తెలంగాణ

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే పెద్దనోట్ల రద్దుకు కెసిఆర్ వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 19: పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న మొదట తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ తరువాత వత్తాసు పలికే విధంగా వ్యవహరించటం ప్రజలను మోసం చేయటమేనని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
రెండున్నర సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి నుంచి కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దనోట్ల రద్దును సమర్ధిస్తూ ప్రధానికి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అధిష్టానం పిలుపు మేరకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు కారణంగా ఫీజు రియంబెర్స్‌మెంట్ చేయలేకపోతున్నామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపలేకపోతున్నామని అసెంబ్లీ సాక్షిగా తెలిపిన ముఖ్యమంత్రి ఇప్పుడు పెద్దనోట్ల రద్దు మహా అద్భుతమనేలా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రసుత రబీ సీజన్‌లో 42లక్షల ఎకరాలలో సాగు జరగలవలసి ఉండగా కేవలం 20లక్షల ఎకరాలలో మాత్రమే రైతులు పంటలు వేసారని, ఈ సీజన్‌కు బ్యాంకులు 11వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వవలసి ఉండగా పెద్దనోట్ల ప్రభావంతో కేవలం ఐదువేల కోట్ల రూపాయల రుణాలు మాత్రమే విడుదల చేసాయని చెప్పారు. ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు, మధ్యాహ్న భోజనం నిర్వాహకుల చెల్లింపులు జరగడం లేదని, ఇన్ని సమస్యలకు కారణమైన కేంద్రాన్ని నిలదీయవలసిన ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు తెలిపే విధంగా వ్యవహరించటం సిగ్గుచేటని విమర్శించారు. శాసనమండలిలో కాం గ్రెస్ పార్టీ నాయకుడు షబీర్ అలీ మాట్లాడుతు పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై అటు కేంద్రం, ఇటు ఆర్‌బిఐ వాస్తవాలను తెలపకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో ఎంతమేరకు నల్లధనం బయటపడిందో బహిరంగ ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు. ఏఐసిసి కార్యదర్శి కుంతియా మాట్లాడుతు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తన హయాంలో జాతీయకరణ ద్వారా బ్యాంకులను ప్రజలకు చేరువ చేస్తే పెద్దనోట్లను రద్దు చేయటం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ బ్యాంకులను ప్రజలకు దూరం చేసారని విమర్శించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద మాట్లాడుతూ కేంద్రప్రభుత్వానికి, కేంద్రాన్ని సమర్థిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. జిల్లా మహిళా కాం గ్రెస్ అధ్యక్షురాలు పద్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాయిని రాజేందర్‌రెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..మహిళా కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి