తెలంగాణ

మంత్రి జగదీశ్‌రెడ్డి ఇల్లు ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 19: ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటు బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఇంటి ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి నివాసం ముందు బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, పిడిఎస్‌యు (విజృంభణ), టివివిల ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి విద్యానగర్‌లోని మంత్రి నివాసం ముందుకు చేరుకొని బైఠాయించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రైవేటు, కార్పొరేట్ విద్యను నిర్మూలించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పిన కెసిఆర్ నేడు విద్యను ప్రైవేటీకరించే కుట్రతో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం తెలపడం దారుణమన్నారు. రిలయన్స్ విద్యాసంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం వందలాది ఎకరాల భూమిని కేటాయించడం సరైందికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కెజి టూ పిజి విద్యావిధానాన్ని అమలు చేయకుండా విద్యారంగాన్ని కార్పొరేట్‌మయం చేసేందుకు కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేట్ విద్యావిధానం వల్ల పేద, మధ్యతరగతి వర్గాల వారికీ విద్య అందని ద్రాక్షగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామన్నారు. విద్యార్థులు మంత్రి నివాసాన్ని ముట్టడించిన విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని బైఠాయించిన విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, బత్తుల విద్యాసాగర్, పిడిఎస్‌యు విజృంభణ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్ర అఖిల్, భిక్షం, టివివి జిల్లా ప్రధానకార్యదర్శి గుండాల సందీప్, నాయకులు పరుశరాం, కిరణ్, గణేశ్, దేవెందర్, కపిల్, ప్రవీణ్, కృష్ణ, నాగరాజు, నవీన్, రవి, ప్రియాంక, రాధిక, వౌనిక, ఉమా, రేణుక, మాసన పాల్గొన్నారు.

చిత్రం..జగదీశ్‌రెడ్డి నివాసం ముందు బైఠాయించిన విద్యార్థులు, ఆందోళనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు