తెలంగాణ

ఫిరాయింపులపై గగ్గోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: పార్టీ ఫిరాయింపులపై సోమవారం శాసనసభ అట్టుడికింది. ఈ అంశంపై అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు మధ్య తీవ్రస్థాయిలో కొనసాగిన వాదోపవాదాలతో సభ 45 నిమిషాలపాటు స్తంభించింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వ్యవధి ముగిసిన తర్వాత సభలో టిఎస్-ఐపాస్‌పై సభ లఘు చర్చ చేపట్టింది. పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ చర్చను ప్రారంభించిన అనంతరం కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ నూతన పారిశ్రామిక విధానంవల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదంటూ నలబై నిమిషాల పాటు ప్రసంగించారు. ఆ తర్వాత ఎంఐఎం సభ్యుడు కైసర్ మాట్లాడారు. ఆ తర్వాత మాట్లాడటానికి కాంగ్రెస్ నుంచి గెలుపొంది టిఆర్‌ఎస్‌లో చేరిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు స్పీకర్ అవకాశం కల్పించగా, కాంగ్రెస్ శాసనసభ పక్షం ఉప నాయకుడు టి జీవన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ అర్డర్ లేవనెత్తారు. అజయ్‌కుమార్‌కు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడటానికి అవకాశం కల్పించారని ప్రశ్నించారు. ఒకపార్టీ తరఫున గెలుపొందిన అజయ్‌కుమార్ మరో పార్టీలోకి ఫిరాయించినప్పటికీ కాంగ్రెస్ నుంచి మరో సభ్యునికి మాట్లాడటానికి ఇవ్వాల్సిన అవకాశాన్ని అజయ్‌కుమార్‌కు ఎలా ఇచ్చారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. సభలో ప్రతి సభ్యునికి మాట్లాడే హక్కు ఉందని, మాట్లాడటానికి ఎవరికి అవకాశం ఇవ్వాలన్నది తన నిర్ణయమని, తన విచక్షణాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకువెళ్లారు. పార్టీ ఫిరాయించిన సభ్యులపై చర్య తీసుకోవాలని తాము ఫిర్యాదు చేసినప్పటికీ చర్య తీసుకోలేదని, పైగా మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా ఫిరాయింపులను స్పీకర్ ప్రోత్సహించే విధంగా ఉందని కాంగ్రెస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. టిఎస్-ఐపాస్‌పై మాట్లాడతానని సభ్యుడు అజయ్‌కుమార్ తనను కోరడంతో అవకాశం కల్పించానని, దానిని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదని స్పీకర్ పదే పదే చెప్పినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వినిపించుకోలేదు. ఈ దశలో ప్రతిపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుంటూ స్పీకర్‌కు ఉన్న విశేషాధికారాలను తాము ప్రశ్నించడం లేదని, అయితే నిబంధనల ప్రకారం మాట్లాడటానికి సభలో అన్ని పక్షాలకు అవకాశం కల్పించిన తర్వాతే ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. నిబంధనల ప్రకారం సభ్యునికి కేటాయించిన స్థానం నుంచే లేచి నిల్చోని మాట్లాడాలని, అలా కాకుండా ఇక్కడ (కాంగ్రెస్‌కు కేటాయించిన) కూర్చొవాల్సిన సభ్యుడు అక్కడ (పాలక పక్షానికి కేటాయించిన సీట్లలో) కూర్చుంటే మాట్లాడానికి ఎలా అవకాశం ఇస్తారని జానారెడ్డి ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్ జోక్యం చేసుకుంటూ అలా ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని, 2004 నుంచి 2014 వరకు తమ పార్టీ (టిఆర్‌ఎస్) నుంచి గెలుపొందిన సభ్యులు కాంగ్రెస్‌లో చేరినప్పుడు అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఎదురుదాడికి దిగారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా మరోసారి పోడియం వద్దకు దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. అయినా ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా స్పీకర్..అజయ్‌కుమార్‌ను ఆదేశించారు. ఇంతలో కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశారు. ప్రధాన పక్షాల సభ్యులు మాట్లాడిన తర్వాతనే ఇతర సభ్యులకు అవకాశం కల్పించాలన్న నిబంధనను గుర్తు చేశారు. దీనిపై ఇదివరకే తాను వివరణ ఇచ్చానని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో తిరిగి కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేయడంతో అజయ్‌కుమార్‌ను కూర్చొవాల్సిందిగా ఆదేశించి బిజెపి సభ్యుడు చింతల రామచంద్రారెడ్డికి అవకాశం కల్పించడంతో కాంగ్రెస్ సభ్యులు శాంతించారు.

చిత్రాలు..జానారెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి