తెలంగాణ

నిధుల కోసం భిక్షాటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 11: జిల్లాల పునర్విభజన అనంతరం తొలిసారిగా కరీంనగర్‌లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. జిల్లాల విభజనతో ఉమ్మడి జిల్లాలోని మండలాలు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విలీనం కావడం, ఆ ఏడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావటంతో ఈ సమావేశంలో జంబోజెట్ సీన్ ఆవిష్కృతమైంది. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొదటగా వ్యవసాయ శాఖపై చర్చను మొదలు పెట్టగా, సభ్యులు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తుండగా, జిల్లా పరిషత్ నిర్వీర్యమైందని, ఎలాంటి నిధుల్లేవంటూ కాంగ్రెస్ జడ్పీటిసి సభ్యులు అప్పటికే ప్రతిమ మల్టిప్లెక్స్ నుంచి జోలె పట్టి భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ సమావేశ మందిరానికి చేరుకున్నారు. అనంతరం వారు పోడియం ఎదుట బైఠాయంచి, ‘జడ్పీకి నిధులు లేవు, విధులు లేవు, జడ్పీటిసిల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు తీర్మానాలు చేసినా నిధులు రావడం లేదని, గ్రామాల్లోకి వెళితే ప్రజలు నిలదీస్తున్నారని, జడ్పీ పూర్తిగా నిర్వీర్యమైపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేయగా, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ కల్పించుకుని ఆ మాట వాస్తవమే కానీ, నిధుల సమస్య కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. రాష్ట్రం నుంచి వచ్చే సీనరేజ్ నిధుల గురించి ఈ సమావేశానికి వివరించేందుకు మంత్రి ఈటెల రాజేందర్ వస్తున్నారని, వారితో చర్చిద్దామని, కనుక ఆందోళన విరమించాలని ఆమె కాంగ్రెస్ సభ్యులను పదేపదే కోరారు. అయతే గతంలో ఇదే విషయమై చైర్‌పర్సన్ మాట ఇవ్వడంతో ఊరుకున్నామని, ఇప్పుడు ఊరుకోబోమని కాంగ్రెస్ సభ్యులు స్పష్టం చేయడంతో, సభ సాంప్రదాయాలను గౌరవించాలని ఆమె మరోమారు కోరారు. అయినా సభ్యులు పట్టించుకోక నినాదాలు చేయడంతో సమావేశం నుంచి కాంగ్రెస్ సభ్యులు చల్లా నారాయణరెడ్డి, చల్లా ప్రగతిరెడ్డి, శోభారాణి, సునీత, ఊట్ల రమ, యాట దివ్యరెడ్డితోపాటు మరికొందరు సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉమ ప్రకటించారు. అప్పటికీ సభ్యులు కదలకపోవడంతో వారిని పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సుమారు అరగంట పాటు చర్చకు ఆటంకం ఏర్పడింది. అనంతరం ఎజెండాలో పొందుపర్చిన అంశాల వారీగా సభలో చర్చ జరిగింది. భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక మధ్యలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్, మండలి విఫ్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, వొడితెల సతీష్‌కుమార్, రసమయి బాలకిషన్, జడ్పీ సిఇఓ పద్మావతి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల కలెక్టర్లు సర్పరాజ్ అహ్మద్, కృష్ణ్భాస్కర్, శరత్‌తోపాటు ఏడు జిల్లాల అన్ని శాఖల అధికారులు, జడ్పీటిసిలు, ఎంపిపి సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం. జడ్పీ సమావేశంలో సభ్యులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు