తెలంగాణ

కెసిఆర్ వియ్యంకుడు ఘెరావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట, అక్టోబర్ 18: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వియ్యంకుడు, ఐటి శాఖ మంత్రి కేటిఆర్‌కు స్వయాన మామ అయిన పాకాల హరినాథరావు వాహనాన్ని మెదక్ జిల్లా రామాయంపేటలో అఖిలపక్షం నాయకులు అడ్డుకున్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి వియ్యంకుడు హరినాథరావు అతని స్వగ్రామం మండలంలోని దామరచెర్వు గ్రామానికి వస్తున్నాడన్న సమాచారంతో అఖిలపక్షం నాయకులు, గ్రామస్థులు రామాయంపేటలో ఆయన కాన్వాయ్‌ను అడ్డుకొని అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంత ఉద్రిక్తతకు దారితీసింది. హరినాథరావు కారు దిగి దీక్షా శిబిరం వద్దకు చేరుకొని దీక్షలు చేస్తున్న యాదవ సంఘం సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయంపేట 1955లోనే ఓ వెలుగు వెలిగిందన్నారు. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు సమయంలో కొంతమంది నేతలు అడ్డు చెప్పడంవల్లే డివిజన్ ఏర్పాటు ఆగి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తూనే వారి సహకారం కూడా అవసరం ఉందన్నారు. ఇప్పటికి డివిజన్ విషయంలో చర్చలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ సాధనకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలనలో రామాయంపేట డివిజన్ ఫైల్ ఉందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా 21 జిల్లాలను పెంచి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచాడని ఆయన ముఖ్యమంత్రిని కొనియాడారు. మంత్రి కేటిఆర్ విదేశాలనుంచి వచ్చిన తరువాత డివిజన్ సాధనకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. సాధ్యంకాని పక్షంలో డివిజన్‌కు దీటుగా అబివృద్ది చేయాలని కోరుతామన్నారు.

సిఎం కెసిఆర్ వియ్యంకుడు హరినాథరావు వాహనాన్ని
అడ్డుకుంటున్న అఖిలపక్షం నేతలు... దీక్షలకు సంఘీభావం పలుకుతున్న హరినాథరావు

శ్రీరాంసాగర్ నుంఛి
9 లక్షల ఎకరాలకు సాగునీరు

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 18: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి తొమ్మిది లక్షల ఎకరాలకు రబీలో సాగునీటిని విడుదల చేయనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. అదే విధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద రెండవ పంటకు ఆరు లక్షల 40వేల ఎకరాలకు సాగరు ఇవ్వనున్నట్టు చెప్పారు. రబీపంటకు సాగునీటిపై రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. దీని కోసం బుధవారం జల సౌధలో చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం జరుపుతారు. రబీ పంటకు అవసరమైన సాగునీటి కార్యాచరణను జిల్లాల వారిగా ప్రాజెక్టుల వారిగా రూపొందించాలని మంత్రి సూచించారు. బుధవారం నాటి సమావేశంలో జిల్లాల వారిగా, ప్రాజెక్టుల వారిగా కార్యాచరణపై విస్తృతంగా చర్చిస్తారు. అదే విధంగా మిషన్ కాకతీయ రెండవ దశల్లో చేపట్టిన పనులు, ఫలితాలపై విశే్లషించి, మూడవ విడత మిషన్ కాకతీయ పనుల ప్రారంభంపై చర్చిస్తారు. ఖరీఫ్‌లో ఏయే ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలకు సాగు నీరు అందించారో నివేదికలతో బుధవారం నాటి సమావేశానికి హాజరు కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శ్రీరామ్‌సాగర్ స్టేజ్ 1, స్టేజ్ 2, వరద కాలువ, నాగార్జున సాగర్, శ్రీశైలం, నిజాంసాగర్ , ఎల్లంపల్లి సింగూర్, మూసి, కడెం, జూరాల తదితర ప్రాజెక్టుల నుంచి రబీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని హరీశ్‌రావు సిఇలను ఆదేశించారు. శ్రీరామ్‌సాగర్ స్టేజ్1లో మిగిలిపోయిన కాలువల మరమ్మత్తులు, ఇతర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు.

