తెలంగాణ

‘సన్న బియ్యం’కు తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 18: హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతి నెల కోట్లాది రూపాయల సబ్సిడీ భారం భరిస్తుండగా, బియ్యం సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న రైస్‌మిల్లుల నిర్వాహకులు మాత్రం సన్నబియ్యం ముసుగులో నాసిరకం బియ్యాన్ని కేటాయిస్తూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. బిపిటి బియ్యాన్ని హాస్టళ్లకు అందించాల్సి ఉండగా, దాని స్థానంలో ఏకంగా బీహార్ నుండి కారుచౌక ధరకు లభ్యమయ్యే నాసిరకం బియ్యాన్ని దిగుమతి చేసుకుని, ఆ బియ్యానే్న కాస్తంతగా పాలిష్ చేసి హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీగణపతి రైస్‌మిల్లుపై హైదరాబాద్ నుండి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల సందర్భంగా ఈ విషయం బట్టబయలైంది. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు టెండర్లు పిలువగా, లక్ష్మిగణపతి రైస్‌మిల్లు నిర్వహకులు కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు. తప్పనిసరిగా బిపిటి రకం బియ్యానే్న హాస్టళ్లకు సరఫరా చేయాలని కాంట్రాక్ట్ సమయంలోనే అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అయితే సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ వారు గత కొన్నాళ్ల నుండి బిపిటి రకం బియ్యం స్థానంలో నాసిరకం బియ్యాన్ని హాస్టళ్లకు కేటాయిస్తూ వస్తున్నారు. ఈ తతంగాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించకుండా దొడ్డు బియ్యానే్న కాస్తంత ఎక్కువగా రైస్‌మిల్లులో పాలిష్ పట్టి అందజేస్తున్నారు. స్థానికంగా లభించే దొడ్డు బియ్యం ధరలు కూడా ఎక్కువగానే ఉండడంతో, ఏకంగా బీహార్ నుండి ఐదారు రకాలతో కల్తీగా ఉండే కారుచౌక ధరకు లభించే బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా దిగుమతి చేసుకుని దానినే హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు పాఠశాలల నిర్వహకుల నుండి ఫిర్యాదు రావడంతో అధికారులు బియ్యం శాంపిల్లను సేకరించి వాటిని పరిశీలన నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌లకు పంపించగా, నాసిరకం బియ్యం అని తేలింది. దీంతో మంగళవారం హైదరాబాద్ నుండి ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన పి.రాజేశం, విద్యాసాగర్‌లు నిజామాబాద్‌కు చేరుకుని, స్థానిక జిల్లా పౌర సరఫరాల అధికారి బిఎన్‌వివి.కృష్ణప్రసాద్, డి.టిలు సుధాకర్, శశిభూషణ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి హరికృష్ణ తదితరులను వెంటబెట్టుకుని కాంట్రాక్ట్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న లక్ష్మిగణపతి రైస్‌మిల్‌పై దాడి చేశారు. ఈ సందర్భంగా బిపిటి బియ్యానికి బదులుగా నాసిరకంతో కూడి ఉన్న 82క్వింటాళ్ల బియ్యం నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. సదరు బియ్యం నిల్వలను బీహార్ నుండి దిగుమతి చేసుకున్నవిగా అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన బియ్యం విలువ లక్షా 48వేల రూపాయల వరకు ఉంటుందని డిఎస్‌ఓ కృష్ణప్రసాద్ వివరించారు. తాము దాడి చేసిన సమయంలో రైస్‌మిల్ యజమాని అందుబాటులో లేనందున, బియ్యం నిల్వలను సీజ్ చేసి లక్ష్మినర్సింహ రైస్‌మిల్‌కు తరలించామని పేర్కొన్నారు. హాస్టళ్లకు బిపిటి రకానికి చెందిన సన్నబియ్యం సరఫరా చేయాలనే ఒప్పందాన్ని ఉల్లంఘించినందున సదరు ఏజెన్సీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోవడం జరుగుతుందని, ల్యాబ్ టెస్టు నివేదికలు అందిన అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగణపతి రైస్‌మిల్‌పై అధికారులు
దాడులు జరిపి నాసిరకం బియ్యం నిల్వలను సీజ్ చేసిన దృశ్యం