ఖమ్మం

రైతు సమస్యలపై ఐక్య ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), అక్టోబర్ 19: నకిలీ నోట్ల కన్నా నకిలీ విత్తనాలు మరింత నష్టం చేకూరుస్తాయని ప్రభుత్వ నియంత్రణ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షలాది ఎకరాల పంట నకిలీ విత్తనాల వల్ల చేతికందకుండా పోయిందన్నారు. వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి లాంటి ప్రధాన వాణిజ్య పంటల విత్తనాలే నకిలీవి వస్తే రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చన్నారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయామంటూ రైతులో రోడ్డెక్కి చెబుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మధిర, వైరా, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలో ఇటీవల తాను పర్యటించినప్పుడు రైతుల ఘోష కనిపించిందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మాట్లాడుతూ ప్ర భుత్వం విధానాల వల్లే రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగిందని తెలిసినా నేటికి ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉంటామని వెల్లడించారు. నకిలీ విత్తనాల వల్ల పంట నష్టానికి తోడు ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణమాఫీ చెల్లించకపోవడం వల్ల రైతులు మరింత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై ఉద్యమాలకు తాము సిద్ధంగా ఉంటామన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరు బ్రహ్మయ్య మాట్లాడుతూ గంపెడాశలు పెట్టి ప్రజలను మాయచేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల ఆశలను అడియాశలు చేసి కుటుంబ పాలనను సాగిస్తుందన్నారు. ప్రజాశ్రేయస్సు కంటే కుటుంబ శ్రేయస్సే ఆ పార్టీకి అధికమైందన్నారు. ప్రజలను మాయచేస్తూ ఏదో ఒక కార్యక్రమంతో గారడి చేస్తున్నారని దుయ్యబట్టారు. సిపిఎం జిల్లా నాయకుడు కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను నిరసించేందుకే తమ పార్టీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పార్టీల నాయకులు దీనికి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు చేరడంలేదని, దీనిని ఐక్యంగా పోరాడి సాధించుకోవాలన్నారు. ఇందుకోసం ఐక్య ఉద్యమాలను చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉంటామన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు. దీనికి తోడు నిధులు రావడం లేదని గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం విషయంలో వెనకడుగేసేది లేదని పోరాటానికి సిద్ధమని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఖమ్మం కలెక్టర్ లోకేష్‌కుమార్ మంత్రి సేవకు పరిమితమై రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖామంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు.

అధికార పార్టీలో
అంతర్గత కుమ్ములాటలు
* తారాస్థాయికి చేరిన గూపు తగాదాలు
* తుమ్మల వర్గీయునిపై కేసు నమోదు
కొత్తగూడెం రూరల్, అక్టోబర్ 18: అధికార టిఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గత మయ్యాయి. టిఆర్‌ఎస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరినప్పటినుండి జిల్లాపై పట్టు సాధించేందుకు ఇరువర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో జలగం వర్గీయుల్లో వ్యతిరేకత వచ్చినప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో ఒకే ఒక స్థానంలో జలగం వెంకటరావు కొత్తగూడెం నియోజక వర్గం నుంచి గెలుపొందడంతో వెంకటరావుకు మంత్రి పదవి ఖాయమని జలగం వర్గీయులు భావించినప్పటికీ మంత్రి పదవి తుమ్మల నాగేశ్వరరావుకు దక్కడంతో జలగం వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో తుమ్మల నాగేశ్వరరావుకు స్వాగతం పలుకుతూ ఆయన వర్గీయులు కట్టిన బ్యానర్లను జలగం వర్గీయులు చించివేయడం, ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమంలో కూడా ఇరువర్గాల మధ్యబ్యానర్లు కట్టే విషయంలో ఘర్షణలు జరిగిన సంగతి విదితమే. దీంతో ఇరువర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా అంతర్గత పోరు సాగుతోంది. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేయడంతో కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి జిల్లా ఆవిర్భవించించింది. ఈ నేపధ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు కొత్తగూడెం నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేయడంతో ఆయన వర్గీయుల్లో నూతనోత్తేజం కన్పించింది. నూతన జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆయా జిల్లాల మంత్రులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పగించడంతో భద్రాద్రి జిల్లా ప్రారంభానికి రోడ్లుభవనాలు, స్ర్తిశిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తుమ్మల వర్గీయులు భారీ జనసమీకరణ చేయడంతో జలగం వర్గీయులు ఉత్సాహంగా కన్పించకపోవడంతో మరోసారి వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. అగ్గికి ఆజ్యం పోసినట్లు తుమ్మల వర్గీయుడైన పాల్వంచకు చెందిన తుమ్మల అనుచరుడు జలగం వెంకటరావుపై వాట్సప్‌లో మెస్సేజ్‌లు పంపాడని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జలగం వెంకటరావువర్గీయుడు, అడ్వకేటైన అయితా గంగాధర్ రావు పాల్వంచ పోలీస్ స్టేషన్‌లోఫిర్యాదు చేయడం, పోలీసులు తుమ్మల అనుచరుడిపై కేసు నమోదు చేయడంతో ఇరువర్గాల మధ్య ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. ఈ వర్గపోరు ఇంతటితోనే సమసిపోతుందో, పతాక స్థాయికి చేరుతుందో, అధిష్టానం సూచనల మేరకు ఇరువర్గాల ఏకతాటిపైకి వస్తారో వేచి చూడాలి.

