అదిలాబాద్

కులాల హక్కుల కోసం ఉద్యమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల: కులాల హక్కుల కోసం ఉద్యమాలు చేయక తప్పదని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్, బహుజన విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపకులు పిడమర్తి రవి అన్నారు. గురువారం పట్టణంలోని ఎఫ్‌సిఏ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బిఎస్‌ఎఫ్ జిల్లా ప్రథమ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కులాలకు అతీతంగా పోరాటం చేసి సాదించుకున్నామని, కులహక్కుల కోసం కూడా అన్ని కులాలను కలుపుకొని పోరాటంచేసి సాధించుకోవాలన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న నాయకులకు అండగా నిలవాలన్నారు. విద్యార్థులు చదువుకుని సమాజాభివృద్ధికోసం పోరాటంచేసి సమాజంలో అందరితో సమానంగా ఉండే విధంగా తయారు చేయాలన్నారు. ప్రస్తుత నాయకులు సమాజం కోసం పోరాటం చేయడం లేదని, తన కుల అభివృద్ది కోసం పోరాటం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో అందరి బతుకులు మారాలని పోరాటం చేసిన సమాజం మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కంప్యూటర్ యుగంలో కులాలు ఎందుకంటున్నారని, వారి అభివృద్ది కోసం తప్పదన్నారు. రిజర్వేషన్లు ఉండటంతోనే ఉద్యోగం, చదువు, ఉపకార వేతనాలు, బోదన రుసుములు మంజూరవుతున్నాయని, అవి లేకుంటే కులాల పరిస్థితి దిగజారి పోతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కులాల వారే పరిపాలిస్తూ వస్తున్నారని, ఈ అవకాశం ఇతర కులాల వారికి రావాలని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం బిసిలకు 50శాతం, ఎస్టీలకు 12శాతం, ముస్లీంలకు 12శాతం, మైనార్టీలకు 18శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. హెచ్‌సియులో విద్యార్థులను బహిష్కరించడాన్ని ఆయన తప్పు పట్టారు. గ్రామాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోని మహానీయుల జయంతులను అందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బిఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కనపర్తి యువరాజ్, రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకట్, వైద్యులు సునీల్ కుమార్, యశ్వంత్‌రావు, నేతకాన సంఘం నాయకులు దుర్గం రాజేష్, గాదాసు రవీందర్, సుధాకర్, రవికుమార్, కార్తీక్, సంతోష్, చందు, రాజ్‌కుమార్‌లు ఉన్నారు.

బెల్లంపల్లి పట్టణంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలి
* ఇన్‌చార్జి కమిషనర్‌కు ఎంసిపిఐయు నాయకుల వినతి
బెల్లంపల్లి, ఫిబ్రవరి 11: పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం ఇన్‌చార్జి కమిషనర్, సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు ఎంసిపి ఐయు నాయకులు వినతి పత్రం అందించారు. సింగరేణి బొగ్గు గనులకు నిలయమైన బెల్లంపల్లి పట్టణంతో పాటు పది మండలాలకు వ్యాపార కూడలిలా ఉన్న బెల్లంపల్లి వౌళిక సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇన్‌చార్జి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపాలిటీ ఏర్పడి 29 సంవత్సరాలు గడుస్తున్నా చిన్నపాటి సమస్యలను కూడా మున్సిపాలిటీ అధికారులు ఈ సమస్యలను తీర్చలేదన్నారు. బజార్ ఏరియాకు వచ్చే ప్రజలకు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతే కాకుండా వారానికి ఒకసారి మంచినీటి సరఫరా జరుగుతోందని, దీంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలోని స్మశానవాటికలో కాంపౌండ్‌వాల్, విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించాలని ఇంచార్జి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో చికెన్, మటన్ షాపుల్లో డాక్టర్ పర్యవేక్షణ, పరిశీలన దృవీకరణ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్‌కు వివరించారు. నాయకులు జాగి రాజలింగం, పిట్టల ఈశ్వర్, ఎస్‌కె మహబూబ్, మేకల నర్సయ్య, కాంపెల్లి లక్ష్మయ్య, కాంపెల్లి రాదక్క, పసులేటి వెంకటేష్ వినతిపత్రం అందించారు.

