తెలంగాణ

వణికిస్తున్న చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 15: ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలుల తాకిడికి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతపడిపోయి చలితీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జనవరి మొదటి వారం నుండి సాధారణ ఉష్ణోగ్రతలు పెరిగి చలితీవ్రత తగ్గగా సంక్రాంతి పండగ వేళ చలిగాలులు వీయడంతో ఎముకలు కొరికే చలికి సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలు నమోదయ్యాయి. ఉట్నూరు, బోథ్, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో 5 నుండి 6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలితీవ్రతకు అద్దంపడుతోంది. చలి తీవ్రతకు తోడు వేకువజాము నుండి ఉదయం 11 గంటల వరకు చల్లని గాలులు వీస్తుండగా సాయంత్రం 6 దాటితే చాలు చలిధాటికి ప్రజలు గడపదాటి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దీంతో పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, మార్కెట్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత మూడు రోజుల నుండి చలి తీవ్రత ఆమాంతం పెరుగుతుండడంతో పిల్లలు, వృద్ధులు, యాచకుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. డిసెంబర్ రెండవ వారంలో జిల్లాలో ఈ ఏడాది రికార్డుస్థాయిలో 4.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆ తర్వాత క్రమంగా చలితీవ్రత తగ్గుముఖం పట్టి 12 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పండగ సెలవుల్లో బస్సుల్లో, వాహనాల్లో ప్రయాణించే విద్యార్థులు, పిల్లలు, పండగకు వెళ్లే ప్రజలు చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలోని ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూర్, సిర్పూర్‌యు, కెరమెరి మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని, అత్యల్ప ఉష్ణోగ్రతలతో వ్యవసాయ పనులు స్థంబించిపోతున్నాయని పేర్కొంటున్నారు. ఉదయం పూట పల్లెల నుండి పట్టణాలకు వచ్చి పాలు, కూరగాయలు విక్రయించే రైతులు, కూలీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో అరకొర సౌకర్యాల మధ్య చదువుకుంటున్న విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే తిరిగి సంక్రాంతి, కనుమ పండగ వేళ వాతావరణంలో వచ్చిన మార్పులు, విదర్బనుండి వీస్తున్న చల్లనిగాలులకు ఆదిలాబాద్ జిల్లాను చలిపులి వణికిస్తోంది. అత్యవసర పనుల్లో ఉదయం, రాత్రిపూట బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనగా వేకువజామున మంచు కురుస్తుండడంతో సామాన్యులు ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆస్తమా, దగ్గు, జ్వరం, శ్వాససంబంధ వ్యాధులు, జలుబు, కీళ్ళనొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. పట్టణాల్లో వేకువ జామున రోడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు, చిరువ్యాపారులు చలితో నానాతంటాలు పడుతున్నారు. సంక్రాంతి పండగ వేళ భోగి మంటలకు బదులు పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా చలి మంటలే దర్శనమిస్తున్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.