తెలంగాణ

ఫ్లోరైడ్ సమస్యకు మిషన్ భగీరథ పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 19: పూర్వపు నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కాదని, మిషన్ కాకతీయను కూడా అనుసంధానం చేసి రిజర్వాయర్లలో నిల్వచేసిన వర్షపు నీటిని నల్లాల ద్వారా అందిస్తే సత్ఫలితాలు సాధ్యమని ఆయన అన్నారు. చౌటుప్పల్‌లోని అటవీశాఖ అతిథిగృహంలో గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారానికి మిషన్ భగీరథ ఒక్కటే పరిష్కారం కాదని, మిషన్ కాకతీయను మరింత పటిష్టంగా అమలు చేస్తూ మిషన్ భగీరథతో జోడిస్తే ఫ్లోరైడ్ సమస్యను తుడిచిపెట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రిజర్వాయర్లలో సమృద్ధిగా నీరు ఉన్నప్పుడే ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందించేందుకు వీలు కల్గుతుందన్నారు. ఈ విషయంపై మంత్రి కేటిఆర్‌తో చర్చించానని, మరోమారు అధికారులతోనూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
పర్యాటక కేంద్రంగా కొలనుపాక
యాదాద్రి అభివృద్ధి కోసం యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారని, యాదాద్రికి సమీపంలోని కొలనుపాకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
కొలనుపాకలో అతిప్రాచీన జైన దేవాలయం, గొప్ప శివాలయం ఉన్నాయని ఆయన చెప్పారు. యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి ఆ రెండింటిని తీసుకువస్తామని, ఈ మేరకు కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు కోరామని చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్‌శర్మతో మాట్లాడి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. చౌటుప్పల్‌ను ‘రూర్బన్ మిషన్’ పథకం ద్వారా అభివృద్ధి చేసేందుకు మూడవ విడతలో ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. యాదాద్రి, నల్లగొండ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

చిత్రం..జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