తెలంగాణ

కారెక్కిన ఎర్రబెల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో తెదేపా క్రమంగా ఖాళీ అవుతోంది. తెదేపా శాసన సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సిఎం కె చంద్రశేఖర్‌రావు సమక్షంలో క్యాంపు కార్యాలయంలో బుధవారం తెరాసలో చేరారు. తెలంగాణలో తెదేపా బతకదని, పార్టీని రక్షించుకోలేమని తేలిపోయిందని, అందుకే తెరాసలో చేరుతున్నట్టు దయాకర్‌రావు ప్రకటించారు. చంద్రబాబుపై అభిమానం ఉందని, పార్టీ వీడుతున్నందుకు కార్యకర్తలు అర్ధం చేసుకుంటారన్నారు. వరంగల్ ఎన్నికలతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తెరాస వెంటే ఉన్నారని, తెదేపాకు తెలంగాణలో అవకావశం లేదని తేలిపోయిందని అన్నారు. మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెరాసలో చేరనున్నారన్నారు.
గెలిచింది 15.. మిగిలింది?
సాధారణ ఎన్నికల్లో తెదేపా తరఫున తెలంగాణలో మొత్తం 15మంది ఎమ్మెల్యేలు గెలిచారు. బుధవారం తెరాసలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్‌లతో కలిపి మొత్తం 9మంది ఇప్పటి వరకు టిడిపి నుంచి బయటకు వచ్చేశారు. మిగిలిన ఆరుగురిలో ఆర్ కృష్ణయ్య పార్టీతో సంబంధం లేదని, బీసీ ఉద్యమంలో ఉన్నానని ప్రకటించారు. ఇక తెదేపాకు మిగిలింది ఐదుగురు. వీరిలో మరో ఇద్దరు ముగ్గురు పార్టీ వీడనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సాయన్న, వివేకానంద గౌడ్, కృష్ణారావు, ధర్మారెడ్డి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్ తెదేపాను వీడి తెరాసలో చేరారు. పార్టీ మారిన వారంతా సంతకాలు చేసిన తెదేపా శాసన సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు నాయకత్వంలో స్పీకర్‌ను కలిసి తెలంగాణ తెదేపాను తెరాసలో విలీనం చేస్తున్నట్టు లేఖ ఇవ్వనున్నారు. టిడిపిని వీడటం బాధగా ఉన్నా, తెరాసలో చేరిక అనివార్యమైందని సిఎం క్యాంపు కార్యాలయం వద్ద దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు తెదేపాను వీడి తెరాసలో చేరినందున తెదేపా శాసన సభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలంగాణ తెదేపాను తెరాసలో వీలీనం చేస్తున్నట్టు స్పీకర్‌కు లేఖ అందిస్తారని తెలిసింది. లేఖ అందించిన తరువాత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, సభలోనే కొత్తగా తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు కెసిఆర్ గులాబీ కండువా కప్పుతారు. శాసన మండలిలో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో విలీనమైనట్టు శాసన మండలి చైర్మన్‌కు లేఖ ఇచ్చారు. ఇప్పుడు అదే తరహాలో శాసన సభ్యులు స్పీకర్‌కు లేఖ ఇస్తారు. దీంతో ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి ఫిర్యాదుకు విలువ లేకుండా పోతుంది. ఉప ఎన్నికలకు అవకాశం ఉండదని తెరాస వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు తెరాసలో చేరనున్నట్టు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే రెండు మూడు రోజుల్లో పార్టీ మారుతారని తెదేపా వర్గాలు తెలిపాయి.
గత కొన్ని రోజుల నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో తెరాస కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు. వరంగల్ ఎన్నికల ఫలితాల తరువాత దయాకర్‌రావులో ఆలోచన మొదలైంది. గ్రేటర్ ఎన్నికల ఫలితాల తరువాత ఇక తెదేపాకు తెలంగాణలో భవిష్యత్తు లేదనేది స్పష్టమైంది. సీమాంధ్రులు పెద్ద సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో సైతం తెదేపా నిలబడలేకపోయిందంటే, ఇక తెలంగాణలో ఎక్కడా అవకాశం ఉండదనే విషయం తేలిపోయిందని తెదేపా ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్‌లతో మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎమ్మెల్యే క్వార్టర్‌లో బుధవారం మధ్యాహ్నాం సమావేశమయ్యారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో సిఎంని కలిసేందుకు వెళ్లారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తాము తెదేపాకు రాజీనామా చేసి తెరాసలో చేరుతున్నట్టు ప్రకటించారు. బంగారు తెలంగాణ కెసిఆర్ వల్లనే సాధ్యం అవుతుందన్నారు. తానే పదవి ఆశించి చేరడం లేదని, సిఎం తనకు పదవి ఇస్తానని చెప్పలేదని తెలిపారు. గతంలో పార్టీ ఆదేశాల మేరకే కెసిఆర్‌ను విమర్శించినట్టు చెప్పారు. పార్టీ ఆదేశాల తప్ప కెసిఆర్‌పై తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. నియోజక వర్గం అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లో చేరినట్టు ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూశామని, టిడిపికి ఇక భవిష్యత్తు లేదని తేలిపోయిందని అన్నారు. కార్యకర్తలతో సమావేశమైన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
రేవంత్ మినహా
రేవంత్‌రెడ్డి వినా ఎమ్మెల్యేలంతా తెరాసలో చేరే అవకాశం ఉందని టిడిపి వర్గాలు తెలిపాయి. రేవంత్‌రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణలో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకు పోయేట్టు చేస్తున్నారని టిడిపిని వీడిని నాయకులు విమర్శిస్తున్నారు. రేవంత్‌రెడ్డి వైఖరి పట్ల దయాకర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి తిట్ల వల్ల టిడిపికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ఇప్పుడు మొత్తం ఖాళీ అవుతుందని టిడిపి నాయకులు విమర్శించారు. రేవంత్‌రెడ్డి మినహా మిగిలిన నాయకులంతా పార్టీ వీడి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి సైతం పార్టీ వీడనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

చిత్రం... కెసిఆర్‌తో భేటీ అనంతరం తెరాస పార్టీలో చేరుతున్నట్టు ప్రకటిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్.