తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

వెలగని వీధిదీపాల బొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తొవ్వముచ్చట్లు’ పుస్తకం రెండో భాగం అచ్చేయడం కోసం అట్టమీద బొమ్మకై వెదుకులాట మొదలైంది. పాతకాలం నాటి వీధి దీపం బొమ్మ వేయాలనుకున్నాను. ఓ ఫొటో గాని, చిత్రం గాని దొరకుతుందేమోనని తెగ వెదికాను. పుస్తకాల్లో, వెబ్‌సైట్లలో గాలించాను. ఇతర దేశాల వీధిదీపస్తంభాల బొమ్మలు లభించాయే గాని మన దేశానికి సంబంధించినవి లేదా మన నేల మీది వీధి దీపాల బొమ్మలు కానరాలేదు. అసలు మనదగ్గర వీధి దీపాలు ఏయే కాలాలలో ఎలా ఉండేవో అన్న ఆలోచనలు ముసురుకున్నాయి. ఆ ఆలోచనలలో కొన్నింటిని ఈవారం మీతో ముచ్చటిస్తాను.
పోయిన నెల వరంగల్ రూరల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో క్షేత్ర పర్యటనకు వెళ్ళాం. ప్రాచీన కోట అయిన జఫర్‌గఢ్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు దివిటిపల్లి అనే ఊరు కనుపించింది. అలనాటి సుప్రసిద్ధ బౌద్ధక్షేత్రం అయిన ఫణిగిరి దగ్గర దీపాలపల్లి గ్రామం ఉండేదని ఆ ఊరి ప్రజలు చెప్పారు. అనేక ఊర్ల పేర్లు, ఇంటి పేర్లు కాగడాల, దీపాల, ఆరంజోతి, గండాదీపం, జ్యో తుల, ప్రమిదల వంటివి చెలామణిలో ఉన్నాయి. ఇవ్వన్నీ దీపాలకు సంబంధించినవే కావడం విశేషం.
జఫర్‌గఢ్ అతి పెద్ద కోట. అది ఓరుగల్లు కోటకీ, నిడికొండ గిరి కోటకీ మధ్యన ఉంటుంది. శత్రువుల కదలికలను, అత్యవసర సందేశాలను తెలపడం కోసం దివిటీలను ఊపేవారు. కదలికలను బట్టి, ఊపే సంకేతాలను బట్టి ఎదుటివారు వీటిని అర్థం చేసుకొనేవారు. రోజూ రాత్రి కోటలోని అనేక స్థలాలలో దివిటీలు వెలిగించేవారు. ఈ దివిటీలను తయారుచేయడానికి, వాటిని కోటపైకి తీసుకువెళ్ళడానికి, ఆముదం నూనె తీయడానికి ఒక ఊరుని ప్రత్యేకంగా నిలిపి, అందులో నివసించే ప్రజలతో ఈ పనులు చేయించేవారు. అలాంటి ఊరికి దివిటిపల్లె అని పేరు వచ్చింది. అలాగే, రెండో శతాబ్దంలో ఓ కొండమీద నిర్మించిన బౌద్ధారామానికి కావలసిన దీపాలను, జ్యోతులను తయారుచేసి పం పడానికి ఒక చిన్న ఊరిని ఏర్పాటుచేశారు. బౌద్ధశిల్పులు రా త్రింబవళ్ళు శిల్పాలు చెక్కేవీలుగా వివిధ ఆకృతుల్లో దీపాలను తయారుచేసేవారు. రాతకోతలకు గాను మరింత స్పష్టమైన వెలుగుకోసం లాం తర్లు ఉండేవి. వీటిని తయారుచేయడం, రిపేరు చే యడం, దీపవ్యవస్థను కట్టుదిట్టంగా నడపడానికి కొన్ని పల్లెల్ని ఏర్పాటుచేశారు. వీటికి దీపాలపల్లెలని పేరు.
