తెలంగాణ

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంలో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ఎంతైతే చెప్పిందో అంత చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల వ్యయమే నిదర్శనం అని ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి విమర్శించారు. శాసనసభలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై జరిగిన లఘు చర్చలో జానారెడ్డి మాట్లాడుతూ, 2015-16లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులు 37,643 మందికి స్వయం ఉపాధి కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయలేకపోయిందన్నారు. ఎస్సీల కోసం కేటాయించిన రూ.380 కోట్లలో రూ.136 కోట్లు, ఎస్టీల కోసం కేటాయించిన దానిలో 33 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. ఎస్సీలకు కేటాయించిన దాంట్లో 40 శాతం, ఎస్టీలకు కేటాయించిన దాంట్లో 50 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసిందని జానారెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం ఎంత చేసిందో అదే సభలో చెప్పిందని, అయితే ఎంతైతే చేస్తామని హామీ ఇచ్చిందో అంత చేయలేకపోయిందని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని జానారెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు మొదటి నుంచి అన్యాయమే చేసిందని విమర్శించారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు పదవీకాలాన్ని పొడిగించకుండా నెల రోజులలోనే ఇంటికి పంపిందని వాపోయారు. సీనియారిటీ లేకపోవడం వల్లనే ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని పొడిగించలేదంటున్న ప్రభుత్వం ఏడాది కిందటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎందుకు అవకాశం కల్పించలేదని సంపత్‌కుమార్ ప్రశ్నించారు. ప్రదీప్‌చంద్రకు ముందు ప్రధాన కార్యదర్శిగా పని చేసినతనికి రెండు పర్యాయాలు పదవీకాలాన్ని పొడిగించడం వల్లనే ప్రదీప్‌చంద్రకు అవకాశం దక్కకుండా పోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో కేటాయించిన దానికంటే ఎక్కువ నిధులు ఖర్చు చేశామనడం అవాస్తవమని ఆయన విమర్శించారు. ఎక్కువ నిధులు ఖర్చు చేసినట్టు నిరూపిస్తే శాసనసభ సాక్షిగా ముక్కు నేలకు రాస్తానని సంపత్‌కుమార్ సవాల్ చేశారు. రాష్ట్రంలో 54 లక్షల మంది ఎస్సీలు ఉండగా, 63 లక్షల మంది ఎస్సీలకు సన్న బియ్యం ఇచ్చామని చెప్పడం అవాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. గత శాసనసభ సమావేశాలలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై సభను తప్పుదోవ పట్టించడంపై సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
బిజెపి సభ్యుడు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కమిషన్లు ఏర్పాటు చేయలేదన్నారు. దళితులకు ఉచితంగా మూడు ఎకరాలు కొనుగోలు చేయడానికి మొదటి సంవత్సరం రూ.900 కోట్లు కేటాయించి అందులో కేవలం 70.63 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రెండవ ఏడాది రూ.500 కోట్లు కేటాయించి రూ.188 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. ఎంఐఎం సభ్యుడు మోజంఖాన్ మాట్లాడుతూ మైనార్టీలు, బిసిలకు కూడా ఉప ప్రణాళికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య విమర్శించారు. ఈ వర్గాలకు కేటాయించిన నిధులను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ పక్షాన మాట్లాడిన రసమయి బాలకిషన్, హన్మంతు షిండే, ఆరూరి రమేశ్ తమ ప్రసంగాలలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ చేసినంతగా మునుపెన్నడూ మరే ప్రభుత్వం చేయలేదని కొనియాడారు.