తెలంగాణ

ఊపందుకున్న ‘యాదాద్రి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 4: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు క్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. వచ్చే దసరా నాటికి ప్రధాన ఆలయం నిర్మాణ పనులు పూర్తి చేసి దేశంలోనే తిరుపతి తరహాలో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా యాదాద్రిని తీర్చిదిద్ధాలన్న సీఎం కెసిఆర్ సంకల్పం దిశగా యాడా(యాదాద్రి అభివృద్ధి ప్రాథికార సంస్థ) ముందడుగు వేస్తుంది. 2.33ఎకరాల్లో తలపెట్టిన ప్రధాన ఆలయం పునర్ నిర్మాణంలో భాగంగా రాజగోపురాల నిర్మాణానికి ఆధార శిలల ఏర్పాటును శిల్పులు ప్రారంభించారు. ముందుగా తూర్పు, ఉత్తర, పడమటి రాజగోపురాల నిర్మాణాలు చేపడుతున్నారు. రాజగోపురాల నిర్మాణ పనులకు వీలుగా గర్భాలయం చెంతన కొండ రాయిని కొంత భాగం తొలగిస్తున్నారు. మరోవైపు ఆలయ రక్షణ గోడ నిర్మాణం పురోగతిలో ఉంది. పనుల్లో వేగం పెంచేందుకు ఇంకోవైపు పుష్కరణి విస్తరణ, కొండ కింద కొత్త సింహద్వారం నిర్మాణం, శివాలయం పునర్ నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించారు. అటు పెద్దగుట్టపై 258ఎకరాల్లో ఆధునాతన కాటేజీల, ఉద్యానవనాల నిర్మాణాలకు లేఅవుట్‌లు సిద్ధమవుతున్నాయి. 1000, 1500గజాలతో లేఅవుట్‌లు సిద్ధం చేసి నిర్మాణ నమూనాలను దాతలకు అందించనున్నారు. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కొత్తగా పెద్దగుట్ట ప్రాంతంలో ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణానికి మరో 139ఎకరాలక భూసేకరణకు యాడా సిద్ధమవుతుంది. గతంలో 166ఎకరాలు మాత్రమే ఉన్న యాదాద్రి ఆలయం భూములు సీఎం కెసిఆర్ దాదాపుగా 800కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 2050ఎకరాలకు విస్తరించాయి. ఇందులో భూసేకరణలో 76కోట్లతో 1,242ఎకరాలను కొనుగోలుచేశారు. 2,133ఎకరాల భూసేకరణ ప్రక్రియలో సమకూరిన 2050ఎకరాల్లో ప్రైవేటు భూములు 676ఎకరాలు, ప్రభుత్వ భూములు 565ఎకరాలు, గుట్ట ఆలయానికి చెందిన 166ఎకరాలు, అటవీశాఖ ఇచ్చిన భూములు 476ఎకరాలు, యాదగిరిపల్లి, గుండ్లపల్లి, రాయగిరి చెరువులకు చెందిన 174ఎకరాలున్నాయి.
