తెలంగాణ

చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 5: నిజామాబాద్ జిల్లా వైభవానికి ప్రతీకగా నిలిచిన నిజాం షుగర్స్‌తో పాటు నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించి చెరకు రైతులు, కార్మికులను ఆదుకోవాలని టిజెఎసి చైర్మెన్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం తరఫున కాస్తంత చేయూతను అందిస్తే ఈ ఫ్యాక్టరీలు పునః ప్రారంభమై మంచి లాభాలు అందించేందుకు ఆస్కారం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే సహకార రంగంలో కొనసాగుతున్న ఏకైక చక్కెర కర్మాగారమైన నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని సోమవారం ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలోని యంత్రాలతో పాటు అన్ని విభాగాలను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా క్రషింగ్ నిలిచిపోయిందని, పర్మినెంట్ కార్మికులను విఆర్‌ఎస్ విధానం ద్వారా బలవంతంగా తొలగించేందుకు ఇటీవలే చక్కెర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని స్థానికులు, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు జెఎసి చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, రైతుల వాటాధనమే పెట్టుబడిగా నెలకొల్పిన సహకార చక్కెర కర్మాగారం అనేక దశాబ్దాల పాటు సమర్ధవంతంగా నిర్వహించారని, అధికారులు, పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా పుష్కర కాలం క్రితం నుండి నష్టాలు వాటిల్లడం ప్రారంభమైందని అన్నారు. దీనిని సాకుగా చూపుతూ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసేందుకు ప్రయత్నించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. కేవలం 20 నుండి 30కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తే ఎన్‌సిఎస్‌ఎఫ్ పూర్వ వైభవం దిశగా ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు చెరకు పంటను సాగు చేసేందుకు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారని, కార్మికులు కూడా విఆర్‌ఎస్‌కు మొగ్గు చూపకుండా ఫ్యాక్టరీని ఎలాగైనా నడిపించుకోవాలనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. వారి అభిమతం మేరకు ప్రభుత్వం తనవంతు తోడ్పాటును అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారంతోపాటు నిజాం షుగర్స్ మూతబడడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో చెరకు రైతులు మహారాష్టల్రోని ప్రైవేట్ ఫ్యాక్టరీలకు చెరకు పంటను తరలిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అదే సమయంలో ప్రైవేట్ యాజమాన్యాలు లాభాలు ఆర్జిస్తున్నాయని, దీనివల్ల స్థానిక రైతాంగానికి కానీ, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని కోదండరాం ఆవేదన వెలిబుచ్చారు.

చిత్రం..నిజామాబాద్ సహకార చక్కెర ఫ్యాక్టరీని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకుంటున్న కోదండరాం