తెలంగాణ

మోదీ, కేసిఆర్.. దొందూ దొందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 20: కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ ఇద్దరూ అబద్దాలే చెబుతారని, ఒలింపిక్స్‌లో అబద్దాల పోటీ పెడితే నరేంద్రమోదీ బంగారు పతకం సాధిస్తారని జాతీయ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన జన ఆవేదన సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో భారతదేశం నుండి దోచుకుని వెళ్ళి విదేశాల్లో దాచిపెట్టిన 40లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని స్వదేశానికి తీసుకువచ్చి, సామాన్యుడి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి మరచారని చెప్పారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి మరచారని తెలిపారు. గుజరాత్ మాదిరిగా అభివృద్ధి చేస్తారని అనుకున్నా చేయలేదని పేర్కొన్నారు. ఎట్టకేలకు మోసపూరిత మాటలతో ఎన్నికల్లో గెలిచారని అన్నారు. బిజెపికి చెందిన సిఎం, మంత్రులు అవినీతితో సంపాదనపై దృష్టి పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు ఆధార్, జిఎస్‌టిలను వ్యతిరేకించిన బిజెపి నాయకులు ఎలాంటి కొత్త పథకాలకు రూపకల్పన చేయలేదని ఎద్దేవా చేశారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాట్‌అప్ పేర్లను పాత పథకాలకే పెట్టి కొనసాగిస్తున్నారని వివరించారు. 60 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదని తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. గత ఏడాది నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో మహిళలు ఇళ్లలో దాచుకున్న నోట్లతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. టెర్రరిస్టులను, నల్లధనాన్ని రూపుమాపేందుకే నోట్ల రద్దని చెప్పారని, కానీ నల్లధనం మార్పిడి దొడ్డిదారిన జరిగిపోయిందని తెలిపారు. ఎవరి వద్ద ఎంత నల్లధనం దొరికిందో వెల్లడించకపోవడం ప్రభుత్వ విఫలానికి నిదర్శమని పేర్కొన్నారు. నల్లధనం రియల్ ఎస్టేట్, బంగారం, విదేశాల్లో దాచారని స్పష్టం చేశారు. నల్లధనం ఉన్న వారికి నోట్ల రద్దుతో ఎలాంటి ఇబ్బంది కలగలేదని, ఇబ్బంది కలిగిందల్లా సామాన్య జనానికేనని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల కోసం క్యూలో నిలబడిన పేదవారు ఉపాధిని కోల్పోగా మరికొందరు ప్రాణాలే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ ద్వారా లావాదేవీలు ఎంతమందికి సాధ్యమవుతాయని ప్రశ్నించారు. దినసరి కూలీగా పనిచేసేవాడికి, కూరగాయలు అమ్మే వాడికి కార్డు ద్వారా లావాదేవీలు జరపగలరా అని అన్నారు. హ్యాకింగ్‌తో ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్నారని, బంగ్లాదేశ్ రిజర్వ్ బ్యాంక్‌లో రూ.400 కోట్లు, రష్యాలో రూ.2.25 కోట్లు కాజేశారని వివరించారు. బీదవాడి కార్డు నుండి డబ్బులు హ్యాకింగ్ ద్వారా కాజేస్తే ఏ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి, డబ్బులు ఎవరు ఇప్పిస్తారని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో లాభం జరిగింది కేవలం పేటిఎం, మాస్టర్, విస కార్డుల నిర్వాహకులకి, దొడ్డి దారిన నోట్ల మార్పిడి చేసిన బ్యాంకు సిబ్బందికేనని చెప్పారు. స్వయానా బిజెపి బడానేత అమిత్‌షా గుజరాత్‌లోని కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా కోటికి 70 లక్షల చొప్పున నోట్ల మార్పిడి చేశారని ఆరోపించారు. అమిత్‌షాపై కేసుతో గుజరాత్‌కు చాలా రోజులు దూరంగా ఉన్నాడని గుర్తు చేశారు.
దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామన్న హామీలను కేసిఆర్ తుంగలో తక్కారని విమర్శించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజురీయంబర్స్‌మెంట్ ఇవ్వనందున కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. కేసిఆర్ దోచుకున్నదంతా కేసిఆర్, అతని కొడుకు, కూతురు, అల్లుడి జేబులోకి వెళుతోందని అన్నారు. ఇతర మంత్రులకు కుర్చీలు ఇచ్చారు తప్ప అధికారాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. దేశంలోని పేదలు, హిందూ, ముస్లింల ఐక్యత కోసం కాంగ్రెస్ నాయకులు పాటుపడాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు.

చిత్రం..జన ఆవేదన సభలో మాట్లాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్