అద్భుత శిల్పసంపదతో యాదాద్రి క్షేత్ర నిర్మాణం
యాదాద్రి ఆలయాన్ని తంజావూర్ ఆలయ తరహాలో పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించేందుకు పనులు సాగుతున్నాయి. ఆధార శిలలు, శిల్పాలు, ప్రాకారాలు, స్తంభాలకు అవసరమైన కృష్ణ శిలలను గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గురజాల, కమ్మవారిపాలెం, కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ, రంగారెడ్డి జిల్లా కోహేడ ప్రాంతాల్లోని క్వారీల నుండి సేకరణ చేసి శిల్పాలను సిద్ధం చేస్తున్నారు. వాటిని యాదాద్రి పరిసరాల్లో ఏర్పాటు చేసిన శిల్పతయారీ కేంద్రాలకు తరలించి తుది మెరుగులు దిద్ధి రాజగోపురాల నిర్మాణాలకు కొండపైకి తరలిస్తున్నారు. చెన్నై, హైద్రాబాద్ ఐఐటి నిపుణులు ఎంపిక చేసిన ఏకజాతి కృష్ణ శిలలను మాత్రమే వినియోగిస్తున్నారు. రెండువేల ఏళ్లదాకా ఆలయం చెక్కు చెదరకుండా ఉండేలా కృష్ణ శిలల్లో మేలురకమైన శిలలను ఎంపిక చేశారు. ఆలయ ప్రాకారాలపై, స్తంభాలపై పురాణ ఘట్టాలతో కూడిన అద్భుత శిల్పాలను 400మందికి పైగా శిల్పులు సిద్ధం చేస్తున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ సూఛనలతో ఆగమశాస్రానుసారం ప్రధాన స్థపతి సుందర్‌రాజన్, డాక్టర్ వేలు, వలినాయగంలు, అర్కిటెక్ట్ ఆనందసాయి, బడెరవిలు శిల్పాల తయారీని పర్యవేక్షిస్తున్నారు. యాడా వైస్ చైర్మన్ కిషన్‌రావు పనులపై ప్రతివారం సమీక్షిస్తున్నారు. 172కోట్లతో నిర్మించే పంఛనారాసింహుడి ప్రధానాలయం లక్ష్మీనరసింహుల 32రూపాలు, సింహాకారం స్తంభాలు(యాళీ), అష్ట్భుజ మండపాలతో మరెక్కడ లేని రీతిలో నిర్మితం కానుంది. దివ్యాలయం 108స్తంభాలతో, గర్భగుడి ధ్వజస్తంభం, 12మంది అళ్వారుల 25అడుగుల ఎత్తు శిలా విగ్రహాలతో ఏర్పాటు చేస్తున్నారు. పద్మ, ఆశ్వ, గజ, సింహాకృతుల శిల్పాలు రూపొందిస్తున్నారు. క్షేత్రపాలకుడైన అంజనేయస్వామి 108అడుగుల పంఛలోహా విగ్రహా నమూనా ఖరారు చేసి చైనా నిపుణులతో చర్చలు ఆరంభించారు. ఆలయ దివ్యవిమాన గోపురం, లక్ష దీపారాధన మండపం, ఊంజల్ సేవ అద్ధాల మండపం, ఒకేసారి వేయి వ్రతాలకు వీలుగా సత్యనారాయణ వ్రత మండపం, ప్రవఛన మండపం, వేద పాఠశాల, 5వేల మంది మొక్కులు తీర్చుకునేలా కల్యాణకట్ట, హనుమాన్ దీక్ష భక్తుల మండపం, 5వేల వాహనాల పార్కింగ్ చేసేలా బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలం నిర్మాణ పనులు, నిత్యకల్యాణ మండపం, యాగశాలల నిర్మాణ పనులు ఆరంభించనున్నారు. అలాగే నవగిరుల అభివృద్ధికి, నృసింహ అభయారణ్యం ఏర్పాటుకు 467ఎకరాలు అటవీశాఖ యాడాకు అప్పగించడంతో ఉద్యానవనం, పూదోటల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గుట్టకు నలువైపుల నాలుగులైన్ల రహదారుల నిర్మాణాలు, గిరిప్రదక్షిణ దారుల పనులు పురోగతిలో ఉన్నాయి. యాదాద్రి బస్‌డిపోను తరలించి గండిచర్లలో ఆధునాతనంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గుట్టకు ఎంఎంటిఎస్ రైలు రాయగిరి వరకు మంజూరుకావడం ఆలయ అభివృద్ధికి ఉపకరించనుంది. యాదాద్రి దేవస్థానానికి ప్రత్యేక విద్యుత్ స్టేషన్, ఫైర్ స్టేషన్ సైతం ఏర్పాటు చేస్తున్నారు.

చిత్రం..కృష్ణశిల నిర్మిత శోభతో యాదాద్రి ఆలయ నమూనాలు