అర్చకులపై విచారణ పూర్తి
భద్రాచలం, అక్టోబర్ 18: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో బంగారు నగల మాయం కేసులో అర్చకుల విచారణ మంగళవారం నాటితో పూర్తయ్యింది. మొత్తం 13 మంది అర్చకులకు విచారణాధికారి డిఈ రవీందర్ నోటీసులు జారీ చేశారు. వారిలో 12 మంది విచారణకు హాజరయ్యారు. ఒక ప్రధానార్చకులు మాత్రం సెలవులో ఉండటంతో విచారణకు హాజరుకాలేదు. స్వామి వారి అలంకరణ, బంగారు ఆభరణాల పర్యవేక్షణ, వారికి తెలిసిన సమాచారం ఏంటి? ఎలా మాయమయ్యాయని, ఎలా తిరిగి వచ్చాయి? అనే అంశాలపై విడివిడిగా అర్చకుల నుంచి సమాచారాన్ని సేకరించారు. గర్భగుడిలో బంగారు ఆభరణాలు ఉంచే బీరువాను అన్ని సార్లు వెతికినా దొరకనివి మళ్లీ అదే బీరువాలో ఎలా ప్రత్యక్షమయ్యాయి? అనే విషయంపైనే విచారణాధికారి దృష్టిసారించినట్లుగా సమాచారం. అంతేకాకుండా అర్చకుల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు ఏమైనా ఉందా? ఉంటే ఎవరెవరి మధ్య పొసగడం లేదు? ఏ కారణం చేత వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి? ఈ ఆభరణాల మాయానికి ఈ విభేదాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలపై కూడా ఆరా తీసినట్లుగా సమాచారం. గుచ్చిగుచ్చి కొన్ని విషయాలు పదేపదే అడగడంతో కొందరు అర్చకులు మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. అయితే విచారణలో ఇదో భాగం అనే విషయాన్ని విచారణాధికారి వారికి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ దోషులను శిక్షించాలనే అర్చకులు కూడా విచారణాధికారికి తమ డిమాండ్‌ను చెప్పినట్లుగా తెలుస్తోంది. తమపై పడ్డ అపవాదు తొలగాలంటే అసలు దొంగలను బయట పెట్టాలని విచారణాధికారికి అర్చకులు మొరపెట్టుకున్నట్లు భోగట్టా. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని, అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని, దోషులు ఏ స్థాయిలో ఉన్నా శిక్ష తప్పదని అర్చకులకు విచారణాధికారి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.