తెలంగాణ

పౌర సరఫరాలకు భారీ ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: పౌరసరఫరాల శాఖలో పొదుపు ఉద్యమం చేపట్టడం, గోనె సంచులకు సంబంధించి పాత లెక్కలు తీయడం, రవాణాలో వినూత్న విధానాలు అమలు చేయడం వల్ల ఈ శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. రైస్ మిల్లర్ల వద్ద ఉండిపోయిన గోనె సంచులను రికవరీ చేయాలని ఈ శాఖ కమిషనర్ సివి ఆనంద్ నిర్ణయించారు. అలాగే గోనె సంచుల రవాణాలో కొత్త విధానానికి తెర తీశారు. ఈ శాఖలో చేపట్టిన సంస్కరణల వల్ల వేర్వేరు మార్గాల్లో 2016-17లో 87 కోట్ల రూపాయలు పౌరసరఫరాల శాఖకు ఆదాయం లభిస్తోంది.
ధాన్యం, బియ్యం తరలింపు, నిల్వల కోసం పౌరసరఫరా శాఖకు పెద్ద ఎత్తున గోనె సంచులు అవసరం అవుతుంది. గతంలో రైళ్లలో గోనె సంచులను తెలంగాణ జిల్లాలకు తరలించేవారు. రైలు మార్గంలో గోనె సంచుల రవాణా వల్ల ఖర్చు అధికమవుతోంది. దాంతో రోడ్డు మార్గంలో వీటిని తరలించాలని నిర్ణయించారు. రోడ్డుమార్గంలో సంచులను రవాణా చేయడం వల్ల ఒక్కో సంచిపై ఒక రూపాయి ఆదా అవుతుంది. ప్రస్తుత ఖరీఫ్, రబీ సీజన్లలో 9 కోట్ల గోనె సంచులు అవసరం అవుతుందని అంచనావేశారు. వీటిని నిర్దేశించిన ప్రాంతాలకు రైల్‌మార్గంలో తరలించడానికి హమాలీలు ఎనిమిది పర్యాయాలు లోడింగ్ అన్‌లోడింగ్ చేయాల్సి వస్తోంది. అంటే ఒక్కో బేల్ (500 సంచులు) తరలించేందుకు 1590 రూపాయలు వ్యయం అవుతూ వస్తోంది. అయితే రైల్‌మార్గం కాకుండా రోడ్డు మార్గంలో ఈ సంచులను తరలించేందుకు 1000 రూపాయల నుండి 1100 రూపాయలు మాత్రమే వ్యయం అవుతుందని అంచనావేసి అమలు చేశారు. ఖరీఫ్‌లో 30 వేల బేల్స్ (1.50 కోట్ల సంచులు) రోడ్డు మార్గంలో రవాణా చేయడం వల్ల 1.40 కోట్ల రూపాయలు ఆదా అయింది. దాంతో మరో 7.50 కోట్ల సంచులను ఇదే విధానంలో రవాణా చేయాలని నిర్ణయించినట్టు కమిషనర్ ఆనంద్ తెలిపారు. అంటే రవాణాద్వారా మొత్తంమీద సంస్థకు తొమ్మిది కోట్ల రూపాయలు ఆదా అవుతోంది. తెలంగాణలో ప్రజాపంపిణీ అవసరాల కోసం ఖరీఫ్ సీజన్‌లో రైస్ మిల్లర్ల నుండి నాలుగు లక్షల టన్నుల దొడ్డుబియ్యాన్ని కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. క్వింటాల్ బియ్యానికి 2400 రూపాయలు (రెండు గోనె సంచుల ధర 106 రూపాయలు సంస్థ భరించేలా) ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయం పౌరసరఫరాల సంస్థకు భారంగా ఉంటుందని భావించిన కమిషనర్ మిల్లర్లతో చర్చించారు. కస్టం మిల్లింగ్ కోసం ధాన్యాన్ని మిల్లర్లకు సంచుల్లో సరఫరా చేసిన తర్వాత మిల్లర్ల వద్ద మిగిలిపోయిన రెండు గోనె సంచుల ద్వారా దొడ్డుబియ్యాన్ని సరఫరా చేయాలంటూ ఆదేశించారు. దాంతో సంస్థకు 13.27 కోట్లు ఆదా అయింది. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని గోనె సంచుల ద్వారా కస్టం మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) కోసం పౌరసరఫరాల సంస్థ మిల్లరకు అప్పగిస్తోంది. సగటున నాలుగు గోనె సంచుల్లో ధాన్యం మిల్లర్లకు అందిస్తుండగా, మిల్లర్లు కేవలం రెండు సంచుల్లోనే బియ్యం సరఫరా చేస్తున్నారు. అంటే మిల్లర్ల వద్ద రెండు సంచులు మిగిలిపోతున్నాయి. 2008-09 నుండి 2014-15 వరకు మిల్లర్ల వద్ద 4.60 కోట్ల గోనె సంచులు మిగిలిపోయినట్టు కమిషనర్ గుర్తించారు. వీటి రికవరీపై మిల్లర్లతో చర్చించారు. ఈ సంచులను రికవరీ చేయాలని భావించినప్పటికీ, అవి వినియోగానికి అనువుగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అమలు చేస్తున్నారు. ఒక సారి వాడిన సంచికి 27 రూపాయలు, రెండు సార్లు వాడిన సంచికి 8.50 రూపాయలుగా ధర నిర్ణయించారు. దీంతో సంస్థకు 66.48 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.