రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు ఉజ్వల భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 22: శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వాదంతో తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని, భారత దేశంలోనే అగ్ర రాష్ట్రాలుగా నిలవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో తులతూగాలని కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన కుటుంబీకులతో కలసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుమలలో అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న కెసిఆర్ బుధవారం ఉదయం 8 గంటలకు స్వామిని దర్శించుకున్నారు. కెసిఆర్ దంపతులు మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించగా ఆయన వెంట వచ్చిన మంత్రులు, అధికారులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వచ్చారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ కెసిఆర్ తన కుటుంబీకులతో కలసి ముందుగా భూ వరాహమూర్తిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో పుణ్య జలాలను చల్లుకున్నారు. వరాహస్వామి దర్శనానికి కెసిఆర్ ఆయన సతీమణి బ్యాటరీ వాహనంలో ఆలయానికి వెళ్ళారు. అనంతరం శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న కెసిఆర్ దంపతులకు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ డాక్టర్ డి సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇస్తికపాల్ స్వాగతం పలికి ఆలయ సాంప్రదాయంతో ఆలయంలోకి తీసుకెళ్లారు. సుమారు పది నిమిషాలపాటు కెసిఆర్, కుటుంబీకులు మూలవిరాట్‌ని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రమణ దీక్షితులు తిరుమల క్షేత్ర మహిమ, స్వామివారి వైభవాన్ని, ఆభరణాల విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా టిటిడి తరపున కెసిఆర్‌కు ఆలయ ప్రధాన అర్చకులు శేష వస్త్రాన్ని బహూకరించారు. అనంతరం స్వామి మాతృమూర్తి వకుళమాతను దర్శించుకుని ఆనంద నిలయం ప్రాకారం ప్రదక్షిణచేసి ఉత్తరదిశలో ఆనంద నిలయంపై ఉన్న విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సబేరా గదిలో స్వామివారి శేష వస్త్రాన్ని కళ్లకు అద్దుకున్నారు. అక్కడ నుంచి హుండీలో కానుకలను సమర్పించి, యోగ నరసింహస్వామిని దర్శించుకుని ధ్వజ స్థంభానికి నమస్కరించుకుని రంగనాయక మండపానికి చేరుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా టిటిడి చైర్మన్, ఇఓ, జెఇఓలు కెసిఆర్ దంపతులుకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. అక్కడ నుంచి ఆలయం వెలుపలికి వచ్చిన కెసిఆర్ మీడియా పాయింట్ వద్ద రెండు నిమిషాలు ముచ్చటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రభుత్వం తరపున స్వామికి చెల్లిస్తానన్న మొక్కులు తీర్చుకోవడానికే తిరుమల వచ్చానన్నారు. ఉభయ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడిచి దేశంలోనే అగ్రగామిగా కొనసాగే ఉజ్వల భవిష్యత్ అందించాలని దేవుని ప్రార్థించినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు ఉజ్వలంగా ఉంటాయని, సమస్యలన్నీ తొలగిపోతాయన్నారు. హైదరాబాదులో టిటిడి నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందిస్తారా అన్న ప్రశ్నకు భగవంతుడు సర్వాంతర్యామి అని, ఆయనకు ప్రాంతీయ భేదాలు ఉండవని, ఎవరైనా ఆయన చల్లని చూపులతోనే బాగుంటారన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని టిటిడి చైర్మన్, ఇఓ, జెఇఓలు అద్భుతంగా చేయించారని ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాసులు రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కెసిఆర్ కుమార్తె, ఎంపీ కవిత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, జిహెచ్‌ఎంసి చైర్మన్ రామ్మోహన్ ఉన్నారు. టిటిడి బోర్డు సభ్యులు చింతల రామచంద్రారెడ్డి, జి భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌లతోపాటు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి తుడా, మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు శ్రీదేవి, పెనుబాల చంద్రశేఖర్ తదితరులున్నారు.

చిత్రం... తిరుమల వెంకన్నకు సమర్పించడానికి ముందు రంగ మంటపంలో
సువర్ణ్భారణాలకు పూజలు చేస్తున్న తెలంగాణ సిఎం కెసిఆర్ దంపతులు