తెలంగాణ

సంక్షేమ శాఖలో ‘సంక్షోభం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల్లో ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడ్డ వెంటనే భారీ సంక్షోభం ఏర్పడింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో తమ (రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్లు) సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని కె.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమల్లోకి రాలేదని ఎస్‌సి సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థలు, బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, ఇతర సంక్షేమ గురుకుల పాఠశాలల్లో టీచర్లు, ఇతర పోస్టుల నియామకం కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ జారీ చేయగానే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సంక్షేమ పాఠశాలల్లో మొత్తం 7306 పోస్టులను భర్తీ చేసేందుకు రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ ఇవ్వగా, వీటిలో దాదాపు 5,300 పోస్టులు టీచర్ల పోస్టులే. టిఎస్‌పిఎస్‌సి రెగ్యులర్ టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయగానే, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలంటూ ఆందోళన బాట పట్టారు. తొలుత తమ సర్వీసులను క్రమబద్ధీకరించి, తర్వాత రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు హైదరాబాద్ (మసాబ్ ట్యాంక్)లోని సంక్షేమ భవన్‌కు వస్తున్నారు. సంక్షేమ భవన్ వద్ద బుధవారం వందలాది మంది కాంట్రాక్ట్ టీచర్లు ధర్నా చేయగా, గురువారం రోజు సంక్షేమ భవన్‌ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) కార్యాలయం వద్ద కూడా బుధవారం కాంక్రాక్ట్ టీచర్లు ఆందోళన చేయగా, ఈ కార్యాలయం వద్ద కూడా గురువారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా, ఆందోళన చేసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి తదితర సంక్షేమ శాఖల కార్యాలయాలున్న సంక్షేమ భవన్‌లోకి వెళ్లేందుకు సవాలక్ష ఆంక్షలు విధించారు. ఆందోళనకు వచ్చారన్న అనుమానం వచ్చిన ఎవరినీ కూడా సంక్షేమ భవన్‌లోకి అనుమతించలేదు. సంక్షేమ భవన్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిని కూడా గుర్తింపు కార్డులు ఉంటే తప్ప లోనికి పోయేందుకు అనుమతించడంలేదు. సంక్షేమ భవన్ చుట్టుపక్కల కూడా ఎవరినీ పోలీసులు గుమికూడనివ్వడం లేదు. తెలంగాణ ఎస్‌సి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రెగ్యులర్ ఉద్యోగులు దాదాపు 4000 మంది ఉండగా, కాంట్రాక్ట్ ఉద్యోగులు 650 మంది వరకు ఉన్నారు. వీరంతా పదేళ్ల నుండి కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్నారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్ట్ టీచర్ల స్థానంలో పార్ట్‌టైం టీచర్లు పనిచేస్తున్నారు. పార్ట్‌టైం టీచర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, పార్ట్ టైం టీచర్లకు ఈ అవకాశం కూడా లేదు. పైగా రెగ్యులర్ ఐనా, కాంట్రాక్ట్ ఐనా, పార్ట్‌టైం అయినా వారి విద్యార్హతలు ఒకే విధంగా ఉన్నాయి. అందరూ కూడా టీచర్ ట్రైనింగ్ పొందిన వారే. టీచర్ ట్రైనింగ్ ఒకే విధంగా ఉన్నప్పటికీ, నియామకాల్లో వేర్వేరు విధానాలు ఉండటంతో వారి వేతనాల్లో కూడా భారీ తేడాలున్నాయి. బిసి గురుకుల పాఠశాలల్లో 44 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజెపిటిబిసిడబ్ల్యూ ఆర్‌ఇఐఎస్) కార్యదర్శి మల్లేశ్ భట్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి గురుకులాల పాఠశాలలకు ఐఎఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
రెగ్యులర్ టీచర్లకు దాదాపు 50 వేల రూపాయలు ఆపైగా వేతనం వస్తుండగా, కాంట్రాక్ట్ టీచర్లకు 24 వేల రూపాయలలోపే వేతనం వస్తోంది. పార్ట్‌టైం టీచర్లకు కేవలం 7,500 రూపాయలు మాత్రమే లభిస్తున్నాయి. ప్రభుత్వం ఒకే పనికి వేర్వేరుగా వేతనాలు చెల్లిస్తోంది. కాంట్రాక్ట్ టీచర్లు కానీ, పార్ట్‌టైం టీచర్లు కాని విధులకు డుమ్మా కొట్టి ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. దాంతో న్యాయం చేయాలంటూ ఆందోళన కూడా చేయలేని దుస్థితిలో ఉన్నామని గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు భయపడుతున్నారు.