బోథ్ తహసీల్దార్‌గా ప్రభాకర్‌రావు
బోథ్, ఫిబ్రవరి 11: తహశీల్దార్‌గా జి.ప్రభాకర రావు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బోథ్ తహసీల్దార్‌గా పనిచేసిన ఇమ్రాన్‌ఖాన్ లక్ష్మాణచాంద మండలానికి బదిలీ కాగా లక్ష్మాణచాంద మండలంలో పనిచేసిన ప్రభాకర్ రావు బోథ్ మండలానికి బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభాకర్ రావు మాట్లాడుతూ స్థానిక ఉద్యోగులతో, ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరిస్తూ మండలాభివృద్దికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ఆయా ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు తనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాగా, ప్రభాకర్ రావు బాధ్యతలు చేపట్టడం పట్ల విఆర్‌వో సంఘం సభ్యులు, రాజకీయ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

కడెం,జన్నారంలలో మరింత పర్యాటకరంగంగా అభివృద్దిచేస్తాం
* రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి వెంకటేశం
కడెం, ఫిబ్రవరి 11: ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు, కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారంలలో గల పర్యాటక కేంద్రాలను మరింత అభివృద్ది పరుస్తామని రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి.వెంకటేశం అన్నారు. గురువారం మండల కేంద్రమైన కడెంలోని తెలంగాణ హరిత రిసార్ట్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటక రంగానికి పెద్దపీట వేసి నిధులు మంజూరుచేయించడానికి కృషిచేస్తామన్నారు. జిల్లాలోని కడెం ప్రాజెక్టు, జన్నారం కవ్వాల్ టైగర్‌జోన్ ప్రాంతాలు పర్యాటక రంగానికి ఎంతో అనువుగా ఉన్నాయని, ఈ ప్రాంతాలను పర్యాటక అభివృద్దికోసం నిధులు మంజూరుచేసి మరింత అభివృద్ది చేస్తామని ఆయన తెలిపారు. అలాగే కడెం ప్రాజెక్టు సమీపంలో గల బోటింగ్ పాయింట్ వద్దకు వెళ్లి ఆయన సందర్శించారు. అనంతరం కడెం జలాశయంలో ఆయన పర్యాటకశాఖ అధికారులతో కలిసి బోటు విహారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం హరిత రిసార్ట్‌లో పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలపై కూడా ఆయన ఆరాతీశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, పర్యాటక అభివృద్ది, తీసుకోవాల్సిన చర్యలు, కావాల్సిన నిధులపై ప్రిన్సిపల్ సెక్రటరి వెంకటేశం పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ సాంబశివరావును జిల్లా టూరిజం అధికారి రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎఫ్‌బివొ వెంకటేశ్వర్లు, కడెం మండల తహసిల్దార్ నర్సయ్య, కడెం రెవెన్యు ఇన్స్‌పెక్టర్ బాపురావు, హరిత రిసార్ట్ మేనేజర్ విద్యాసాగర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
దివ్యనగర్, ఫిబ్రవరి 11: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని గజిటెడ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గురువారం నిర్మల్ పట్టణంలోని ఆర్ అండ్‌బి విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం అహర్నిషలు కృషిచేస్తుందన్నారు. తెలంగాన ఉద్యమంలో ఉద్యోగులు క్రియాశీలకపాత్ర పోషించడంతోనే తెలంగాన రాష్ట్రం సాకారమైందన్నారు. మరికొన్ని రోజుల్లో ఉద్యోగులకు నగదురహిత వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు. ఉద్యోగ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆదరణ పొందిందన్నారు. ఉద్యోగులకు ఎప్పుడూ లేనివిధంగా 43 శాతం పిఆర్సీని అమలుచేయడం జరిగిందని, పీ ఆర్సీ బకాయిలను త్వరలో జిపి ఎఫ్‌లో జమచేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారన్నారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు సి ఎం దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి కృషిచేస్తుందన్నారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టి రాష్ట్రంలోని అన్ని చెరువులకు పూర్వవైభవం తీసుకురానున్నామన్నారు. మిషన్ భాగీరథ పథకంతో రాబోయే మూడేళ్లలో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఉద్యోగులు బంగారు తెలంగాణ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనవెంట జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు శ్యాంనాయక్, ఎస్టీయు జిల్లా అధ్యక్షులు జుట్టు గజేంధర్, నిర్మల్‌సెక్టార్ అధ్యక్షులు జె.లక్ష్మణ్, టి ఎన్జీవో అధ్యక్షులు ప్రభాకర్, టియుటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి ప్రసాద్‌రెడ్డి, డి.రాములు, తదితరులు ఉన్నారు.

ఖానాపూర్‌లో ముగిసిన సాయిబాబా వార్షికోత్సవం
* జాతరకు అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులు
ఖానాపూర్ రూరల్, ఫిబ్రవరి 11: పట్టణంలోని అపరశిర్డీగా పేరొందిన శ్రీ సాయిబాబా జంగల్‌హన్మాన్ మందిర 19వ వార్షికోత్సవం గురువారం ఘనంగా ముగిసింది. జాతర కార్యక్రమానికి భక్తులు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బాసరలోని వేద పాఠశాలల విద్యార్థులు ఖానాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ నాందేడ్ బాబా, యోగానంద గోపాలకృష్ణ మఠాధిపతి స్వామి హాజరై సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. గత 21 రోజులుగా నిర్వహిస్తున్న పారాయణం గురువారంతో ముగియడంతో పారాయణం చేస్తున్నభక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఖానాపూర్ కళాజాత అధ్యక్షులు శ్రీనివాస కృష్ణ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు ఎలాంటి అలసట లేకుండా కార్యక్రమాలన్నింటిని ముందుండి నడిపించారు. వార్షికోత్సవం సందర్భంగా గత మాసం రోజులుగా ఆలయ కమిటి, గ్రామస్తులు చేస్తున్న కృషి గురువారం జరిగిన జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సామూహిక భోజనాలను ఏర్పాటుచేసి విద్యార్థులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటి అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లుచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణపంతులు, శేషు, మల్లేష్‌ల ఆధ్వర్యంలో భక్తులకు సేవలను అందించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు కానుకలను సమర్పించుకున్నారు. అలాగే భక్తులకు వైద్య శిభిరం కూడా ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై అజయ్‌బాబు ఆధ్వర్యంలో దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు ఏర్పాట్లుచేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, గ్రామప్రజలు విద్యార్థులు, అధికారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రత్యేక పూజలు...
పట్టణంలోని సాయిబాబా ఆలయంలో 19వ వార్షికోత్సవం ముగింపు కార్యక్రమం సందర్భంగా గురువారం ఎమ్మెల్యే రేఖానాయక్ ఉదయం సాయిబాబా ఆలయంలో అర్చన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. యజ్ఞంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు పి ఎసి ఎస్‌సి శేఖర్, సంజీవ్‌రావు, శ్రీనివాస్‌రావు, గంగారావు, మాజీ ఎంపిటిసి అంకం రాజేందర్, జడ్పీటిసి సునీత రాజ్‌గంగన్న, తోట హన్మంతు, సాడిగ వెంకటరాజు, అలంకార్ శ్రీనివాస్, టిఆర్ ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండండి
* జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి
కుంటాల, ఫిబ్రవరి 11: గ్రామాల్లో ఉన్న ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెదిలినప్పుడే నేరాలు అదుపులోకి వస్తాయని ఎస్పీ తరుణ్‌జోషి అన్నారు. గురువారం మండల కేంద్రమైన కుంటాల గ్రామంలో గల పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లలోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం ఆయన ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నేరాలు జరగకుండా ఉండేందుకు ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారాన్ని అందించాలన్నారు. గ్రామాల్లోని యువకులు సేవాభావాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు. ఈయనవెంట డిఎస్పీ అందెరాములు, సిఐ వినోద్, ఎస్సై మోహన్‌బాబు, ఏ ఎస్సై ప్రభాకర్‌రావుతోపాటు సిబ్బంది ఉన్నారు.

బాసర క్షేత్రానికి భక్తజన సందడి
* ఘనంగా వసంత పంచమి వేడుకలు ప్రారంభం
బాసర, ఫిబ్రవరి 11: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞానసరస్వతిదేవి ఆలయంలో గురువారం వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయంలోని యాగమండపం నందు ఆలయ డిప్యూటీ కలెక్టర్, ఆలయ ఛైర్మెన్ శరత్‌పాఠక్‌లచే ఆలయ స్థానాచార్యుడు ప్రవీన్‌పాఠక్ ప్రత్యేక పూజలతో వసంత పంచమి ఉత్సవాలకు అంకురార్పన చేశారు. వసంత పంచమిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి వచ్చిన వేలాది మంది భక్తులు ముందుగా గోదావరి తీరం వద్ద జల్లు స్నానాలు ఆచరించి నదీ తీరాన గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ మొక్కులను చెల్లించుకుని ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులు తమ చిన్నారులకు ఆలయంలోని వెయ్యి రూపాయల ప్రత్యేక అక్షరాభ్యాస మండపం, వంద రూపాయల అక్షరాభ్యాస మండపాల్లో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. గురువారం సాధారణ ప్రత్యేక అక్షరాభ్యాసాలు 260 వరకు జరిగాయని పేర్కొన్నారు. ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలతో ఆలయానికి 2 లక్షల 50 వేల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
నేడు వసంత పంచమి వేడుకలు....
గురువారం వేకువజామున 2 గంటలకు మంగళవాయిద్య సుప్రభాత సేవలతో ఆలయంలోని అమ్మవార్లకు మహాభిషేకం, అలంకరణ పూజలను నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డిచే అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు మహా విశేష పూజా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 7.30 గంటలకు అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నాగోబా జాతరలో భక్త జనప్రవాహం
* ప్రత్యేక పూజలతో పులకించిన గిరిజనం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 11: కేస్లాపూర్ నాగోబా జాతరకు గురువారం భక్తజనం పోటెత్తింది. ఆచార సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే మెస్రం వంశీయులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి చెట్ల కింద సహపంక్తి భోజనాలు చేశారు. నాగోబా దర్బార్ అనంతరం మరుసటి రోజు వేలాది మంది గిరిజనులు ఇక్కడికి తరలి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుంచే కేస్లాపూర్‌కు ఆదివాసీ గిరిజనులు ఎడ్లబండ్లు, కాలినడకన, ప్రత్యేక బస్సుల్లో తరలి వచ్చి తమ ఆరాద్య దైవానికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మెస్రం వంశీయులు ఒకేచోట సమావేశమై ఆత్మీయ సమ్మేళనంలో పాలు పంచుకున్నారు. వారి కుల దేవతల గూర్చి, ఆచార వ్యవహారాల గూర్చి మెస్రం వంశ పెద్దలు వివరించారు. ఇదిలా ఉంటే ఒకే రోజు సుమారు 40వేల మంది గిరిజనులు తరలి రావడంతో నాగోబా ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో ఉప్పొంగింది. భారీ కేడ్ల నడుమ భక్తులకు నాగోబా దర్శనం గావించేలా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడే జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన క్రీడోత్సవాలను గిరిజనులు ఆసక్తిగా తిలకించి ఆనందపరవశులయ్యారు. ఆ తర్వాత జాతరలో పూజా సామాగ్రి, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం ప్రత్యేకంగా కనిపించింది. దీంతో కేస్లాపూర్ గ్రామ శివారులన్నీ భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. వసంతపంచమి మూల నక్షత్రం కూడా ఉండటంతో నాగోబాకు భక్తుల తాకిడి పెరిగింది. కాగా, జాతర వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి మెస్రం వంశీయులు, కుల పెద్దలు ఇక్కడే బస చేసి శుక్రవారం ఉదయం కాలినడకన శాంపూర్ గ్రామంలోని తమ ఆరాద్య దైవమైన గుడుందేవిని దర్శించుకోనున్నారు. గురువారం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు ఆత్రం సక్కు హాజరై పూజలు గావించారు. సంస్కృతీ, సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

తాగునీటి ఎద్దడిపై చిత్తశుద్ధి ఏదీ..!
* జడ్పీ సమావేశంలో ప్రజా ప్రతినిధుల అగ్రహం
* ఎంపిటీసీ, జడ్పీటీసీల ప్రోటోకాల్‌పై రగడ
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఫిబ్రవరి 11: భూగర్భ జలాలు అడుగంటి పోయి వేసవికి ముందే జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తున్నా కనీస చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వి.శోభారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించగా జిల్లా కలెక్టర్ జగన్మోహన్, జిల్లాకు చెందిన ఏడుగురు శాసన సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపిపిలు హాజరయ్యారు. తాగునీటి సమస్య, ఇందిరాజలప్రభ, ఉపాధి హామీ పథకాల అమలు తీరుపై సభ్యులు సభలో నిలదీసి అధికారుల తీరును ఎండగట్టారు. ల్లా సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులపై ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు అగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది సంక్షేమ పథకాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవడం లేదని పలువురు జడ్పీటీసీలు, ఎంపిపిలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. ఈ సంధర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఇందిరా జల ప్రభ కింద జిల్లాలో ఎన్ని బోర్లు మంజూరి చేశారని, ఎంత మొత్తం కేటాయించారన్న వివరాలు కూడా లేవని అన్నారు. అనవసరమైన చోట్ల బోర్లు వేశారని అగ్రహం వ్యక్తం చేశారు. బోర్లు వేసిన చోట విద్యుత్ శాఖ వారు కరెంటు సదుపాయం కల్పించలేదని