తెలంగాణ

బడ్జెట్‌లో వైద్యానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: సీఎం కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ఈ దఫా వైద్య, ఆరోగ్య రంగానికి అధిక నిధులు కేటాయించనున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం రంగాపుర్‌లోని నిమ్స్ యూనివర్సిటీ భవనంలో అవుట్ పేషంట్ వైద్య సేవలను విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల స్థాయిని, వౌలిక వసతులను మెరుగుపరిచి ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నిమ్స్‌ను దశలవారిగా అభివృద్ధి చేసి పూర్తిస్థాయిలో కార్పొరేట్ తరహాలో ప్రజలకు అన్ని వైద్య సేవలందిస్తామన్నారు. సమైక్య రాష్ట్ర పాలకులు నిమ్స్‌తో పాటు శంకుస్థాపన చేసిన కడప రిమ్స్‌ను పూర్తి చేసి నిమ్స్‌ను అసంపూర్తిగా వదిలేసి వివక్ష చూపారన్నారు. సీఎం కెసిఆర్ ఆదేశాలతో నిమ్స్ ఆసుపత్రి భవనంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 42.5వేల చదరపు అడుగుల భవనంలో ముందుగా ఓపి వైద్య సేవలను ప్రారంభించామన్నారు. నిమ్స్ భవనం అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేసి వౌలిక వసతులను కల్పించి త్వరలోనే ఇన్‌పేషెంట్ విభాగాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. సీఎం కెసిఆర్ ఆదేశాలతో కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో వైద్య విధానాలను అధ్యయనం చేశామని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాన్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. మంత్రి జి.జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ నిమ్స్‌లో ఓపి సేవల ప్రారంభంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. నిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్యసేవలందించినట్లయితే హైద్రాబాద్ నిమ్స్‌పై భారం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌లో అంతదూరం ప్రజలు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుందన్నారు. నిమ్స్‌లో పూర్తి స్థాయి వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
నిమ్స్ డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ నిమ్స్ ఓపి విభాగంలో ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వైద్య సేవలు ప్రారంభించామన్నారు. ఓపిలో 8మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16మంది సర్వీసు డాక్టర్లు వైద్యచికిత్సలు అందిస్తారన్నారు. మెరుగైన చికిత్స అవసరమైన రోగులను హైద్రాబాద్ నిమ్స్‌కు తరలించి ఇన్‌పేషెంట్ విభాగంలో చేర్చి వైద్య సేవలు అందిస్తారన్నారు. రోగులకు అందుబాటులో 108 అంబులెన్స్ వాహనాన్ని సిద్ధంగా ఉంచుతామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో అత్యాధునిక పరికరాలతో వైద్య చికిత్సలు నిర్వహిస్తారని ఉదయం 9గంటల నుండి 2గంటల వరకు ఓపి విభాగం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. 30లక్షల రూపాయల నిధులతో పూర్తిస్థాయి ఆటోమెటిక్ కంప్యూటర్ సిస్టం ద్వారా ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హైద్రాబాద్ నిమ్స్ తరహాలోనే బీబీనగర్ నిమ్స్ ఓపి విభాగంలో నామమాత్రపు 50రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎంపి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిమ్స్ సెక్రటరీ రాజేష్‌తివారీ, డిప్యూటీ డైరెక్టర్ కేటిరెడ్డి, ఎంపిపి గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, జడ్పీటిసి సందిగారి బస్వయ్య తదితరులు పాల్గొన్నారు.

బీబీనగర్ నిమ్స్‌లో ఓపి వైద్యసేవలను ప్రారంభిస్తున్న మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి

