తెలంగాణ

గోదారి వట్టిపోయంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెరవాల్సి ఉన్నప్పటికీ, గోదావరి నదిలో నీటి జాడలు అసలేమాత్రం లేకపోవడంతో మిన్నకుండిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరి నది పూర్తిగా వట్టిపోవడంతో ఎస్సారెస్పీ అధికారులు కూడా బాబ్లీ గేట్లు తెరిపించే ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వులను అనుసరిస్తూ బాబ్లీ గేట్లను తెరిపించేందుకు వీలుగా ఎస్సారెస్పీ ఎస్‌ఇ సత్యనారాయణ, డిఇ జగదీష్ మంగళవారం బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. అయితే అక్కడ గోదావరిలో చుక్క నీరు సైతం లేకపోవడాన్ని చూసి నిరాశతో వెనుదిరిగారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దున గోదావరి నదికి అడ్డంగా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మించిన విషయం విదితమే. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రెండు రాష్ట్రాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం గత రెండున్నరేళ్ల క్రితం తుది తీర్పును వెలువరించింది. బాబ్లీ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్ర ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా, నిర్ణీత సమయంలో కేవలం 2.74 టిఎంసిల నీటిని మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా అత్యున్నత స్థాయిలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందం ప్రకారం మహారాష్టక్రు కేటాయించిన 60 టిఎంసిల గోదావరి నదీ జలాల పరిధికి లోబడే 2.74 టిఎంసిల నీటిని వాడుకోవాలని, అది కూడా వర్షాకాలం ముగిసిన అనంతరం అక్టోబర్ 29 నుండి జూన్ చివరి వరకు గేట్లను వినియోగించుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా పరీవాహక ప్రాంతంలో నిలిచే నీటి నుండి యేటా మార్చి 1వ తేదీ నుండి 0.60 టిఎంసిల జలాలను పోచంపాడ్‌కు విడుదల చేయాలని తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పును అనుసరిస్తూ ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరవాల్సి ఉన్నప్పటికీ, చుక్క నీరు కూడా నిలువ లేకపోవడంతో గేట్లను తెరిచే విషయంలో ఇరు రాష్ట్రాల అధికారులు కూడా మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబ్లీ ప్రాజెక్టు ద్వారా గతేడాది జూలై 1వ తేదీన గేట్లు ఎత్తిన సందర్భంగా కేవలం 0.20 టిఎంసిల నీరు మాత్రమే ఎస్సారెస్పీలోకి వచ్చి చేరాయి. ప్రస్తుతం బాబ్లీ వద్ద నీటి నిల్వలు ఉండిఉంటే, బాబ్లీ తీర్పును అనుసరిస్తూ కనీసం 0.60 టిఎంసిల నీటినైనా విడుదల చేసేందుకు ఆస్కారం ఉండేది. వరుసగా రెండేళ్ల నుండి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇప్పటికే నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. 1091.00 అడుగులు, 90 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో ప్రస్తుతం 1049.00 అడుగులు, 5.60 టిఎంసిల నీరు మాత్రమే నిలువ ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి 16.41 టిఎంసిల నీరు నిల్వ ఉండింది. గడ్డుపరిస్థితుల్లో ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు నుండి నామమాత్రంగానైనా నీరు దిగువకు వచ్చి చేరుతుందని ఆశించగా, గోదావరి ఎగువన కూడా నీటి జాడలు పూర్తిగా అంతరించిపోవడంతో బాబ్లీ గేట్లు తెరుచుకోలేకపోయాయి.

చందంపేట పోలీస్‌స్టేషన్‌లో మిస్‌ఫైర్
సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పరిస్థితి విషమం
దేవరకొండ, మార్చి 1: నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని చందంపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చేతిలోని గన్ మిస్‌ఫైర్ అయిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో సెంట్రీడ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు (పిసి నెంబర్ 1666) చేతిలో ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తూటా కానిస్టేబుల్ ఎడమ వైపు చాతీలోని కింది భాగం నుండి దూసుకెళ్ళింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును పోలీస్ సిబ్బంది హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వర్లు రాష్ట్ర పోలీస్ భద్రతా విభాగంలో 2013 లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ఇతని స్వగ్రామం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని మేడారం గ్రామం. గత రెండు నెలలుగా వెంకటేశ్వర్లు చందంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడని దేవరకొండ రూరల్ సిఐ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని సిఐ పేర్కొన్నారు.
అకాల వర్షం.. అపార నష్టం
బలమైన ఈదురుగాలులు మొక్కజొన్న, మిర్చికి అపారనష్టం
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 1: వరంగల్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి తరువాత కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులతో దాదాపు గంట సేపు భారీ వర్షం కురిపించింది. కొన్ని చోట్ల రాళ్లతో కూడిన వర్షం పడింది. దీంతో జిల్లాలోని 79 గ్రామాల్లో 3,384 హెక్టార్లలో మొక్కజొన్న పంటకు భారీగా నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు అమ్మకానికి తెచ్చిన మిర్చి అకాల వర్షానికి తడిసి ముద్దయింది. అనేక గ్రామాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిపోవడంతో అన్నదాతలకు కన్నీరే మిగిల్చింది.
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నిర్వాకం..
ఇంటర్ విద్యార్థినికి అందని హాల్‌టికెట్
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ తల్లిదండ్రుల ఆందోళన
చొప్పదండి, మార్చి 1: విద్యార్థులను చక్క దిద్ది వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వారి జీవితాల్లో చీకటిని నింపిన సంఘటన మండలంలోని రుక్మాపూర్ మోడల్ స్కూల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రుక్మాపూర్ మోడల్ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సిహెచ్ అనూష అందరి విద్యార్థుల లాగే పరీక్ష ఫీజు చెల్లించింది. కాగా, పరీక్షల సమయం దగ్గర పడడంతో అందరు విద్యార్థులకు హాల్ టికెట్ అందించగా, అనూషకు మాత్రం ఇవ్వలేదు. దీనిపై మంగళవారం విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ప్రిన్సిపాల్ పద్మశ్రీని నిలదీశారు. అనూష ఫీజు చెల్లించిందని, అయతే హాల్ టికెట్ విషయంలో తమ దగ్గరే పొరపాటు జరిగిందని ప్రిన్పిపాల్ పద్మశ్రీ చెప్పటంతో విద్యార్థితో పాటు తల్లితండ్రులు అవాక్కయ్యారు. దీంతో తనకు పరీక్షలు రాసే అవకాశం లేదా? అంటూ విద్యార్థిని అనూష బోరుమంది. ఎలాగైనా పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అనూష, ఆమె తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను వేడుకున్నారు. కానీ బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రిన్పిపాల్ చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అనూష బంధువులు ప్రిన్పిపాల్ పద్మశ్రీని సస్పెండ్ చేయాలని డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎంఇవో రాజనర్సింహా ఆదర్శ పాఠశాలకు చేరుకున్నారు. అనూష హాల్‌టికెట్ గల్లంతు విషయంపై ఆరా తీశారు. అనూష ఫీజు చెల్లించిన రిసిప్ట్ గల్లంతవడంతో హాల్ టికెట్ రాలేదని ప్రిన్సిపాల్ వివరించారు. విద్యార్థినికి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదేనంటూ ఎంఇవో ప్రిన్సిపాల్‌కు స్పష్టం చేశారు.

తేనెటీగల దాడిలో వృద్ధుడి మృతి
ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం
మేడిపల్లి, మార్చి 1: కుటుంబ సభ్యులతో కలిసి వనభోజనానికి వెళ్లిన ఓ కుటుంబంపై తేనెటీగలు దాడి చేయడంతో యాజమాని మృతి చెందగా మిగిలిన ముగ్గురు కుటుంబసభ్యుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘ టన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలంలోని బీమారం గ్రామంలో జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చెక్కపల్లి గంగారాం (66) అనే రైతు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం బీమారం గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం వద్ద మొక్కులు చెల్లించుకుని వనభోజనాలు చేయడానికి వెళ్లారు. వంట చేస్తుండగా పొగ ఎగిసిపడడంతో తేనె టీగలు కుటుంబ సభ్యులపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన చెట్‌పల్లి గంగారాం, భార్య లక్ష్మి, కొడుకు దినేష్, మనుమరాలు శ్రీహర్షను జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గంగారాం మృతి చెందారు. మిగిలినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి పెద్ద అయన గంగారాం దహన సంస్కారాలకు భార్య, కొడుకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. ఈ హృదయ విషాదకర సంఘటన పట్ల బీమారం గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.