మండిపడ్డారు. గతంలో నిర్వహించిన సమావేశాల్లో మార్చిలోగా పనులన్నీ పూర్తిచేస్తామని చెప్పినప్పటికీ వాటిలో కనీసం సగం కూడా పూర్తిచేయాలని అగ్రహం వ్యక్తం చేశారు. టిఎస్ ఎన్‌పిడిఎల్, సి ఎండి, వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాకు అవసరమైనంత మెటిరియల్ అంతా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని ఈ సంధర్భంగా స్పష్టం చేశారు. ఈ విషయంలో తగిన నివేదిక రూపొందించాలని కోరారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎక్కడ ఖర్చుచేశారన్న వివరాలు సరిగ్గా లేవన్నారు. వాటి వివరాలను అందించాలని కోరారు. ఆర్‌డబ్ల్యూ ఎస్ అధ్వర్యంలో చేపడుతున్న వివిధ పథకాలు లోపబూహిష్టంగా ఉన్నాయని అన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ కెరమెరి, జైనూర్, నార్నూర్, సిర్పూర్ మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఇప్పటికీ ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులు నివేదికలు రూపొందించలేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు గత నాలుగు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నియోజకవర్గంలో పర్యటించలేదన్నారు. నియోజకవర్గంలో అవసరమైన నీటి సరఫరా కోసం ఎస్టిమేషన్లు తయారు చేయాలని కోరారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నీటి కొరత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. సిర్పూర్‌టి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ కౌటాల, బెజ్జూర్, దహెగాం, కాగజ్‌నగర్ మండలాల్లో బోర్లు ఎండిపోయి తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి బోర్ల మరమ్మత్తులు చేపట్టాలని, రక్షిత మంచినీటి పథకాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. వెంటనే నీటినందించేందుకు తగిన ఏర్పాట్లుచ చేయాలని కోరారు. ఆసిఫాబాద్ జడ్పీటీసీ కోయ్యల హేమాజీ మాట్లాడుతూ తమ తోటి జడ్పీటీసీ సభ్యుడైన సురేష్ బాబు ఆత్మహత్య యత్నానికి కారణమైన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన కొనుగోలు చేసిన భూమిని ఇతరుల పేరున తహసీల్దార్ పట్టా చేయించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని అన్నారు. ఈ సంధర్భంగా జడ్పీటీసీలందరూ కలిసి ఈ సంఘటనకు కారణమైన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. తగిన న్యాయం చేస్తామని జడ్పీ చైర్మెన్‌తో పాటు జిల్లా కలెక్టర్ సర్దిచెప్పారు. అలాగే బజార్‌హత్నూర్ జడ్పీటీసీ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో రూ.160 కోట్లతో ఐజెసి కింద నిధులు మంజూరైతే ఇప్పటి ఖర్చుచేయలేదని అన్నారు. గత రెండు మూడు సమావేశాలకు సంబంధించిన లెక్కలనే ఇప్పటికి చూపెడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వేసిన బోర్లకు కరెంటు సదుపాయం కల్పించడం లేదని మండిపడ్డారు. ఆదిలాబాద్ జడ్పీటీసీ అశోక్ మాట్లాడుతూ మండలంలోని ఖానాపూర్‌లో ఐదు బోర్లు వేసినప్పటికీ ఇప్పటికి కనెక్షన్లు ఇవ్వలేదన్నారు. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు రావడం లేదని వాపోయారు. వెంటనే వీరికి సంబంధించిన బిల్లులు మంజూరి చేయాలని డిమాండ్ చేశారు. దహెగాం జడ్పీటీసీ మాట్లాడుతూ తమ మండలంలో పలు చోట్ల వాటర్‌ట్యాంక్‌లు నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు. వాటికి పైపులైన్‌తో కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈకి పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బెండగూడ, దుబ్బగూడలో క్లోరైడ్ నీటితో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే వారికి శుద్ద జలం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సంధర్భంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి మాట్లాడుతూ జడ్పీటీసీలకు, ఎంపిపి, ఎంపిటీసీలకు ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిబంధనలు పాటించాలని, వారికి సమాచారం ఇచ్చిన తర్వాతే పథకాలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనిపై తక్షణమే సర్కిలర్‌ను జారీ చేయాలని జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, వైస్ చైర్మెన్ మూలరాజిరెడ్డి, జడ్పీటీసీ, ఎంపిటీసీలు పాల్గొన్నారు.