తెలంగాణ

మేకనిస్తాం... నూకలిస్తారా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిజన ప్రాంతాల్లో మళ్లీ వస్తుమార్పిడి
చీపురుపుల్లలిచ్చి నిత్యావసరాల సేకరణ
నోట్ల రద్దుతో బార్టర్ విధానానికి ప్రాణం
అవగాహన లేక గిరిజనుల కష్టాలు

ఖమ్మం, జనవరి 10: తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో పెద్దనోట్ల రద్దు తరువాత ఇబ్బందులు ఎక్కువయ్యాయి. నగదుకు కొరత ఏర్పడింది. బ్యాంకు లావాదేవీలు, ఎటిఎంలు అందుబాటులో లేవు. ఉన్నా వాటిని ఉపయోగించుకోవడం తెలీదు. దీంతో నగదుతో పనిలేని వస్తుమార్పిడి విధానం మళ్లీ మొదలైంది. ఎప్పుడో అక్షరాస్యత పెద్దగా లేని, సౌకర్యాలు లేని రోజుల్లో చెల్లుబాటయిన వస్తుమార్పిడి పద్ధతి ఆధునిక సమాజంలోనూ అనుసరించడమే బాధాకరం.. అదీగాక దీనివల్ల గిరిజనులు పెద్దఎత్తున మోసపోతున్నారుకూడా. ఇది నిజమేనా అన్న సందేహం ఉంటే..ఓ సారి గిరిజన ప్రాంతాల సమీపంలో జరిగే వారపు సంతలకు వెళ్లిచూస్తే అసలు విషయం తెలుస్తుంది. తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. విస్తృత ప్రచారమూ చేస్తోంది. స్వైప్‌మిషన్ల హంగామాకూ తక్కువేమీ లేదు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో ఇది సాధ్యమా అన్నది ప్రశ్న. గిరిజనులు ఎక్కువగా ఉన్న అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ పాఠశాలలే లేవు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో నివసించే గిరిజనులకు ఇంకా విద్య అందని ద్రాక్షే. అక్కడ అక్షరాస్యత 50శాతం ఉంటే గొప్పే. నగదు రహితం చేయాలంటే వీరందరినీ అందులో భాగస్వాములను చేయాల్సిందే. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. నిజానికి అటవీప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు ఆర్ధిక లావాదేవీలపై ఇప్పటికీ సరైన అవగాహన లేదు. ఇప్పటికీ పాత పద్ధతైన వస్తుమార్పిడి విధానానికి వచ్చేసారు. అడవిలో నిత్యం దొరికే ఉత్పత్తులను సమీపంలోని మైదాన ప్రాంతవాసుల ఆధీనంలో జరిగే వారపు సంతలలో వస్తుమార్పిడి చేసుకుంటున్నారు. ఈ పద్ధతిలో తమకు అవసరమైన నిత్యావసర వస్తువులను తెచ్చుకుంటున్నారు. విప్పపువ్వు, తేనె, అడవి పందుల మాంసం, పండ్లు తదితరాలతోపాటు కూలికి వెళితే వచ్చే మిరప, పత్తిలాంటి వాటిని వారపు సంతలకు తీసుకువెళ్లి తమకు అవసరమైన వస్తువులను తెచ్చుకుంటున్నారు. ఆధునిక సమాజంలో మాదిరిగా త్రాసులతో కాకుండా పాత పద్ధతిలోనే కొలతలు సాగుతున్నాయి. సంతకు వచ్చే వ్యాపారుల వద్ద ఉన్న డబ్బాలతో కొలుస్తారు. తమవద్ద ఉన్న సరుకును ఒక డబ్బా ఇచ్చి అదే డబ్బా పరిమాణంలో బియ్యం పొందుతున్నారు. ఇదే పద్ధతిలో మిరప, పత్తి, తేనె, పండ్లు మార్చుకుంటున్నారు. చీపురు పుల్లలను ఇచ్చి బట్టలు, దువ్వెన, అద్దంలాంటి వస్తువులను తెచ్చుకుంటున్నారు. తాము పెంచుకునే మేకలను ఇచ్చి అదే బరువు ఉన్న నూకలను తీసుకువెళ్లడం అక్కడ మామూలే. డబ్బాల కొలత కాకుండా పోగులుపోసి అమ్మే పద్ధతీ ఆయా సంతల్లో కనిపిస్తుంది. వస్తుమార్పిడి ద్వారా విలువైన అటవీ ఉత్పత్తులను ఎక్కువమొత్తంలో ఇచ్చేసి అంతకన్నా తక్కువ విలువకు తగ్గ వస్తువులను పొందుతున్నారు. గిరిజనులు మోసపోతున్నారని తెలిసినా నోరువిప్పేవారుండరు.
ఆ సంతల్లో అదే తంతు
భద్రాచలం డివిజన్‌లోని చర్లలో ఆదివారం, భూపాల్‌పల్లి జిల్లాలోని వెంకటపురంలో మంగళవారం, పెరూరులో బుధవారం, ఆలుబాకలో సోమవారం, తూర్పుగోదావరి జిల్లా చింతూరులో బుధవారం జరిగే సంతలలో ఈ వస్తు మార్పిడి కనిపిస్తుంది. చాలా అరుదుగా, తప్పనిసరైతే మాత్రమే నగదుతో వస్తువులు కొనేందుకు వారు ఇష్టపడతారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోని లక్షలాది మంది గిరిజనుల పరిస్థితి అది. ఈ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నా మావోయిస్టుల కదలికలతోపాటు మరికొన్ని అంశాలు ఆటంకంగా మారాయి. పెద్దనోట్ల రద్దుతో కొన్ని వస్తువులను నగదుతో కొనుగోలు చేసే గిరిజనులు కూడా వస్తుమార్పిడికే ప్రాధాన్యత ఇవ్వాల్సివస్తోంది. తమ వద్ద ఉన్న నగదు చెల్లదంటూ కొంతకాలంగా వ్యాపారులు ప్రచారం చేయడం, బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలని చెబుతుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. నగదు లేక, పొందలేక పాత వస్తుమార్పిడిని ఆశ్రయిస్తున్నారు. నగదురహిత విధానమేనని వస్తుమార్పిడిని ప్రోత్సహించడం సరికాదు. అందువల్ల అధికారులు స్పందించి అటవీ ప్రాంతాల్లో గిరిజనులు మోసపోకుండా వస్తుమార్పిడిని అడ్డుకుని వారికి నగదురహిత విధానాలపై అవగాహన కల్పించి, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నవతెలంగాణ సాధ్యమైనట్లు.

................................
పెద్ద నోట్ల రద్దుతో జనం కార్డు వాడకానికి అలవాటుపడుతున్నారో లేదోగానీ, గిరిజనం మాత్రం వస్తుమార్పిడిలోకి తొంగి చూస్తున్నారు. గుప్పెడు నూకల కోసం మందనుంచి తెచ్చి మేకలిచ్చేస్తున్నారు. మందూ మాకూ కోసం ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన పుట్టతేనెను గుమ్మరిస్తున్నారు. వంటినికప్పే బట్టకోసం అడవినుంచి ఏరుకొచ్చిన చీపురు పుల్లలు, ఇంటి సామగ్రి కోసం విప్ప సారా బుడ్డీలు మార్చుకుంటున్నారు.
నిజానికి మన్యంలో సాగేదీ కేంద్రం, రాష్ట్రం కోరుకుంటున్న నగదురహిత చెల్లింపుల విధానమే. కాకపోతే గిరిజనం నష్టపోయేలా, వ్యాపారులు బాగుపడేలా
పురాతన బార్టర్ సిస్టమ్ (వస్తుమార్పిడి) అమలవుతోంది.

వారపు సంతలో మిరప పోగులు పోసి వస్తుమార్పిడి కింద
బియ్యం తీసుకునేందుకు వేచివున్న గిరిజనులు

తాళ్లూరి మురళీకృష్ణ