తెలంగాణ

త్వరలో ఉచితంగా గొర్రెల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసినట్టుగానే త్వరలో గొర్రెలను పంపిణీ చేయనున్నట్టు పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు తీసుకోవలసిన చర్యలను సూచించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ తలసాని నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘం చైర్మన్ హోదాలో తలసాని సచివాలయంలో సోమవారం అధికారులతో సమావేశం అయ్యారు. ఈనెల 19 లేదా 20న క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిపి, ఈ అంశంపై విస్తృతంగా చర్చించనున్నట్టు తలసాని తెలిపారు. యాదవ, ముదిరాజ్, బెస్త కులస్తుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని తలసాని తెలిపారు.
ఇప్పటికే నాలుగువేల చెరువుల్లో 298 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసినట్టు చెప్పారు. త్వరలోనే ఇదే విధంగా గొర్రెలను ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వాలు పశు సంవర్థక శాఖకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఈ కులాల పట్ల తగిన ఆదరణ చూపలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు బడ్జెట్‌లో ఐదు కోట్ల రూపాయలు కేటాయించి కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేసేవారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ మత్స్య శాఖకు 101 కోట్ల రూపాయలు కేటాయించారని, వచ్చే బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తలసాని తెలిపారు. త్వరలోనే వంద సంచార పశు వైద్య శాలలు ప్రారంభం కానున్నట్టు చెప్పారు. క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి సోమవారం సచివాలయంలో పశు సంవర్థక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, మత్స్యశాఖ కమిషనర్ బి వెంకటేశ్వరరావు, గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజువాణి, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో చర్చించారు.