కిమ్స్‌లో జాతీయ సదస్సు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 6: కిమ్స్ ఆసుపత్రి మరో జాతీయ సదస్సుకు వేదికగా నిలిచింది. పెల్విస్, ఏస్ టాబులర్ ఫ్రాక్చర్స్‌పై జాతీయ సదస్సును ఆదివారం తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి కిమ్స్‌లో ప్రారంభించారు. అసోసియేషన్ ఆఫ్ పెల్విస్, ఏస్‌టాబులర్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏపిఏఎస్‌ఐ), కిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సు నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ సైతం భాగస్వామి అయ్యింది. ఎముకలకు అయిన గాయాలను ఆధునాతన శస్త్ర చికిత్స ద్వారా విజయవంతం చేసేందుకు అవసరమైన బోన్ మోడల్ వర్క్‌షాప్‌ను ఈ సదస్సు నిర్వహణ సందర్భంగా ప్రదర్శించనున్నట్లు కిమ్స్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ ట్రామా సర్జన్ డాక్టర్ శ్రీనివాస కాస ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా నిపుణులైన ఫ్యాకల్టీ ఈ సమావేశానికి హాజరై తమ అనుభవాలను పంచుకోవడమే కాకుండా యువ వైద్యులకు మార్గదర్శకం చేసేందుకు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి.

నిబంధనలకు పాతర!

అర్హత లేని ఫార్మసిస్టులతో వ్యాపారం
అరకొర వేతనాలు, 12 గంటల పనిభారం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 6: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఫార్మసీలు ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనలు పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ‘గుడ్ ఫార్మసీ ప్రాక్టీసెస్’ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గుడ్ ఫార్మసీ ప్రాక్టీస్ కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినా ఔషధ నియంత్రణ మండలి మాత్రం సంయుక్త రాష్ట్రంలోనే ఉన్న నిబంధనలను పాటిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో 27వేల మందుల షాపుల్లో పనిచేసే ఫార్మసిస్టులు అర్హత లేకుండా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 55వేల క్వాలిఫైడ్ ఫార్మసిస్టులున్నారని, వీరిలో కొంత మంది మాత్రమే ప్రధాన మెడికల్ షాపుల్లో ఉపాధి పొందుతున్నట్టు ఫార్మా డి డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మెడికల్ షాపుల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్టులను నియమిస్తే రోజుకు ఎనిమిది గంటల పని చేస్తే, నెలకు 13వేలు వేతనం ఇవ్వాల్సి వస్తుంది. కానీ అందుకు భిన్నంగా మెడికల్ షాపుల యజమానులు అర్హతలేని ఫార్మసిస్టులను నియమించుకొని రోజుకు 12 గంటలు పనిచేయించుకుంటూ నెలకు కేవలం ఆరేడు వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో అర్హత కలిగిన ఫార్మసిస్టులు మెడికల్ హాళ్లలో పనిచేసేందుకు ఇష్టపడడం లేదని ఫోరం డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 60శాతం ప్రజలు మెడికల్ ఫార్మసిస్టులపైనే ఆధారపడి మందులను వాడుతుంటారు. అలాంటి వారికి రోగాల నిర్ధారణ, మందుల సబ్‌స్క్రిప్షన్‌లపై అవగాహన ఉండాలి. ఒక వైద్యుడు రాసిన మందులు లభించని పక్షంలో సబ్‌స్టిట్యూడ్ మందులు ఇచ్చేస్తున్నారు. అర్హతలేని ఫార్మసిస్టులు రోగులకు సరైన మందులు ఇస్తున్నట్టు గ్యారంటీ ఏమిటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్టు కొందరు వైద్యులు చెబుతున్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ హాళ్లలోని ఫార్మాసిస్టులు చాలా వరకు అనర్హులేనని ఏపి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. 2013 డిసెంబర్‌లో సమైక్య రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఎపి డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ షాపులపై దాడులు నిర్వహించింది. 717 ఫార్మసీ స్టోర్‌లపై నిర్వహించిన దాడుల్లో 474 షాపుల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు లేరని తేలింది. హైదరాబాద్‌లోని 109 స్టోర్స్‌లో తనిఖీ చేయగా 88షాపులు నిబంధనలను ఉల్లంఘించాయి. వీటిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలావుండగా 1948 ఫార్మసీ చట్టం సెక్షన్ 42ప్రకారం అర్హతలేని ఫార్మాసిస్టులకు ఆరు నెలల జైలుతోపాటు రూ. 1000 జరిమానా విధిస్తారు. అలాంటి నియమ నిబంధనలు పాటించకుండా తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ హాళ్ల నిర్వహణ కొనసాగుతుందని ఆరోపణలున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) రెగ్యులేటరీ బాడి నిర్దేశించిన నిబంధనల మేరకు ఫార్మసీ ప్రాక్టీస్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు ఫార్మసిస్టులు కోరుతున్నారు.