తెలంగాణ

రాష్ట్రంలో 112 బిసి కులాల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 28: ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వేర్పడిన అనంతరం 112 బిసి కులాలను ప్రభుత్వం గుర్తించిందని శాసన సభ బిసి సంక్షేమ కమిటీ చైర్మన్ గంగాధర్‌గౌడ్ వెల్లడించారు. బిసిల సమస్యలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటి శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించింది. బిసి సంఘాలు అందజేసిన విజ్ఞప్తులను స్వీకరించింది. ముందుగా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. తెలంగాణాలోని పాత, కొత్త జిల్లాల్లో పర్యటించి బిసిల సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు మూడు జిల్లాల్లో 11 సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 134 బిసి కులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 112కు తగ్గిందన్నారు. ఎ, బి, సి, డి, ఇ గ్రూపుల్లోని కొన్ని కులాల వారు తమ గ్రూపులను మార్చాలని కూడా విజ్ఞప్తులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే రుణాల్లో బ్యాంకర్ల నిర్లక్ష్య వైఖరులు, చట్ట సభల్లో బిసిలకు రిజర్వేషన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో బిసిలకు ప్రత్యేక కోటా, జనాభా ప్రతిపాధికన బడ్జెట్ కేటాయింపులు, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు, బిసిలకు విద్యావకాశాలు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పావులా వడ్డీ రుణాలు తదితర అంశాలపై బిసి సంఘాల నుంచి విజ్ఞప్తులు అందుతున్నట్లు వెల్లడించారు. అందరి విజ్ఞప్తులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాధాన్యతను బట్టి అన్ని క్రోడీకరించి వచ్చే బడ్జెట్ నాటికి ప్రభుత్వానికి పూర్తి నివేధికలు అందించనున్నట్లు వివరించారు. బిసిల సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి బిసిలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కార్యాలయాల కొరత ఉండటంతో ఆయా జిల్లాల్లో పర్యటించడం లేదని, త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి బిసిల సమస్యలను తెలుసుకునేందుకు కమిటీ కృషి చేస్తుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఫారూక్ హుస్సేన్, చింతా ప్రభాకర్, ఆర్.క్రిష్ణయ్య, విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ తదితరులు పాల్గొన్నారు.