కోటలకే కాకుండా అంతఃపురాలకు, రాజాస్థాన కార్యాలయాలకు చీకటిని పారదోలే కాంతి కావాలి. స్థలాన్ని, ప్రదేశాన్ని, అవసరాన్ని బట్టి వివిధ ఆకృతుల్లో దీపాలను తయారుచేసేవారు. అనేకరకాల ఆలయాలలో ధూపదీప నైవేద్యాలకు దీపాలు కావాలి. వాటిని తయారుచేసి నిర్ణీత వేళల్లో వెలిగించడం, శుభ్రం చేయడం వంటి పనులు చేసే సేవకులను, వృత్తిపనివారిని ప్రత్యేకంగా నియమించేవారు. బ్రాహ్మణులలో కొందరిని ప్రత్యేకంగా ధూపదీపాల పర్యవేక్షకులుగా నియమించేవారు. అందుకే వీరి ఇంటి పేరు దీపాలవారు అని వచ్చింది. సుప్రసిద్ధ రచయిత పిచ్చయ్యశాస్ర్తీ ఇంటి పేరు దీపాల. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉన్న చరిత్ర పరిశోధకుడు చంద్రవౌళి ఇంటి పేరు జ్యోతి. కొలనుపాకలోని మాదిగ గురువులు/ నులక చందయ్యల గురువు ఇంటి పేరు గండాదీపం. కొలనుపాకలోని మాదిగ మఠంలో ఆరిపోని గండాదీపం వెలిగించడం వీరి బాధ్యత. అందుకే వారికి ఈ పేరు ఇంటి పేరైంది. అలా ఇప్పటికీ ఆనాటి వృత్తి, పని, ఉద్యోగం వంటి వాటి పేర్లు, పదాలు కానవస్తున్నాయి. కాని ఆ దీపాల బొమ్మల జాడలు ఎక్కడా కనబడడం లేదు.
రోమనుల కాలం నుండి వీధి దీపాలు ఉన్నాయని ప్రతీతి. ప్రాచీన భారతదేశంలో స్వయం సమృద్ధమైన పల్లెల్లో వీధి దీపాల వ్యవస్థ ఎక్కడికక్కడే ఉండేది. వీటికిముందు ఎవరి ఇంటిముందు వారు గోడలలో దీపాల గూళ్ళు ఉంచేవారు. ద్వారానికి రెండువైపులా దీపాల గూళ్ళు అనబడే దిగూళ్ళు ఉండేవి. సాయంకాలం కాగానే తప్పకుండా వీటిలో దీపాలు వెలిగించేవారు. స్ర్తిలే ఈ పని చేసేవారు. సాయంకాలాన్ని గోధూళి వేళ అనేవారు. ఇంకాస్త సమయం దాటితే దానిని దీపాలవేళ అని పిలిచేవారు. ‘దీపాలు పెట్టని వేళ దయ్యాలు తిరిగే వేళ’ అని ఒక సామెత కూడా ఉంది. పొద్దుగూకిన తరువాత నా చిన్నతనంలో మొదట మా ఇంటి ముందు దీపాలు వెలిగేవి. వీధిలో ఒక కొయ్యస్తంభంపై మూడువైపులా అద్దాల పెట్టెలో దీపం వెలిగించేవారు. నిజానికి దీపస్తంభం కిందకు దీపం పురుగులే కాదు పిల్లలందరూ చేరేవారు. చిన్న చిన్న ఆటలు ఆడేవారు. పాటలు పాడేవారు. అలసిసొలసి ఇంటికెళ్ళేవారు. మరి కొందరు విద్యార్థులు పుస్తకాలు తెచ్చుకుని అక్కడి వెలుగులో చదువుకునేవారు. వారాలబ్బాయిలూ, వీధిదీపం కింద చదువుకున్న చదువులబ్బాయిలూ ఉన్నారు. దీపం ముట్టించని గుడి పాడుబడినదై ఉంటుంది. దీపం వెలగని కొంపని దయ్యాల కొంప అనేవారు. వీధి దీపాలు ఊరికి శోభ. ఊరు కళకళలాడుతుందనడానికి వీధి దీపాలు కూడా ఒక కారణం. ఒకప్పుడు వీధి దీపాలను వెలిగించడానికి కట్టుబానిసలు ఉండేవారు. ఆ తరువాత వెట్టిచాకిరి చేసేవారిని నియమించారు. ఆ తరువాత అంటరానివారితో ఈ పని చేయించారు. వీరిని మస్కూరులు అని పిలుస్తారు. గ్రామీణ వ్యవస్థలో ఈ పనిచేయడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించేవారు. వీరికి జీతభత్యాలు ఏవీ ఉండేవి కావు. వీరిని గ్రామసేవకులు అని ముద్దుగా పిలిచేవారు. పల్లెల్లో అన్ని వీధుల్లో దీపాలు పెట్టేవారు కాదు. ఊరి పెద్దలు, దొరలు, గుడి, చావిడి వంటి ముఖ్య ప్రదేశాలలోనే వీటిని ఉంచేవారు. అంటరానివాడలలో వెలుగు నిషిద్ధం. కాని వారితో వీధి దీపాలను శుభ్రం చేయించి, నూనె పోయించి వత్తులు వెలిగించే పని చేయించేవారు. వారి జీవితాలు ఓవైపు మసిబారుతుంటే, మరోవైపు ఊరి కళ వెలిగిపోతుండేది. ఈ పనిని ఎక్కువగా కొన్ని ప్రాంతాలలో చాకళ్ళు, మంగళ్ళు, గ్రామ వెట్టివారితో చేయించేవారు.
రాత్రి వేళ పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, గుడి ఊరేగింపులలో, ఇతర సభలు, సమావేశాలు జరిగినప్పుడు కాగడాలు పట్టుకుని కొందరు మనుషులు నిలబడి ఉండేవారు. రాత్రిళ్ళలో జానపద ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు పైన చెప్పిన వారే కాగడాలను పట్టుకుని నిలుచునేవారు. నిటారుగా నిలబడి, చేతులు పైకెత్తి, రెండు చేతులతో పిడికిళ్ళు బిగించి, వెలిగే కాగడాని ఎత్తుకుని స్తంభాల్లా నిలబడేవారు. వీరిని చూస్తుంటే వీధిదీప స్తంభాలుగా కనబడేవారు. ఎంతసేపైనా వారు పని పూర్తయ్యేదాకా నిలబడవలసిందే. దీపం పురుగులు శరీరాన్ని తాకడం వల్ల గోక్కోవాలన్నా, ఎండాకాలంలో కారిన చెమటని తుడుచుకోవాలన్నా సాధ్యపడేది కాదు. దీపస్తంభాలుగా మనుషులనే వాడుకునేవారు. సాంకేతికత పెరిగినకొద్దీ మానవ అవసరం తగ్గిపోయింది. ఆముదం స్థానంలో గబ్బు నూనె (గ్యాసు నూనె) వచ్చింది. గోడల మధ్య పెట్టే దీపం గాజుగ్లాసు పలకల మధ్యకు చేరింది. కాగడాలు పోయి చేతుల్లోకి లాంతర్లు చేరాయి. లాంతర్లుపోయి ఇప్పుడు టార్చ్‌లైట్లు వచ్చాయి. పల్లెలు పెరిగి పెద్ద ఊళ్ళయ్యాయి. ఇవి బలిసి పట్టణాలయ్యాయి. మునిసిపాలిటీ వ్యవస్థ ప్రత్యేకంగా రూపొందుతూ వచ్చింది. ఈ క్రమంలో వీధి దీపాల రూపాలు మారుతూ వచ్చాయి. పిల్లతోవలు దారులయ్యాయి. దారులు రహదారులయ్యాయి. రాజమార్గాలు, విపణి వీధులు, ధనిక ప్రాంతాల ఏర్పాటు పెరిగినకొద్దీ వీధిస్తంభాల రూపం మారింది. ఆకాశంలో మినుకు మినుకుమనే చుక్కల్ని తలదనే్న వీధి దీపాలు నేలమీద వెలిశాయి. చలికీ, వర్షానికి, తుపాను గాలులకి ఎదురొడ్డి నిలిచే దీప స్తంభాలు వచ్చాయి. ఇనుముతో రకరకాల అందమైన నమూనాలతో అలంకరించుకున్నాయి. ఇక ఒక దీపం సరిపోకపోతే ఒకే దీప స్తంభానికి రెండు లేదా మూడు దీపాలు అమర్చేవారు.
1417లో లండన్ మేయర్ వీధివీధినా దీపాలు వెలిగించాలని ఉత్తర్వులు జారీచేశాడు. నగరంలో వీధిదీపాల తొలి వ్యవస్థకు ఇది అంకురార్పణగా చరిత్రకారులు భావిస్తారు. 1810లో మొదటిసారిగా గ్యాస్‌లైట్లు ఉపయోగించారు. 1816లో అమెరికాలో వీధిదీపస్తంభాలపై గ్యాసు దీపాలు పాదం మోపాయి. పారిస్‌లో 1878లో విద్యుత్ వీధిదీపాలు చోటుచేసుకున్నాయి. విద్యుత్ బల్బు కనిపెట్టిన వెంటనే ఇది సాధ్యమైంది. యూరప్‌లో 1930లో లోప్రెజర్ సోడియం లాంపులు వచ్చాయి. 1962లో ఎల్‌ఇడి బల్బులు, 1965లో హెచ్‌ఐడి బల్బులు వచ్చాయి. ఇంటింటికి విద్యుత్ ప్రసారం లభించాక వెలుగు పెరిగింది. వీధుల్లో కాంతి తరిగింది. లెడ్ బల్బులు చౌకగా, నాణ్యంగా తయారవుతున్నాయి. ఇప్పుడు అనేక నగరాలు లెడ్ దీపాల కాంతులు ప్రసరిస్తున్నాయి. ఐనా వీధిస్తంభాలు నిటారుగా నిలబడే ఉన్నాయి.
వీధి దీపాల ధగధగలు పట్టణాలు, నగరాల కీర్తికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. కానీ బాధ ఏమిటంటే, మన దేశంలో మన నేలమీద గతంలో ఉపయోగపడిన వీధి దీప స్తంభాల బొమ్మలు, ఛాయాచిత్రాలు ఏవీ అందుబాటులో లేకపోవడం. *