తెలంగాణ

పెన్షన్... టెన్షన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 1: ఆసరా పథకంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులతోపాటు బీడీ, గీత కార్మికుల్లో పె(టె)న్షన్ మొదలైంది. ఇప్పటివరకు ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదవ తేదీలోపల పింఛన్ డబ్బులు అందిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇకమీదట ఆన్‌లైన్‌లో చెల్లింపులు ఉంటాయని ప్రకటించడంతో పింఛన్‌దారుల్లో ఆందోళన మొదలైంది. కొందరికి బ్యాంక్ ఖాతాలు లేకపోవడం, మరికొందరికి ఆధార్ అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో డిసెంబర్ నెల పింఛన్ వస్తుందో? రాదో? అని వారు ఆందోళన చెందుతున్నారు. పూర్వ కరీంనగర్ జిల్లాలో సుమారు అన్ని రకాల పెన్షన్‌దారులు మొత్తం 4 లక్షల 84 వేలకుపైగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో బ్యాంకుల్లో సరిపడా నగదు నిల్వలు లేకపోవడంతో ఈ సమస్యను భర్తీ చేసేందుకు నగదు రహిత లావాదేవీలే ఏకైక మార్గమని భావించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పింఛన్‌దారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే పింఛన్ డబ్బులు వేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిన దరిమిలా ఆ దిశగా కసరత్తు మొదలెట్టారు. ఈ మేరకు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పింఛన్‌దారుల నుంచి బ్యాంక్ ఖాతాల నెంబర్లు స్వీకరించే పనిలో అధికారులు, సిబ్బంది నిమగ్నం కాగా, ఇప్పటికే చాలామంది పింఛన్‌దారుల బ్యాంకు ఖాతాలను సేకరించడంతోపాటు ఆధార్‌ను కూడా అనుసంధానం చేశారు. ఆధార్ అనుసంధానమైన వారికి నేరుగా వారి ఖాతాల్లోనే పెన్షన్ జమ అవుతోంది. అయితే, ఖాతాలు లేని, ఆధార్ అనుసంధానం కాని వారికి ఒకటో తారీఖు వచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. అయితే, పెద్ద నోట్ల రద్దు, చిల్లర తిప్పలు వెరసి నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించడంతో ఖాతాలు లేని, ఆధార్ అనుసంధానం కాని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బీడీ, గీత కార్మికులు బ్యాంక్‌ల వైపుకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు చాంతాడంత క్యూలైన్లు ఉంటుండగా, వీరికి కొత్త ఖాతాలు తెరవడం ఇబ్బందిగానే మారింది. కరీంనగర్ జిల్లాలో 1,11,143, సిరిసిల్ల జిల్లాలో 1.05,320, జగిత్యాల జిల్లాలో 1,93,143, పెద్దపల్లి జిల్లాలో 74,935 మంది చొప్పున పింఛన్‌దారులు ఉన్నారు. అయితే, ఇందులో 30 శాతం దాకా బ్యాంక్ ఖాతాలు లేక, మరో 20 శాతం దాకా ఆధార్ అనుసంధానం కానట్లు సమాచారం. దీంతో వీరికి పెన్షన్ టెన్షన్ మొదలైంది. డిసెంబర్‌లో అన్ని రకాల పెన్షన్‌దారులకు సుమారు రూ.50 నుంచి రూ.60 కోట్ల అవసరం కాగా, ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేవు. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగులకు 10 వేల నగదు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులకు 10 వేల నగదు కోసం బ్యాంకులకు చేరుతుండగా, అటు ఖాతాలు లేని వారు ఖాతాల కోసం, ఆధార్ అనుసంధానం కోసం ఆసరా పింఛన్‌దారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మొత్తానికి ఆసరా పెన్షన్‌లపై పెన్షన్‌దారులు టెన్షన్ పడుతుంటే.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా సద్దుమణుగుతుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.