తెలంగాణ

సహకార బ్యాంకుల పట్ల ఆర్‌బిఐ వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకు (టిఎస్‌సిఎబి-టెస్‌కాబ్)లో లావాదేవీలు నిలిచిపోయాయి. వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) కల్పించిన వెసులుబాటును సహకార బ్యాంకులకు కల్పించలేదు. కేంద్రం రద్దుచేసిన 500 నోట్లు, 1000 రూపాయల నోట్ల లావాదేవీలు ఈ బ్యాంకులు చేయవద్దని ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. వాణిజ్యబ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల్లో పాతనోట్లను తీసుకునే వెసులుబాటు కల్పించిన ఆర్‌బిఐ, సహకార బ్యాంకులకు ఈ వెసులుబాటు కల్పించకపోవడం తీవ్రమైన చర్చనీయాంశం అయింది. గ్రామీణ వ్యవస్థ మొత్తం సహకార వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయంతో 31 జిల్లాల్లో ఈ బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారులు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు టెస్‌కాబ్ పరిధిలో 31 జిల్లాల్లో 307 శాఖలున్నాయి. 13 లక్షల మంది రైతులు సభ్యులు కాగా, వీరికోసం 906 ప్రాథమిక సహకార బ్యాంకులు (ప్యాక్స్) పనిచేస్తున్నాయి. టెస్‌కాబ్ దాదాపు 15 వేలకోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 100 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో వేసిన పంటలు ఇప్పుడే రైతుల చేతికి వచ్చాయి. కేవలం ఆహార పంటల ఉత్పత్తులే 100 లక్షల టన్నులపైగా ఉంటాయి. ఇవి కాకుండా పత్తి, వాణిజ్య పంటల ఉత్పత్తులు కూడా 50 లక్షల టన్నుల వరకు ఉంటాయి. ఖరీఫ్ సీజన్ పూర్తి కావడంతో వ్యవసాయ మార్కెట్లలో పంటల ఉత్పత్తుల విక్రయాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పంటలను విక్రయించిన రైతులు తాము బ్యాంకుల నుండి తీసుకువచ్చిన రుణాలను తిరిగి చెల్లిస్తుంటారు. రైతులు సహకార బ్యాంకుల్లో తీసుకున్న ఖరీఫ్ పంటల రుణాలను తిరిగి చెల్లించి, రబీకి మళ్లీ రుణాలు తీసుకుంటారు. ఖరీఫ్ రుణాలను వసూలు చేసి, ఆర్‌బిఐకి పంపించేందుకు టెస్‌కాబ్‌కు వీలు కావడం లేదు.
ఈ అంశంపై టెస్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రెడ్డి ఆదివారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఆర్‌బిఐ ఒక రకంగా రైతులను అవమానించినట్టవుతోందన్నారు. పంటల ఉత్పత్తులను అమ్ముకోవడంతో పాటు, రబీకి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, పంటలకు అవసరమైన ఇతర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. సహకార బ్యాంకులు రుణాలను వసూలు చేయలేకపోతున్నాయని, కొత్తగా రుణాలు ఇవ్వలేకపోతున్నాయని వివరించారు. ఇది ఖచ్చితంగా అనాలోచిత నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు.
టెస్‌కాబ్ ప్రొఫెషనల్ డైరెక్టర్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ (అకౌంటెన్సీ) ఎం. శ్రీనివాసులు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ సహకార బ్యాంకులపై విధించిన ఆంక్షలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. ప్యాక్స్, షుగర్‌మిల్స్ రైతులకు చెల్లింపులు చేయలేకపోతున్నాయని వివరించారు.
మహబూబ్‌నగర్ డిసిసిబి అధ్యక్షుడు కె.వీరారెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం, ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయంతో వెనుకబడ్డ మహబూబ్‌నగర్ జిల్లాలో సేద్యం పరిస్థితి క్షీణించిందన్నారు. సహకార బ్యాంకుల పట్ల చూపుతున్న పక్షపాత ధోరణిపై వెంటనే కేంద్రం, ఆర్‌బిఐ పునఃపరిశీలించాలని కోరారు.

చిత్రం.. కొండూరి రవీందర్‌రావు