తెలంగాణ

మహా ఒప్పందం నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహారాష్ట్ర సర్కార్‌తో చేసుకునే ఒప్పందం రెండు రాష్ట్రాలకు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉభయతారకంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా గోదావరిపై నిర్మించబోయే ఐదు ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి సోమవారం ఉదయం ముంబయికి బయలుదేరి వెళ్లడానికి ముందు నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, నీటిపారుదల రంగం ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు, ఇంజనీరింగ్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణాల ఒప్పందాలు పరస్పర అవగాహనతో ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ మేరకే ఒప్పంద పత్రాలను సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, నీటిపారుదల రంగం సలహాదారు విద్యాసాగర్ రావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇంజనీరింగ్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు, వ్యాప్కో ప్రతినిధి శంబు ఆజాద్ వెళ్లారు. ముఖ్యమంత్రి బృందం మధ్యాహ్నం 2.20 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో విమానం దిగి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంది. రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రికి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు స్వాగతం పలికారు. అనంతరం వారు అక్కడే భోజనాలు ముగించాక మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోబోయే ఒప్పందాలపై గవర్నర్‌కు వివరించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సిఎం కెసిఆర్ భేటీ కానున్నారు. అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకోనున్నారు.
ఇలా ఉండగా గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలకు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు తక్కువ నష్టం, ఎక్కువ లాభం కలిగేలా ఈ ప్రాజెక్టుకు వ్యాప్కోస్ సంస్థ ద్వారా రీ-డిజైన్ చేయించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి తలెత్తిన అభ్యంతరాలు తొలగిపోయాయి. దీని తర్వాతనే గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులపై నిర్మించబోయే కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఐదు ప్రాజెక్టులలో రెండు ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం, మూడు ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మించే విధంగా మంగళవారం ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోనున్నాయి. మహారాష్ట్ర అభ్యంతరాల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయగల ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు అభ్యంతరాలు తొలగిపోవడంతో మంగళవారం ఇరు రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం కుదరబోతోంది.

చిత్రం... మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుతో సోమవారం రాజ్‌భవన్‌లో సమావేశమైన సిఎం కెసిఆర్ బృందం