తెలంగాణ

గొడవల సృష్టికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: వామపక్ష విప్లవ సంస్థలను కలుపుకొని గొడవలు సృష్టించేందుకు జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఎంపి మల్లారెడ్డి, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి కలిసి సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కోదండరామ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గత 15 రోజుల నుంచి నిరుద్యోగ ర్యాలీ పేరుతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించిన కోదండరామ్ కాకిలెక్కలు చెబుతూ విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని 16వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 16వందల ఉద్యోగాలే ఇచ్చారని ఒకసారి, పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చారని ఒకసారి చెప్పారని అన్నారు. కోదండరామ్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని కెసిఆర్ అనలేదని, కానీ అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 86లక్షల కుటుంబాలు ఉన్నాయని, ఇంటికో ఉద్యోగం చొప్పున 86లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, ఇప్పటికే రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, మిగిలిన లక్ష ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయడానికి వీలుందని చెప్పారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా 34వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ అయ్యాయని, 24 నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటికే 5,936 పోస్టులు భర్తీ చేశారని, కొత్త ఉద్యోగులు విధుల్లో కూడా చేరారని చెప్పారు. సింగరేణి, ఆర్టీసి, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూటరీ సంస్థలలో 28,627 పోస్టులను భర్తీ చేసినట్టు తాజాగా 1042 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినట్టు చెప్పారు. గుడుంబా కేంద్రంగా ఉన్న దూల్‌పేట బస్తీని గుడుంబా రహితంగా మార్చడమే కాకుండా ఆ ఒక్క బస్తీలోనే 240 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు.
బాల్కసుమన్ బహిరంగ లేఖ
విద్యార్థులు, నిరుద్యోగులను కోదండరామ్ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని , ఆయన మాటలు నమ్మవద్దని కోరుతూ టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్ బహిరంగ లేఖ రాశారు. విద్యార్థుల సందేహాలను తీర్చాల్సిన ప్రొఫెసర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతుండగా, విద్యార్థులను రెచ్చగొడుతూ కోదండరామ్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి,
ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపి మల్లారెడ్డి