తెలంగాణ

పాలనకు మీరే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: ‘ప్రభుత్వం అంటే మంజూరీలు చేయడానికే పరిమితం కాదు. మంచి పథకాలు, విధానాలతో ప్రజా జీవితాల్లో మార్పు తేవడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలుచేసే ఉద్దేశంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, పరిపాలనా విభాగాలను వికేంద్రీకరించామని అన్నారు. కొత్త జిల్లాల ఫలితాలు ప్రజలకు అందాలంటే అధికార యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రగతి భవన్‌లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విడతలుగా కలెక్టర్ల సదస్సు సాగింది. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు, జెసిలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు సదస్సుకు హాజరయ్యారు. సిఎం కెసిఆర్ ప్రారంభోపన్యాసం చేస్తూ ఇప్పటి వరకూ భిన్న దృక్పథాలు కలిగిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అనేక కార్యక్రమాలు చేపట్టాయి. అయినా సమాజంలో ఎక్కడో ఏదో అసంతృప్తి ఉంది. లోపం ఎక్కడుందో గుర్తించాలి. ప్రజలకు నిజంగా ఏంకావాలో తెలుసుకుని వాటిని అందించగలగాలి. ప్రజల అసంతృప్తి పరిధి దాటితే కొన్ని శక్తులు అలుసుగా తీసుకునే అవకాశం ఉంది’ అని సిఎం కలెక్టర్లను హెచ్చరించారు. అధికార యంత్రాంగం సృజనాత్మకంగా ఆలోచించాలని, ప్రజా జీవితాల్లో నిజమైన మార్పు తేవాలని సూచించారు. సమాజంలో నెలకొన్న అపసవ్య పరిస్థితిని చక్కదిద్దడం అసాధ్యమైన పనేమి కాదన్నారు. టిఎస్- ఐపాస్ చట్టంతో పారిశ్రామిక విధానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని, దీనివల్ల రాష్ట్రానికి కొత్తగా 2500 పరిశ్రమలు వచ్చాయన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరించామని, హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెంచుకున్నామన్నారు. సంక్షేమరంగంలో రూ.30 వేల కోట్లు ఖర్చుపెడుతూ రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానానికి తెచ్చుకున్నామని కెసిఆర్ వివరించారు. మూడు, నాలుగు లక్షల కుటుంబాలకు ఒకటిచొప్పున కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, చిన్న జిల్లాల్లో సమర్థవంతమైన పాలన అందించొచ్చని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ‘మూస పద్ధతులు విడనాడండి. జిల్లాలన్నింటికీ ఒకే విధానం కూడా అవసరం లేదు. జిల్లాల స్వరూపం, స్వభావం, నైసర్గిక పరిస్థితులు, వాతావరణం, వనరుల ఆధారంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్థానిక వనరులను గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమన్నారు. పట్టణ, గ్రామీణ, వ్యవసాయ, పారిశ్రామిక పరిస్థితులను బట్టి జిల్లాలవారీగా ప్రాధాన్యతలు మారుతాయి. వాటికి అనుగుణంగా ప్రణాళికా రచనలు జరగాలని సిఎం ఆదేశించారు. గతంలో అసైన్ చేసిన భూములు ఏ స్థితిలో ఉన్నాయో చూడాలని, అవి ఉపయోగంలోకి వచ్చే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అమ్మేవారిపై పిడి యాక్ట్ ప్రయోగించాలని కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్ తరువాత పెద్ద నగరమైన వరంగల్లును తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ, రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 300 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. జాతీయ రహదారులు పెద్దఎత్తున మంజురైన నేపథ్యంలో, వాటి నిర్మాణానికి అవసరమైన సహకారం అందించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరతగతిన పూర్తి చేయాలని సిఎం దిశానిర్దేశం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపైనా పడిందని, ఇబ్బందులు అధిగమించేందుకు నగదురహిత లావాదేవీల విస్తరణ ఒక్కటే మార్గమన్నారు. అన్ని వర్గాల ప్రజలను నగదురహిత లావాదేవీల దిశగా కార్యోన్ముఖులను చేయాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. బ్యాంకర్లతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమావేశమై సేవల మెరుగుకు కృషి చేయాలన్నారు. సాదా బైనామాలను ఉచితంగా రిజిస్టర్ చేయించే అవకాశం హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ, వరంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఇస్తున్నట్టు సిఎం ప్రకటించారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కూ రూ.3 కోట్ల నిధి చొప్పున రూ.93 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ నిధులను వెచ్చించే విచక్షణాధికారం కలెక్టర్లదేనన్నారు. మరిన్ని అవసరాలకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజక అభివృద్ధి నిధులనూ వాడుకోవచ్చని సిఎం సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, జెసిలు టీమ్‌గా పనిచేస్తే మంచి ఫలితాలు అందుతాయని ఉద్భోదించారు.

చిత్రం... కొత్త జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్. వేదికపై సిఎస్, ప్రభుత్వ సలహాదారు, మంత్రులు