తెలంగాణ

పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం/ హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి (లింగాల) వెంకటరెడ్డి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. కామేపల్లి మండలం పాత లింగాలకు చెందిన ఆయన శ్వాసకోశ వ్యాధితో గత నెల 19న హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1944 మే 22న వెంకటరెడ్డి పాత లింగాలలో నారాయణరెడ్డి, కమలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు భార్య సుచరిత, నలుగురు కుమార్తెలున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉస్మానియా వర్సిటీలో చదివిన వెంకటరెడ్డి, మొదటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శీలం సిద్దారెడ్డికి ప్రియ శిష్యుడు. ఇందిరాగాంధీ, రాజీవ్‌లను ఆదర్శంగా తీసుకుంటూ మొదటి నుండి కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. 1960 నుండి 1975 వరకు పదిహేనేళ్లు పాత లింగాల సర్పంచ్‌గా, ఇల్లెందు సమితి సభ్యుడిగా, అదేకాలంలో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1985లో తొలిసారిగా సుజాతనగర్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేశారు. 1989లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1994లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం సిపిఐ నాయకుడు రజబ్‌అలీ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో 1996 లోనూ, 99, 2004 ఎన్నికల్లోనూ వరుసగా మూడుసార్లు సుజాత్‌నగర్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజనలో సుజాత్‌నగర్ నియోజకవర్గం రద్దుకావడంతో 2009లో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009మే 25న రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ ఉద్యానవన శాఖ మంత్రిగా పనిచేశారు. 2015 అక్టోబర్ 17న ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన తమ్ముడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా మాజీ మంత్రి. పశుసంపద అంటే బాగా ఇష్టపడే వెంకటరెడ్డి తన తండ్రి నారాయణరెడ్డి పేరుమీద ‘నంది బుల్స్’ పేరిట ఒంగోలు గిత్తలను పెంచుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ గిత్తల పోటీ జరిగినా తమ గిత్తలను ఆయన పోటీకి దించేవారు. రాంరెడ్డి వెంకటరెడ్డి తన ముగ్గురు సోదరులతో ఉమ్మడి కుటుంబంగానే కలిసి ఉంటున్నారు. వెంకటరెడ్డి మరణంతో కుటుంబీకులు, ఆప్రాంత ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు.
ఉత్తమ్, జానా నివాళి
రాంరెడ్డి వెంకటరెడ్డి మరణవార్తతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఆసుపత్రికి చేరుకుని భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు.
నేడు అంత్యక్రియలు
రాంరెడ్డి వెంకటరెడ్డి భౌతికకాయానికి శనివారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలోని ఆయన స్వగ్రామమైన పాత లింగాలలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు.
సిఎం సంతాపం
రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి పట్ల సిఎం కె చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబీకులకు సిఎం సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్ మధుసూదనా చారి, ఏఐసిసి నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు వెంకటరెడ్డి మృతికి సంతాపం తెలిపారు.