ఆంధ్రప్రదేశ్‌

డెల్టాలకు రాజకీయ గ్రహణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 18: నాగార్జునసాగర్, కృష్ణాడెల్టాల ఆధునీకరణకు రాజకీయ గ్రహణం పట్టింది. దశాబ్ద కాలంగా పనులు ముందుకు సాగటంలేదు. మట్టి పనులతోనే ఏటా సరిపెడుతున్నారు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో ప్రతి ఏటా ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందకపోగా వరద ముంపుతో ఊళ్లు సెలయేళ్లులా మారుతున్నాయి. కొందరు నేతల ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్య సంస్థలే ఆధునీకరణ పనులు చేపట్టటంతో అధికారులు అదేమని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు. కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాల ఆధునీకరణకు ప్రపంచ బ్యాంకు గత పదేళ్ల క్రితం 5వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో గుంటూరు జిల్లా పశ్చిమ డెల్టాకు రూ. 2206 కోట్లు కేటాయించారు. అయితే దీర్ఘకాలిక ప్రాతిపదికన పనులు నిర్వహించేందుకు కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాకపోవడంతో ప్యాకేజీలుగా వర్గీకరించారు. ఈమేరకు కృష్ణా పశ్చిమ డెల్టాను ఇరిగేషన్ పరిధిలో 11 ప్యాకేజీలు, డ్రైనేజీ శాఖ పరిధిలో మరో 8 ప్యాకేజీలుగా పనులు చేపట్టేందుకు కొన్ని కాంట్రాక్టు సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో మాజీ ఎంపి, ప్రస్తుత బిజెపి నేత కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెందిన రాంకీ ఫౌండేషన్, హైదరాబాద్‌కు చెందిన మెసర్స్ ఎస్‌ఇడబ్ల్యు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థలు పనులు చేపట్టాయి. ఆధునికీకరణ పనుల పురోగతిలో మితిమీరిన జాప్యం జరుగుతున్నా అధికారులకు పట్టటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు నివేదికను పరిశీలిస్తే పశ్చిమ డెల్టా పరిధిలో 8 ప్యాకేజీలకు రూ. 835.31 కోట్లకు గాను రూ. 363.01 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ఇంకా రూ. 472 కోట్ల మేర పనులు ఈ ప్యాకేజీల కింద పూర్తికావాల్సి ఉంది. మిగిలిన ప్యాకేజీలకు సంబంధించిన పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. వీటికి సవరించిన అంచనాలతో ప్రతిపాదనలు ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఓగ్ని తుపాను సందర్భంగా కృష్ణాడెల్టాకు అపార నష్టం జరిగింది. ఇరిగేషన్, డ్రైనేజీ కాల్వలు ఏకమై ఊళ్లను ముంచెత్తాయి. ఈనేపథ్యంలో ఆధునీకరణ అవసరం తెరపైకి వచ్చింది. అప్పట్లో ప్రభుత్వం రూ. 5వేల కోట్ల అంచనాలతో ప్రపంచ బ్యాంక్‌కు నివేదిక అందజేసింది. ఈమేరకు రుణం మంజూరైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డెల్టా పనులు పూర్తికాలేదు. రాజధాని ముంపు ముప్పునకు కారణమైన కొండవీటి వాగు డైవర్షన్ స్కీము నీటిని కూడా కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వ మీదుగా దిగువకు వదిలే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అటు ఆధునీకరణకు నోచుకోక, ఇటు అదనంగా వరద నీరు తోడైతే పశ్చిమ డెల్టా భవితవ్యం ప్రశ్నార్థకం కానుందనే ఆందోళన వ్యక్తవౌతోంది. కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టా పరిధిలో 13.5 లక్షల హెక్టార్ల భూమి సాగవుతోంది. పట్టిసీమ పనిలో భాగంగా కృష్ణా జిల్లాలో బుడమేరుకు మోక్షం లభించింది. మిగిలిన ప్రధాన కాల్వల పనులు పూర్తికాలేదు. పశ్చిమ డెల్టాలో 50 శాతం పనులు మిగిలి ఉన్నాయి. నాలుగేళ్ల దీర్ఘకాలిక ప్రాతిపదికన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. పనుల్లో జాప్యం జరగడంతో ఏటా అంచనాలు పెరుగుతున్నాయి. సకాలంలో పూర్తిచేయని కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెడతామని ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో హైలెవల్ కమిటీ తిరిగి పై సంస్థలకే కాంట్రాక్టును పొడిగించటం గమనార్హం.
