తెలంగాణ

గద్దె దించుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఫిబ్రవరి 19:రానున్న 2019 ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించుతామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్‌సింగ్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బిజెపి, తెరాస ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని, పాలక పక్షాల తీరును గమనిస్తున్న ప్రజలు వాటికి బుద్ధిచెప్పేందుకు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్‌లో నిర్వహించిన జన ఆవేదన సమ్మేళనంలో దిగ్విజయ్ పాల్గొని ప్రసంగించారు. ఎఐసిసి కార్యదర్శి రామచంద్ర కుంతియా, టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపిలు విహెచ్, యాష్కీ తదితరులు హాజరయ్యారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల అమలు, వంద రోజుల్లో నిజాం షుగర్స్ స్వాధీనం వంటి వాగ్దానాలన్నీ బుట్టదాఖలయ్యాయని విమర్శించారు. అటు యుపిఎ ప్రభుత్వం కూడా దేశ హితం కోసం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని చెబుతూ సామాన్య ప్రజానీకాన్ని ఎనలేని ఇక్కట్లకు గురి చేసిందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఎంత నల్లధనం వెనక్కి వచ్చిందో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. బడా కంపెనీలు, కార్పొరేట్ సంస్థలకు ఇతోధికంగా ప్రయోజనం చేకూర్చేందుకే ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేశారని, దీనివెనుక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని దిగ్విజయ్ ఆరోపించారు. మైనార్టీల ఓట్లను చీల్చి బిజెపికి సహకారం అందించేందుకే ఎంఐఎం ముస్లింలను రెచ్చగొడుతూ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలబెడుతోందని ఆయన ఆరోపించారు. బిహార్ ఎన్నికల సందర్భంగా బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో అక్బరుద్దీన్ ఒవైసి అర్ధరాత్రి సమయంలో రహస్యంగా భేటీ అయ్యి ముస్లింల ఓట్లను చీల్చేందుకు అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపేందుకు 400 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని దిగ్విజయ్ తీవ్రమైన ఆరోపణ చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ ఎంఐఎం ఇదే పంథాను అనుసరిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లను వర్తింపజేసింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని విస్మరించరాదని, ఈ రిజర్వేషన్ వల్ల వేలాదిమంది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందగలిగారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తన కుటుంబ ప్రయోజనాలు తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని ధ్వజమెత్తారు. కేవలం ఇద్దరు ఎంపిలతోనే తెలంగాణ ఏర్పాటయ్యేదా? అని ప్రశ్నిస్తూ, సోనియాగాంధీ, మన్మోహన్‌ల చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని స్పష్టం చేశారు. తెలంగాణను కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే తెరాస లబ్ధి పొందగలిగిందని, అయితే ఈ రెండున్నర సంవత్సరాలలో కెసిఆర్ ప్రభుత్వ తీరును గమనిస్తున్న ప్రజలు కాంగ్రెస్‌కు మళ్లీ పట్టం కట్టేందుకు ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని అన్నారు.

చిత్రం... నిజామాబాద్‌లో ఆదివారం నిర్వహించిన జన ఆవేదన సభలో ప్రసంగిస్తున్న కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్