తెలంగాణ

ఆగ్రహించిన అన్నదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేట టౌన్, డిసెంబర్ 16: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో పంటను తీసుకువస్తే రైతుల కడుపులో మన్ను పోస్తారా అంటూ అన్నదాతలు ఆక్రోశానికి గురై నారాయణపేట మార్కెట్ యార్డులో కార్యాలయాన్ని ధ్వంసం చేసి కార్యదర్శిపై దాడి చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మార్కెట్‌యార్డులో శుక్రవారం ఎర్ర కంది క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ. 5001, కనిష్టంగా రూ.4100 వరకు పలకగా తెల్లకంది గరిష్ఠంగా రూ.6100, కనిష్టంగా రూ. 5700 వరకు పలికింది. కాగా శుక్రవారం రోజు నారాయణపేట మార్కెట్‌యార్డుకు దాదాపు తొమ్మిదివేల బస్తాల కంది పంట రావడంతో మార్కెట్ కళకళలాడింది. అయితే గిట్టుబాటు ధర తగ్గడంతో రైతులు గగ్గోలు పెట్టారు. గత వారం కంటే ఏకంగా వేయి రూపాయల మేరకు ధర తగ్గిందని తెలియడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. ఏకంగా మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడిలో మార్కెట్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్‌తో పాటు ఇతరత్రా సిబ్బంది ఉండే కార్యాలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి జరుగుతున్న సమయంలో యార్డు కార్యదర్శి నవీన్ రైతులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న రైతులు ఆయనపై తిరగబడి చితకబాదారు. అదే సమయంలో అక్కడే ఉన్న గ్రేడర్ భారతిని కొందరు రక్షించి బయటకు తీసుకెళ్లగా కార్యాలయంలోని ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడి నుంచి ప్రధాన రహదారిపైకి చేరుకుని రాస్తారోకో చేపట్టారు. కాగా ఈ సమాచారం అందుకున్న డిప్యూటీ కలెక్టర్ కృష్ణాదిత్య యార్డుకు చేరుకుని వివరాలు తెలుసుకుని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపగా అవి విఫలం అయ్యాయి. రాత్రి ఏడు గంటల సమయంలో జెసి శివకుమార్ నాయుడు యార్డుకు చేరుకుని ముందుగా రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సమయంలో కొందరు రైతులు మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఇచ్చిన ధర కంటే వేయి రూపాయల ధరకు తమ పంటను ఎలా విక్రయించాలంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రభుత్వం పంటలను కొనుగోలు చేస్తుందని, గత వారం అధిక ధరలకు పంటలను కొనుగోలు చేసిన ఇద్దరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని అంటూ ఆందోళనను విరమించాలని కోరారు. దీంతో రైతులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. రైతుసంఘాల ప్రతినిధులు జోక్యంతో రైతుల ఆందోళనను విరమించారు. అయితే ఈ బందోబస్తును డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై నవీన్‌తోపాటు జిల్లా కేంద్రం నుండి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు పర్యవేక్షించి ఆందోళనలు తీవ్రతరం కాకుండా ఉండే ఏర్పాట్లు చేశాయి. కాగా మార్కెట్‌యార్డ్ కార్యదర్శిపై దాడికి నిరసనగా తెలంగాణ మార్కెట్‌యార్డుల కార్యదర్శుల సంఘం శనివారం బంద్‌కు పిలుపునిచ్చింది.