తెలంగాణ

మగబిడ్డ కోసం 13 ప్రసవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జనవరి 29: ఆడపిల్లల పట్ల ఎంతటి వివక్ష కొనసాగుతుందో ఆ గిరిజన జంటను చూస్తే తెలుస్తుంది. ఆడైనా మగైనా ఒక్కటే అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేస్తున్నా గిరిజనుల్లో నెలకొన్న భావనను మాత్రం తొలగిపోవడం లేదు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామపంచాయతి పరిధి లోని పోల్యానాయక్‌తండాకు చెందిన రమావత్ కమ్లి, చంద్రు అనే దంపతులు మగసంతానం కోసం తాపత్రయపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్కటి కాదు, రెండు కాదు మగసంతానం కోసం కమ్లి 13 కాన్పులు చేయించుకుందంటే ఆమె ఆరోగ్య పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. ఈమె ఇప్పటి వరకు 13 కాన్పులు చేయించుకోగా అందరూ ఆడపిల్లలే పుట్టారు. అంగన్‌వాడి రికార్డు ప్రకారం ఈ నెల 11 న తండాలోని సొంత ఇంట్లో కాన్పు అయిన కమ్లి 13 వ కాన్పులోనూ ఆడపిల్లలకు జన్మనివ్వడంతో ఆ బిడ్డను సాకలేక ఐసిడి ఎస్ సిబ్బందికి అప్పగించడంతో అధికారులు ఆ శిశువును నల్లగొండలోని శిశుగృహకు తరలించారు. అయితే 13 మంది సంతానంలో శిశుగృహకు అప్పగించిన చిన్నారితో కలిపి ఆరుగురు పిల్లలు మాత్రమే బ్రతికి ఉండగా 7 గురు ఆడపిల్లలు మాత్రం మరణించారు. అయితే వీరందరిదీ సాధారణ మరణమా లేక హత్యకు గురయ్యారా అనేది తేలాల్సి ఉంది. కమ్లి, చంద్రు దంపతుల పెద్ద కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా కొడుకు కోసం తల్లి ఇప్పటికీ కాన్పు చేయించుకుంటుందంటే కొడుకు పై వీరికి ఎంత ఆపేక్షో తెలుస్తోంది. మరీ దారణమైన విషయం ఏంటంటే బడీడు వయస్సు ఉన్న నలుగురు అమ్మాయిలలో ఒక్కరూ కూడా పాఠశాలకు వెళ్ళడం లేదు. దీనిపై అధికారులు విచారణ చేయాల్సి ఉంది.
మగ సంతానం కోసం పోల్యానాయక్‌తండాకు చెందిన రమావత్ కమ్లి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి 13 కాన్పులు చేయించుకుంటున్నా ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించలేని స్ధితిలో ఐసిడి ఎస్ సిబ్బంది ఉన్నారు. మగబిడ్డ పుట్టేంత వరకు ఆపరేషన్ చేయించుకోనని కమ్లి చెపుతుండడంతో ఐసిడి ఎస్ సిబ్బంది ఆమె మనస్సు మార్చలేక తమ ప్రయత్నాలను మానుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం కమ్లి 10 వ కాన్పు కాగానే ఆమెకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు అధికారులు యత్నించినా ఆమె రక్త హీనతతో బాధపడుతుండడంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయలేదు. ఆ తర్వాత అధికారులు ఆమె సంగతిని మర్చి పోవడంతో కమ్లి మరో మూడు కాన్పుల్లో ఆడపిల్లలకు జన్మనిచ్చి అనాధలుగా మార్చింది. అధికారులు ఇప్పటికైనా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె లో మార్పు తీసుకురాకపోతే మరి కొంత మంది అమ్మాయిలు అనాధలుగా మారే ప్రమాదం ఉందన్న వాదనలు వినపడుతున్నాయి.

చిత్రం..సంతానంతో కమ్లి