ఇదిలావుంటే, నాగార్జున సాగర్ డెల్టా ఆధునికీకరణలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల పొంతన లేని లెక్కలతో పనులు సైతం ముందుకు సాగటంలేదు. వీటిపై వివరణ కోరుతుంటే రాజకీయంగా ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇవన్నీ మీకు తెలియనివి కావని సెలవిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీ పంటలకు సాగర్ కుడికాల్వ పరిధిలోని రైతులు నోచుకోలేదు. ఒకరకంగా ఇక్కడ అనధికారిక క్రాప్‌హాలిడేను ప్రకటిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ ఆధునీకరణకు ప్రపంచ బ్యాంక్ రూ. 2832.7 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలో ప్రధాన, బ్రాంచి కాల్వల ఆధునీకరణకు రూ. 374 కోట్లు కేటాయించారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, సాగునీటి సంఘాలకు మరో రూ. 610 కోట్ల మేర పనులు అప్పగించారు. సాగర్ కుడి ప్రధాన కాలువ పరిధిలో 8, 9 మినహా 10, 11, 12 ప్యాకేజీల పనులు ఇప్పుడే ప్రారంభమైనట్లు అధికారులు చెపుతున్నారు. ప్యాకేజీ-19 కింద బెల్లంకొండ - జూలకల్లు బ్రాంచ్ కెనాల్, 20 పరిధిలోని గుంటూరు బ్రాంచ్ కెనాల్, 21వ ప్యాకేజీగా అద్దంకి బ్రాంచ్ కెనాల్ మట్టి పనులు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీ కమిటీల పరిధిలో 30 ప్యాకేజీల పనులు కూడా ఇంకా పూర్తికాలేదు. ప్రధాన కాల్వ ప్యాకేజీ కింద ఇప్పటివరకు రూ. 395.38 కోట్లు ఖర్చుకాగా డిసిల పరిధిలో రూ. 214.9 కోట్లు వెచ్చించారు. నీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించి మరో 30 ప్యాకేజీ పనులు పురోగతిలో ఉన్నాయని, వీటికి రూ. 189.2 కోట్లు నిధులు కేటాయించినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మొత్తం ప్యాకేజీ పనుల్లో ఏఒక్కటీ పూర్తికాలేదనేది బహిరంగ రహస్యం. సాగర్ కుడికాల్వ ఆధునీకరణ పనులను ఖమ్మం ఎంపి పొంగులేటి సుధాకర్‌రెడ్డి (టిఆర్‌ఎస్)కి చెందిన సంస్థతో పాటు నల్గొండ జిల్లా కాంట్రాక్టు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది పుష్కరాల వల్ల ఆధునీకరణ పనులు జరగలేదని అధికారులు చెపుతున్నా దశాబ్దకాలంగా ఎందుకు జాప్యం జరిగిందనే విషయమై సమగ్రమైన సమాచారం లేదు. ఇప్పటికైనా కృష్ణాడెల్టా, సాగర్ ఆధునీకరణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే భవిష్యత్తులో అనర్థాలు తప్పవనే భయాందోళనలు వ్యక్తవౌతున్నాయి.

నత్తనడకన జరుగుతున్న ఆధునీకరణ పనులు (ఫైల్ ఫొటో)