సాగర్ ఎడమ కాలువకు సంబంధించి పెండింగ్ పనులన్నింటినీ శర వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రాజెక్టుల వారిగా రబీ పంటకు ఉన్న నీటి లభ్యత, మిషన్ కాకతీయ ఫలితాలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల్లో సమస్యలపై బుధవారం నాటి సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

‘సన్న బియ్యం’కు తూట్లు

హాస్టళ్లకు ‘సన్న బియ్యం’ సరఫరాలో కాంట్రాక్టర్ల కక్కుర్తి
బిపిటి బదులు ‘బిహార్’ నాసిరకం బియ్యం
కాంట్రాక్ట్ ఏజెన్సీగా ఉన్న రైస్‌మిల్‌పై అధికారుల దాడి
82 క్వింటాళ్ల నాసిరకం బియ్యం నిల్వలు సీజ్

ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, అక్టోబర్ 18: హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతి నెల కోట్లాది రూపాయల సబ్సిడీ భారం భరిస్తుండగా, బియ్యం సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న రైస్‌మిల్లుల నిర్వాహకులు మాత్రం సన్నబియ్యం ముసుగులో నాసిరకం బియ్యాన్ని కేటాయిస్తూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. బిపిటి బియ్యాన్ని హాస్టళ్లకు అందించాల్సి ఉండగా, దాని స్థానంలో ఏకంగా బీహార్ నుండి కారుచౌక ధరకు లభ్యమయ్యే నాసిరకం బియ్యాన్ని దిగుమతి చేసుకుని, ఆ బియ్యానే్న కాస్తంతగా పాలిష్ చేసి హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీగణపతి రైస్‌మిల్లుపై హైదరాబాద్ నుండి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల సందర్భంగా ఈ విషయం బట్టబయలైంది. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు టెండర్లు పిలువగా, లక్ష్మిగణపతి రైస్‌మిల్లు నిర్వహకులు కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు. తప్పనిసరిగా బిపిటి రకం బియ్యానే్న హాస్టళ్లకు సరఫరా చేయాలని కాంట్రాక్ట్ సమయంలోనే అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అయితే సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ వారు గత కొన్నాళ్ల నుండి బిపిటి రకం బియ్యం స్థానంలో నాసిరకం బియ్యాన్ని హాస్టళ్లకు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ తతంగాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించకుండా దొడ్డు బియ్యానే్న కాస్తంత ఎక్కువగా రైస్‌మిల్లులో పాలిష్ పట్టి అందజేస్తున్నారు. స్థానికంగా లభించే దొడ్డు బియ్యం ధరలు కూడా ఎక్కువగానే ఉండడంతో, ఏకంగా బీహార్ నుండి ఐదారు రకాలతో కల్తీగా ఉండే కారుచౌక ధరకు లభించే బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని దానినే హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు పాఠశాలల నిర్వహకుల నుండి ఫిర్యాదు రావడంతో అధికారులు బియ్యం శాంపిల్లను సేకరించి వాటిని పరిశీలన నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌లకు పంపించగా, నాసిరకం బియ్యం అని తేలింది. దీంతో మంగళవారం హైదరాబాద్ నుండి ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన పి.రాజేశం, విద్యాసాగర్‌లు నిజామాబాద్‌కు చేరుకుని, స్థానిక జిల్లా పౌర సరఫరాల అధికారి బిఎన్‌వివి.కృష్ణప్రసాద్, డి.టిలు సుధాకర్, శశిభూషణ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి హరికృష్ణ తదితరులను వెంటబెట్టుకుని కాంట్రాక్ట్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న లక్ష్మిగణపతి రైస్‌మిల్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా బిపిటి బియ్యానికి బదులుగా నాసిరకంతో కూడి ఉన్న 82క్వింటాళ్ల బియ్యం నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. సదరు బియ్యం నిల్వలను బీహార్ నుండి దిగుమతి చేసుకున్నవిగా అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన బియ్యం విలువ లక్షా 48వేల రూపాయల వరకు ఉంటుందని డిఎస్‌ఓ కృష్ణప్రసాద్ వివరించారు. తాము దాడి చేసిన సమయంలో రైస్‌మిల్ యజమాని అందుబాటులో లేనందున, బియ్యం నిల్వలను సీజ్ చేసి లక్ష్మినర్సింహ రైస్‌మిల్‌కు తరలించామని పేర్కొన్నారు. హాస్టళ్లకు బిపిటి రకానికి చెందిన సన్నబియ్యం సరఫరా చేయాలనే ఒప్పందాన్ని ఉల్లంఘించినందున సదరు ఏజెన్సీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోవడం జరుగుతుందని, ల్యాబ్ టెస్టు నివేదికలు అందిన అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగణపతి రైస్‌మిల్‌పై అధికారులు
దాడులు జరిపి నాసిరకం బియ్యం నిల్వలను సీజ్ చేసిన దృశ్యం