తెలంగాణ

ప్రాజెక్టులకు 7900 కోట్లు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 7900 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ కేంద్రాన్ని కోరనుంది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన (పిఎంకెఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 99 ప్రాజెక్టుల పురోగతి, నిధుల సమస్య తదితర అంశాలపై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అధికారులతో కలిసి వెళుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు రావలసిన కేంద్ర నిధులు, మార్కెటింగ్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు తదితర వ్యవహారాలపై కేంద్ర మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో హరీశ్‌రావు భేటీ అవుతారు. సమావేశంలో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల కార్యదర్శులు పాల్గొంటారు.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం కేంద్రంపై మరోసారి ఒత్తిడి తీసుకు రానున్నట్టు మంత్రి తెలిపారు. నాబార్డ్ అధికారులతో కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో మంత్రి సమావేశం అయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు నాబార్డు నిధులు అందించాలని కోరారు. పిఎంకెఎస్‌వైకి చెందిన 11 సాగునీటి ప్రాజెక్టులను ఈ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకు రానున్నట్టు చెప్పారు. ఎఫ్‌ఆర్‌బిఎంతో సంబంధం లేకుండా నిధులు ఇవ్వాలని నాబార్డ్ బృందాన్ని కోరారు. దేశ వ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 99 పెండింగ్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాధాన్యత పరంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర జల వనరుల శాఖ, జాతీయ నీటి అభివృద్ధి సంస్థ, నాబార్డుల మద్య సెప్టెంబర్ 6న ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని జాతీయ జల వనరుల టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు కూడా అయిన మంత్రి హరీశ్‌రావు నాబార్డ్ బృందానికి తెలిపారు. త్రైపాక్షిక ఒప్పందంలో కుదిరిన వడ్డీ రేట్ల ప్రకారమే కాళేశ్వరం కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వాలని మంత్రి కోరారు. కేంద్రం షెడ్యూల్ ప్రకారం మూడేళ్లలో 11 ప్రాజెక్టులు పూర్తి చేయవలసి ఉంది. ఇందు కోసం 7900 కోట్ల నిధులు అవసరమని నాబార్డ్ బృందానికి మంత్రి వివరించారు. ఇంత భారీ మొత్తాన్ని మూడేళ్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పూచీ ఉంటున్నందున నాబార్డ్ ద్వారా కాళేశ్వరం కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు కేంద్రాన్ని కోరుతున్నారు. బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని కేంద్ర మంత్రికి వివరిస్తారు.