయోగించాలని నిర్ణయించింది. ఈచట్టంలోని అత్యవసర క్లాజ్‌లను ఉపయోగించి భూసేకరణ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రప్రభుత్వం జీవో 123, 124, 125ల ద్వారా చర్చలు జరిపి భూమిని సేకరించాలని గతంలో తీసుకున్న నిర్ణయం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. దీంతో శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు తలెత్తుతున్నాయి. మెదక్ జిల్లా వేములఘాట్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 775 ఎకరాలు అవసరమవుతాయి. రాష్ట్రప్రభుత్వం ఈ భూములను అత్యవసర క్లాజ్‌లను ఉపయోగించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్‌ను నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదన విదితమే. ప్రస్తుతం వేములఘాట్‌లో భూముల సేకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జూలై నెలాఖరునుంచి ఈ గ్రామ ప్రజలు తమ భూములను తీసుకోవద్దంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. భూసేకరణ చట్టం నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించి 40 వ సెక్షన్, పునరావాసం, నిర్వాసితుల చట్టం 2013 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భూసేకరణ నిమిత్తం అత్యవసర పరిస్థితుల్లో నోటిఫికేషన్ చేసే హక్కు ఉంటుంది. అత్యవసరమైన పనులు, ప్రకృతి విపత్తులు, రక్షణ శాఖ పనుల నిమిత్తం నిర్దేశించిన చట్టంలోని నిబంధనలను ఉపయోగించి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. 2013 చట్టంలోని నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని భూమిని కోల్పోయే వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టంలోని నిబంధనల మేరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అత్యవసరమైన సమయాల్లో కలెక్టర్లను ఆదేశించి భూమిని సేకరించవచ్చును. ప్రజల ఉపయోగం పనుల నిమిత్తం సెక్షన్ 21 కింద 30 రోజుల సమయంలో భూమిని సేకరించే అధికారాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం వేములఘాట్ గ్రామప్రజలు జీవో 123 కింద భూమిని సేకరించేందుకు వ్యతిరేకిస్తున్నారు. వేములఘాట్ గ్రామస్తుల తరఫున కోర్టులో వాదిస్తున్న న్యాయవాది ఎన్‌ఎస్ అర్జునకుమార్ మాత్రం భూసేకరణచట్టటం 2013లోని అత్యవసర క్లాజ్‌ను కూడా సవాలు చేసే అధికారం ఉందని చెప్పారు. అత్యవసర క్లాజ్ ప్రకారం జాతీయ భద్రత, ప్రకృతి విపత్తు, రక్షణ శాఖ పనులకే పరిమితమని, లేదా అత్యవసరమైన పనుల నిమిత్తం పార్లమెంటు ఆమోదంతో కూడా భూసేకరణ జరపవచ్చని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం వేములఘాట్ గ్రామంలో 2013 భూసేకరణ చట్టం అత్యవసర క్లాజ్‌ను అమలు చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉభయ రాష్ట్రాలకు
ప్రత్యేక రైళ్లు: ద.మ రైల్వే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 12: దీపావళి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే తిరుపతి-నాందేడ్ మధ్య 14 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. 07608 తిరుపతి-నాందేడ్ రైలు ఈ నెల 19,26 తేదీలలు నవంబర్ 2,9, 16,23,30 తేదీల్లో, 07607 రైలును నాందేడ్-తిరుపతి మధ్య ఈ నెల 18,25, నవంబర్ 1,8,15,22, 29 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లు గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, కామారెడ్డి, బాసర తదితర రైల్వే స్టేషన్ల మీదుగా నడుస్తాయి. సికింద్రాబాద్-కాకినాడ మధ్య ఏసి ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. 07427 ఏసి రైలు ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి కాకినాడకు వెళుతుంది. 16న 07428 రైలు కాకినాడ నుంచి బయలుదేరి మర్నాడు సికింద్రాబాద్‌కు చేరుతుంది.
మెడికల్ టూరిజంలో అపోలో హెల్త్‌సిటీకి అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 12: వైద్య పర్యాటక రంగంలో అత్యుత్తమ సేవలను అందించినందుకు అపోలో హెల్త్ సిటీకి ప్రతిష్టాత్మకమైన ఫ్రాస్ట్ అండ్ సులివాన్ ఇండియా బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. దేశంలో వైద్య పర్యాటక రంగం అభివృద్ధికి విశిష్ట సేవలు అందించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఉపాధ్యక్షుడు రాథేమోహన్ తెలిపారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు విదేశీ రోగులకు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలను అందిస్తున్నారని ఆయన చెప్పారు.
హైదరాబాద్‌లో త్రుపిక్ యాప్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 12: హైదరాబాద్‌లో త్రుపిక్ సంస్థ.. యువతకు నచ్చిన దుస్తులు ఎంపిక చేసుకునేందుకు యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఎత్తు, బరువు తదితర వివరాలను, సరిపోయే బ్రాండ్ దుస్తుల వివరాలను ఫీడ్ చేస్తే, అవి ధరిస్తే ఎలా ఉంటామో 3డి మాధ్యమంలో యాప్ చూపిస్తుంది. ఆ దుస్తులను ఎంపిక చేసుకుంటే రెండు నుంచి నాలుగు గంటల్లో దుస్తులను హోం డెలివరీ చేస్తారు. హైదరాబాద్‌లో ఆరు స్టోర్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు త్రుపిక్ తెలిపింది.

రెండు వేర్వేరు కేసుల్లో
జీవిత ఖైదును ధ్రువీకరించిన హైకోర్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 12: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు దిగువ కోర్టులు నేరస్థులకు విధించిన జీవిత ఖైదు శిక్షను ధ్రువీకరిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులను జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం వెలువరించింది. ఖమ్మం జిల్లాలో సలీం అనే డ్రైవర్‌ను క్లీనర్ శ్రీనివాసరావు మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడు. ఈ ఘటన 2009లో జరిగింది. అంకపాలెం నుంచి సారపాకకు యూకలిప్టస్ కలపను అన్‌లోడ్ చేసేందుకు వస్తుండగా, డ్రైవర్‌ను హత్య చేసి మృతదేహాన్ని రిజర్వు ఫారెస్టులో వదిలేశారు. ఆర్థిక తగాదాలతో ఈ హత్యకు నిందితులు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. అలాగే ప్రకాశం జిల్లాలో ఐ సోమిరెడ్డిని ఒంగోలుకు చెందిన నేరం చిన్నబ్బాయి.. దూబగుంట రోడ్డులో ప్రకాశం వెయింగ్ వంతెన వద్ద చంపినందుకు జిల్లా కోర్టు విధించిన జీవిత ఖైదును కూడా హైకోర్టు ధ్రువీకరించింది.
వ్యవసాయ కమిషనర్‌గా
జగన్‌మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ అండ్ డైరెక్టర్‌గా ఎం జగన్‌మోహన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి వరకు ఈ పోస్టులో కొనసాగిన జిడి ప్రియదర్శిని దీర్ఘకాలిక సెలవుపై అమెరికా వెళ్లడంతో ఆ బాధ్యతలను వ్యవసాయ ముఖ్య కార్యదర్శి పార్థసారథి స్వీకరించారు. అయతే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో జగన్‌మోహన్‌ను వ్యవసాయ కమిషనర్ అండ్ డైరెక్టర్‌గా నియమించారు. బుధవారం ఆయన పార్థసారథిని కలిసి ఆయన నుండి బాధ్యతలు స్వీకరించారు.