తెలంగాణ

భూసేకరణ బిల్లుకు నిరసనగా కోదండ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, డిసెంబర్ 29: ప్రజాసామ్యయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. 2013 భూ సేకరణ చట్టానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను విరమించుకోవాలని, బలవంతపు భూసేకరణను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గురువారం తార్నాకాలోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయాలని ముందుగా కోదండరామ్ భావించినప్పటికీ తెలంగాణ నుంచి తరలివస్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. కోదండరామ్‌ను ఇంటి వద్దనే అడ్డుకున్నారు. దాంతో ఆయన తన నివాసంలోనే దీక్షకు పూనుకున్నారు. పోలీసుల హడావిడితోపాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తరలిరావడంతో తార్నాక ప్రాంతమంతా సందడిగా మారిపోయింది.
కోదండరామ్ మాట్లాడుతూ భూసేకరణకు 2013 బిల్లును యధావిధిగా కొనసాగించాలని, మార్పులు చేయడం ద్వారా పేదప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలన్నారు. అక్రమ నిర్బంధాలను విడనాడి అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని, ప్రజాందోళనలను అణచివేయాలని చూస్తోందని అన్నారు. బలవంతంగా భూసేకరణ చేసి ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులనే ఈ ప్రభుత్వం అణచివేతకు గురిచేయడం దారుణమన్నారు. ఆనాడు సాగరహారం కోసం కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి సమైక్య రాష్ట్రంలో అనుమతి ఇప్పించానని, కాని నేడు స్వరాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేయడానికి కూడా వీలులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపి వి హనుమంతరావు మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణను తన సొంత జాగీరనుకుంటున్నారని, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే తామే తీసుకువచ్చామని బీరాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల నుంచి అవసరమైన భూమిని మాత్రమే తీసుకోవాలన్నారు. కెసిఆర్ బంగారు తెలంగాణ చేస్తుంటే తాము అడ్డుకుంటున్నామని తమపై అపవాదు వేస్తున్నారన్నారు. దాదాపు 15వందల మంది యువకులు తెలంగాణకు బలిదానం ఇచ్చారని, అసెంబ్లీలో అమరవీరుల కుటుంబాలకు రు.10లక్షలు, 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కెసిఆర్ ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. ట్యాంక్‌బండ్‌పై అమరుల స్థూపం నిర్మిస్తామని చెప్పి చివరకు అమరవీరులను సైతం మోసం చేసిన కెసిఆర్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి మేధావులు, న్యాయవాదులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ప్రొఫెసర్ కోదండరామ్ గురువారం సాయంత్రం దీక్ష విరమించారు. విద్యావేత్త చుక్కా రామయ్య నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు.

చిత్రం..భూసేకరణ బిల్లుకు నిరసనగా దీక్ష చేస్తున్న ప్రొఫెసర్ కోదండరామ్. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,
జానారెడ్డి, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి కూడా చిత్రంలో ఉన్నారు.